ఢిల్లీలో భానుడు భగభగ...

- June 20, 2024 , by Maagulf
ఢిల్లీలో భానుడు భగభగ...

న్యూ ఢిల్లీ: ఉత్తర భారత్‌లో భానుడు భగభగ మండిపోతున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ, హరియాణా, ఝార్ఖండ్, జమ్మూ కశ్మీర్‌, బిహార్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఢిల్లీలో ఎండ దెబ్బకు జనమంతా పిట్టల్లా రాలిపోతున్నారు. జూన్ 11 నుండి 19 వరకు వడదెబ్బ కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయులు మృతిచెందారు.

హీట్‌వేవ్‌ల కారణంగా మృతి చెందిన వారిలో క్లెయిమ్ చేయని మృతదేహాలలో 80 శాతం నిరాశ్రయులే ఉన్నారని ఎన్‌జీఓ సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ నివేదిక వెల్లడించింది. గడిచిన 72 గంటల్లో ఢిల్లీ ఎన్సీఆర్ ఆసుపత్రుల్లో 19 మందికి పైగా మృతి చెందారు. 2019 తరువాత ఈ ఏడాదిలోనే ఎండతీవ్రతతో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

వాయు కాలుష్యం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అటవీ నిర్మూలన వంటి కారణాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, నిరాశ్రయులైన వారి పరిస్థితి మరింత దిగజారుతుందని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్
పేర్కొంది. నిరాశ్రయులైన వ్యక్తులు దీన్ దయాళ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (NULM-SUH), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుంచి మినహాయించినట్టు పేర్కొంది.

దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి జూన్ 18 వరకు 40 వేల మందికి వడదెబ్బ బారిన పడ్డారు. అధికారికంగా 110 మంది మృతి చెందినట్టు నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో ఎండదెబ్బకు 17 మంది మృతిచెందారు. వేడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com