విప్లవ వీరుడు-అల్లూరి
- July 04, 2024
బ్రిటిష్ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి సీతారామరాజు. నేడు స్వాతంత్ర సమరయోధుడు, భారత మాత ముద్దుబిడ్డ అల్లూరి జయంతి.
సీతారామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్ (బెంగాల్) తిరుగు బాటు భారతభూమిలో తొలి గిరిజనోద్యమం. 1922-24 మధ్య విశాఖ మన్యంలో జరిగినది తుది గిరిజన పోరాటం. కానీ మిగిలిన ఉద్యమాల చరిత్ర మీద ప్రసరించిన వెలుగు రామరాజు పోరు మీద కానరాదు.
చోటానాగ్పూర్, రాంచీ పరిసరాలలో ముండా గిరిజన తెగ బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసింది. దీనినే ఉల్గులాన్ అంటారు. బీర్సా ముండా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇది 1899-1900 మధ్య కొన్ని నెలలు జరిగింది. బీర్సా జీవితం, ఉద్యమం అద్భుతమైన విషయాలు. కానీ ఆయన ఉద్యమం పది నెలలు మాత్రమే సాగింది. రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సమీకరించి ఆ ఉద్యమాన్ని బ్రిటిషర్లు అణచివేశారు. కానీ రామరాజు ఉద్యమం ఆగస్ట్ 22, 1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్ మీద దాడితో మొదలై, మే 7, 1924 వరకు ఉదృతంగా సాగింది. ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాం గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు. కానీ, దీనిని గుర్తించడానికి గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు.
విశాఖ మన్య విప్లవం తెలుగు వారి చరిత్రలో, ఆ మాటకొస్తే భారత గిరిజనోద్యమ చరిత్రలోనే అద్భుత ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం తనకు ప్రేరణ ఇచ్చిందని ఆదిలాబాద్ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) కూడా ప్రకటించాడు. మరణానంతరం రామరాజు ఔన్నత్యాన్ని గాంధీజీ, సుభాశ్‌బోస్, భోగరాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటివారంతా గుర్తించి నివాళులర్పించారు.
1897, జూలై 4న అల్లూరి వేంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానం అల్లూరి సీతారామరాజు. ఆయనకు సోదరి (సీత), సోదరుడు (సత్యనారాయణ రాజు) కూడా ఉండేవారు. సీతారామరాజు విశాఖ జిల్లా భీమిలికి సమీపంలో ఉన్న పాండ్రంగిలో అమ్మమ్మ గారింట పుట్టారు. వేంకటరామరాజు స్వస్థలం ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న మోగల్లు. ఆయన పేరు ప్రజలలో సీతారామ రాజుగా స్థిరపడి ఉండవచ్చు. కానీ జాతక చక్రంలో, తరువాత ప్రభుత్వ రికార్డులలో కనిపించేది సీతారామరాజు అనే. ఒక చరిత్ర పురుషుడి అసలు పేరును కూడా అందరికీ తెలిసేటట్టు చేయకపోవడం చరిత్ర అధ్యయనానికి సంబంధించి తప్పిదమే. అందుకే ఈ వివరణ. శ్రీరామరాజు జీవితంలో సీత అనే మహిళ ఉన్నట్టు చెప్పడం కూడా సరికాదు. అందుకు ఆధారాలు లేవు.
సీతారామరాజు 1917, శ్రావణ మాసంలో విశాఖ జిల్లాలోని కృష్ణదేవిపేట వచ్చారు. అక్కడ చిటికెల భాస్కరనాయుడు అనే చిన్న భూస్వామి ఇంట చాలా కాలం ఉన్నారు. అక్కడ ఉండగానే గిరిజనులు పడుతున్న ఇక్కట్లు ఆయన దృష్టికి వచ్చాయి. ప్రధానంగా రోడ్డు నిర్మాణంలో చింతపల్లి, లంబసింగి వద్ద జరుగుతున్న ఘోరాలు తెలిశాయి. గూడెం డిప్యూటీ తహసీల్దారు అల్ఫ్ బాస్టియన్ గిరిజనులను దోపిడీ చేస్తూ రోడ్డు పని చేయించాడు. ఈ బాధలకు తోడు అడవిని రిజర్వు చేయడం గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించింది. మన్యం మునసబులను, ముఠాదారులను, గ్రామ పెద్దలను లొంగ దీసుకోవడం, మోసగించడం బాస్టియన్‌కు నిత్యకృత్యం. గాంగంతన్న బట్టిపనుకుల మునసబు. అలాగే పెద్ద వలస ముఠాదారు ఎండుపడాలు. ఈ ఇద్దరినీ కూడా బాస్టియన్ మోసగించాడు. ఈ మొత్తం అసంతృప్తి ఆగ్రహంగా మారి, ఆపై ఉద్యమ రూపం దాల్చింది. దీనికి ఇరుసుగా పనిచేసిన వారే సీతారామరాజు.
సీతారామరాజు ఉద్యమాన్ని అణచివేసేందుకు 1924 ఏప్రిల్ 17 మన్యానికి కలెక్టర్‌గా రూథర్‌ఫర్డ్‌ను నియమించారు. అతనికి విప్లవాలను అణచివేయడంతో నిపుణుడిగా పేరుంది. ఆయన కృష్ణాదేవిపేటలో సభను ఏర్పాటుచేసి వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియకపోతే ప్రజలను కాల్చివేస్తామని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న సీతారామరాజు అదే ఏడాది మే 7న తాను ఉన్న ప్రాంతాన్ని పశువుల కాపరి ద్వారా పోలీసులకు చేరవేసి మంప చెరువులో స్నానం చేస్తూ పట్టుబడ్డాడు. ఎటువంటి విచారణ లేకుండా అల్లూరి సీతారామరాజును కొయ్యూరులోని చింతచెట్టుకు కట్టి గుడాల్ కాల్చిచంపాడు. 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫొటో తీయించి కృష్ణాదేవిపేటలో దహనం చేశారు.
సీతారామరాజు మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటం తీవ్ర రూపం దాల్చి తెల్లవారిని తరిమికొట్టింది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న స్వతంత్య్ర భారతావని చరిత్రపుటల్లో సీతారామరాజు పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







