బ్యాడ్మింటన్ స్టార్..!
- July 05, 2024
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస'.. అనే సామెత మనం వినుంటాం.ఈ నానుడికి నిలువెత్తు నిదర్శనం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు.. మన తెలుగమ్మాయి.ఆమె సాధించిన విజయాలు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ క్షణాలు.బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన 8వ ఏటనే ఏ తపన ఉందో ఇప్పటికీ అదే తపన సింధులో ఉంది.నేడు సింధు పుట్టిన రోజు.
పి.వి సింధు..ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి సుపరిచరితం.ఈమె పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు.ఈమె జూలై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. సింధు తండ్రి రమణ అర్జున అవార్డు గ్రహీత. వాలీబాల్ లో ఆయన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు అందుకొన్నారు. ఆయనే ఆశర్యపోయేంత అంకితభావంతో సింధు ప్రాక్టీస్ చేసేది.
పివి రమణ దంపుతుల పూర్వీకులు ఆంధ్రప్రాంత వాసులు. సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన ఆమె.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2012, సెప్టెంబరు 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకొని మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.
ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించిన సింధు… ఆ టోర్నీలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.
ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి… ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.
2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఐదో స్థానంలో మొదలుపెట్టింది. వరుస రౌండ్లలో పై యు-పో, ఝాంగ్ బీవెన్‌లపై వరుస సెట్ల విజయాలతో ఆమె తన ఆటను ప్రారంభించింది. తాయ్ త్జు-యింగ్‌పై విజయం సాధించడంతో ఆమె అందరినీ ఆకట్టుకుంది. మొదటి రౌండ్ లో తగ్గినా 12–21, 23–21, 21–19తో తాయ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరింది. సెమీ-ఫైనల్లో, ఆమె చెన్ యుఫీని వరుస సెట్లలో ఓడించి, వరుసగా మూడవ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. నోజోమి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో, ఆమె 21–7, 21–7తో గెలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలుగా సింధు రికార్డ్ సృష్టించింది.
2021 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం, అదే ఏడాది జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ - దీన్నే అధికారికంగా దైహట్సు ఇండోనేషియా మాస్టర్స్ 2021 అని కూడా పిలుస్తారు. ఈ టోర్నీలో సింధు సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచి చేతిలో ఓటమి పాలైంది. 2022 సింగపూర్ ఓపెన్ టైటిల్ సాధించింది. ఇది తన కెరీర్‌లోనే తొలి సూపర్ 500 టైటిల్ అవడం విశేషం. ఆ ఏడాదే జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని సింగిల్స్ విభాగంలో తోలి బంగారు పతకం, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్ సమయంలో మోకాలి గాయం కారణంగా కొంత కాలం ఆటకు దూరమైనా 2023 స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్లో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచింది. ఇవే కాకుండా 2024లో జరిగిన బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్స్ లో తన నాయకత్వంలో పాల్గొన్న టీం ఇండియాకు తోలి బంగారు పతకం లభించింది.
ఇక సింధుని కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ముఖ్యంగా కోచ్ పుల్లెల గోపీచంద్ ని కాదని విదేశీ కోచ్ ని నియమించుకోవడంతో విమర్శల పాలయ్యారు. అలాగే దక్షిణ కొరియాకు చెందిన మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కిమ్ జి హ్యూన్, ఇండోనేషియా బ్యాడ్మింటన్ కోచ్ అయిన ముల్యో హాండోయో సింధుతో కలిసి కొంతకాలం పని చేశారు. తర్వాత ప్రస్తుత కొరియాకు చెందిన కోచ్ పార్క్ సాంగ్ కూడా రాజీనామా చేశారు.ప్రస్తుతం కొత్త కోచ్ కోసం సింధు అన్వేషణ మొదలుపెట్టింది.
2018లో 85 లక్షల యు.ఎస్. డాలర్ల ఆదాయంతో, 2019లో 55 లక్షల యు.ఎస్. డాలర్ల ఆదాయంతో, సింధు ఫోర్బ్స్ విడుదల చేసే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాలోకెక్కింది. అలాగే, క్రీడా రంగానికి చేస్తున్న కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింధుని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది.
121 సంవత్పరాల భారత క్రీడా చరిత్రలో ఒలింపిక్స్ లో మహిళల వ్యక్తిగత విభాగంలో భారతదేశానికి కేవలం 7 పతకాలు మాత్రమే దక్కాయి. అందులో 2 పతకాలు పి.వి.సింధు సాధించినవే కావడం విశేషం. 140 కోట్ల భారతీయుల్లో ఎవరీకీ సాధ్యం కాని రికార్డ్‌ను సాధించి దేశం గర్వించ దగ్గ ముద్దుబిడ్డ అయ్యారు సింధు. బ్యాడ్మింటన్ లో సింధు సేవలకు గాను అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్, పద్మశ్రీలతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.
ఇన్ని విజయాలు వచ్చినా సింధు ఇంకా ఉదయం 4.30 గంటలకు బ్యాడ్మింటన్ కోర్టులోనే ఉంటారు. విజయాలు మరింత శ్రమించడం నేర్పాయి సింధుకి. ఇదే అంకితభావంతో వచ్చే ఒలింపిక్స్ లో కచ్చితంగా బంగారు పతకం సాధిస్తానని మరో లక్ష్యం నిర్దేశించుకున్నారు సింధు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









