ప్రొడ్యూసర్ కమ్ హీరో-కళ్యాణ్ రామ్
- July 05, 2024
బాలగోపాలుడుగా సినీ రంగంలో అడుగుపెట్టి..‘తొలిచూపులోనే’ తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న సినీ అభిమన్యుడు.చలనచిత్ర రంగంలో ఎంతో మంది గాడ్ పాదర్స్ వున్న తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో ‘అతనొక్కడే’. సినీ నిర్మాణం అసాధ్యమనుకుంటున్న ఈ రోజుల్లో కథానాయకుడిగా..అబిరుచిగల నిర్మాత జయాలను అందుకుంటున్న ‘అసాధ్యడు’. అతడే నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీ మూడో తరం నట వారసుడైన కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు.
కళ్యాణ్ రామ్ 1978 జూలై 5న నందమూరి హరికృష్ణ, లక్ష్మీ కుమారి దంపతులకు జన్మించారు. హైదరాబాద్, విజయవాడలలో ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నాడు. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు.
కళ్యాణ్ రామ్ 1989లో తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'బాల గోపాలుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పూర్తిగా చదువుల మీదనే దృష్టి పెట్టారు. బీటెక్ పూర్తయిన వెంటనే సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు, కానీ తమ ఫ్యామిలీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వ్యక్తి ఎవరూ లేరని తండ్రి హరికృష్ణ పట్టుబట్టడంతో, విదేశాలకు వెళ్లి మాస్టర్స్ చేశారు.
2003లో ఉషా కిరణ్ బ్యానర్ లో 'తొలి చూపులోనే' చిత్రంతో హీరోగా లాంఛ్ అయ్యారు. కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అశ్వినీదత్ నిర్మాణంలో చేసిన 'అభిమన్యుడు' కూడా పరాజయం పాలైంది. ఆ తర్వాత తాత ఎన్టీఆర్ పేరు మీదుగా సొంతంగా 'ఎన్టీఆర్ ఆర్ట్స్' అనే బ్యానర్ స్థాపించి, 2005 లో రేసుగుర్రం ఫేమ్ సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన 'అతనొక్కడే' సినిమా కళ్యాణ్ రామ్ కు ఫస్ట్ సక్సెస్ రుచి చూపించింది. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా తన హోం ప్రొడక్షన్ లోనే నటిస్తూ వచ్చారు.
2006 - 2013 మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ అర డజనుకు పైగా డిజస్టర్లు అందుకున్నారు. 'అసాధ్యుడు', 'లక్ష్మీ కళ్యాణం', 'విజయ దశమి', 'జయీభవ', 'కల్యాణ్ రామ్ కత్తి', 'ఓం 3డీ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవిచూశాయి. ఇదే సమయంలో ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తూ డ్యూయల్ రోల్ ప్లే చేసిన 'హరే రామ్' మూవీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇది ఫ్లైక్యామ్ ని ఉపయోగించిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి 3డి యాక్షన్ చిత్రంగా ప్రచారం చేయబడిన 'ఓం 3డి' సినిమా వ్యక్తిగతంగా తీవ్ర నష్టాలను మిగిల్చింది.
2015 కళ్యాణ్ రామ్ నటించిన 'పటాస్' సినిమా పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు.అయితే ఆ వెంటనే వచ్చిన 'షేర్' ఫ్లాప్ గా మారింది. 2016లో పూరీ జగన్నాథ్ తో చేసిన 'ఇజం' సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్లు సాధించింది.దీనికి తర్వాత వచ్చిన 'ఎమ్మెల్యే', 'నా నువ్వే' చిత్రాలు ఫెయిల్యూర్స్ గా మారాయి.బాబాయ్ తో కలిసి నటించిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' 'ఎన్టీఆర్-మహానాయకుడు' సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ డైరెక్షన్ లో నటించిన '118' చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేసిన 'ఎంత మంచివాడవురా' (2020) మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. 2022లో వశిష్ఠ దర్శకత్వం వహించిన 'బింబిసార' సినిమా కళ్యాణ్ రామ్ కు భారీ విజయాన్ని అందించింది. దీని తర్వాత రిలీజైన 'అమిగోస్' చిత్రంలో త్రిపాత్రాభినయం చేసినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'డెవిల్ - ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకూ మల్లిఖార్జున్, సురేందర్ రెడ్డి, అనిల్ కృష్ణ, హర్షవర్ధన్, నరేన్ కొండేపాటి, సునీల్ రెడ్డి, అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, జయేంద్ర పంచపకేశన్, మల్లిడి వశిష్ఠ, రాజేంద్ర రెడ్డి, అభిషేక్ నామా వంటి 12 మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ను డైరెక్టర్ గా టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేశారు.
కళ్యాణ్ రామ్ తన బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో 10 సినిమాలను నిర్మించారు. బయట హీరోతో చేసిన ఒకే ఒక్క చిత్రం 'కిక్ 2'. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అయింది. తన సోదరుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించిన కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' పార్ట్-1 సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ చేయబోయే 'డ్రాగన్' మూవీ ప్రొడక్షన్ లోనూ పాలుపంచుకోబోతున్నారు.
కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితానికి వస్తే 2006 ఆగస్టులో డాక్టర్ స్వాతిని వివాహం చేసుకున్నారు. వీరికి తారక అద్వైత, శౌర్య రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతని బావ కొసరాజు హరి కూడా సినీ నిర్మాత. కుమార్తె పేరు మీదుగా అద్విత క్రియేటివ్ స్టూడియోస్ అనే వీడియో ఎఫెక్ట్స్ కంపెనీని ప్రారంభించారు కల్యాణ్ రామ్. ఇది లెజెండ్ , నాన్నకు ప్రేమతో, కృష్ణాష్టమి వంటి సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించింది.
విభిన్నమైన చిత్రాలతో కళ్యాణ్ రామ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే, మరోవైపు కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లతో అలరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









