తిరుమల అన్నప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయాలు

- July 10, 2024 , by Maagulf
తిరుమల అన్నప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయాలు

తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో వెలిసిన శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే వేలాదిమంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాన్ని తయారు చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.

ఇటీవల చేపట్టిన చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో జే శ్యామలరావు చెప్పారు. మరింత పెంచుతామని అన్నారు.

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు రెండు లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోంద, భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

అన్నప్రసాదం రుచి, నాణ్యతను మెరుగు పర్చడానికి ప్రముఖ వంటల తయారీ నిపుణుల కమిటీ నుంచి పలు సూచనలు, సలహాలు ఆహ్వానించామని చెప్పారు. రోజు రోజుకు పెరుగుతున్న అసంఖ్యాక భక్తుల అవసరాలకు అనుగుణంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని వంటశాలలను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో సేవలందిస్తున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం, ఇన్ హౌస్ ల్యాబ్‌ల ఏర్పాటు చేసి, నిత్యం ఆహార పదార్థాలను తనిఖీ చేయడం, పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరికరాల యాంత్రీకరణ, వేగంగా భోజనాన్ని తయారు చేయడం, ప్రతి మూడు నెలలకోసారి ఫుడ్ అనలిస్టుల ద్వారా సూచనలను తీసుకోవాడం వంటి చర్యలు తీసుకుంటామని అన్నారు.

దీనికి అవసరమైన ఏర్పాట్లపై పక్కా ప్రణాళికను రూపొందించాలని శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర, సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి నిపుణులైన అధికారులను నియమిస్తామని చెప్పారు.

15 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన అన్నపసాద తయారీ పరికరాలను మార్చి కొత్త వాటిని ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందని శ్యామలరాావు అన్నారు. అన్నప్రసాద విభాగంలో పని చేస్తోన్న సిబ్బంది సంఖ్యను కూడా పెంచనున్నట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com