ఢిల్లీలో ధర్నాకు వైసీపీ అధినేత జగన్ రెడీ

- July 19, 2024 , by Maagulf
ఢిల్లీలో ధర్నాకు వైసీపీ అధినేత జగన్ రెడీ

న్యూ ఢిల్లీ: వైసీపీ కార్యకర్తల పై జరుగుతున్న వరుస దాడులపై ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. 45 రోజుల కూట‌మి పాలనలో రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

పల్నాడు జిల్లాలో వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ లేదని.. ఏపీలో పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారని…. రాష్ట్రంలో హత్యాచారాలు జరిగినా, హత్యలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ అడిగాం… అది ఖరారు కాగానే అందరినీ కలిసి… ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. ఏపీలో ఆటవిక పాలన నడుస్తోందని.. 45 రోజుల పాలనలో 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగిందని అన్నారు. 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని వైఎస్‌ జగన్ అన్నారు.

చంద్రబాబు మాయ మాటలు, హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మా హయాంలో క్యాలెండర్ ప్రకారం పథకాలు అమలు చేశామ‌ని… రెండు క్వార్టర్లలకు విద్యా దీవెన బకాయి ఉందని అన్నారు. ఇప్పటి వరకు అమ్మ ఒడి, రైతు భరోసా ఖాతాల్లో వేసే వాళ్ళమ‌ని తెలిపారు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకి వందనం అన్నారు. ఆడపిల్లలకు రూ.1500 ఇస్తాము అన్నారు.. ఏది మ‌రి అని ప్ర‌శ్నించారు. 1.80 కోట్ల మంది 1500 కోసం ఎదురు చూస్తున్నారు. ఇవ్వండి అని డిమాండ్ చేశారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ దాడులు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com