గురు పౌర్ణమి

- July 21, 2024 , by Maagulf
గురు పౌర్ణమి

మహాభారత గ్రంధకర్త అయిన "వేదవ్యాస మహర్షి" జన్మించినది.......ఆషాడ పౌర్ణమినాడు.ఈ వ్యాసుడు, పరాశర ముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును "వ్యాసపౌర్ణమి" మరియు "గురుపౌర్ణమి" అని కూడా అంటారు. మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరచాడు. (ఋగ్గ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం).

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో2 పాదాలతో, ఈ కయుగంలో 1 పాదంతో, నడుస్తుంది.కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు.అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా....అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి---మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఒక ఉంటుంది. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు.

వేదాలని విభజించి, వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక---వేదవ్యాసుడు అని, పరాశర మహర్షి కుమారుడు గనుక ---పరాసరాత్మజుడు అని, బదరీక్షేత్రంలో నివసించేవాడు కనుక ---బాదరాయణుడు అని అంటారు.సర్వభూతముల యందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట----ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

ఇంత‌టి విశిష్ట‌త ఉన్న గురు పూర్ణిమ రోజు మ‌న‌కి జ్ఞానాన్ని అందించిన మ‌హ‌ర్షులు, రుషులు, వ్యాసుల వారిని స్మ‌రించుకోవాలి. వారికి పౌర్ణ‌మి రోజు త‌ర్ప‌ణాలు వ‌ద‌ల‌డం ప్రాధాన్యం. మ‌న స‌నాత‌న ధ‌ర్మంలో మూడు ర‌కాల సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏమిట‌న‌గా.. అద్వైతం, ద్వైతం, మ‌రియు విశిష్టాద్వైతం. ఈ మూడు సిద్ధాంతాల‌ను శంక‌రాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మ‌ధ్వాచార్యుల వారు అందించిన‌ట్లుగా ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు. వారి వారి సిద్ధాంతాల‌ను అనుస‌రించి గురు పౌర్ణ‌మి రోజు ఆ ఆచార్యుల‌ను పూజించాల‌ని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున గురు పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ పౌర్ణమి తిధి జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది. అయితే హిందూ సంప్రదాయంలో సూర్యోదయం సముయంలో ఉన్న తిధి ని పరిగణలోకి తీసుకుంటారు కనుక జూలై 21వ తేదీ ఉదయం 05:37 గంటలకు ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం అవుతుంది. అటువంటి పరిస్థితిలో జూలై 21 ఆదివారం రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు.

ఆషాఢ పౌర్ణమి రోజున స్నానం, దానం చేయాలనుకుంటే జూలై 21న ఉదయం 04:14 నుండి 04:54 వరకు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయవచ్చు. ఈ సమయంలో స్నానం చేయలేకపోతే.. సూర్యోదయం తర్వాత కూడా స్నానం చేయవచ్చు. ఆ తర్వాత సామర్థ్యం మేరకు చంద్రునికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. అయితే ఆషాఢ పూర్ణిమ ఉపవాసం ఒక రోజు ముందుగా అంటే జూలై 20న ఆచరించబడుతుంది.

గురు పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి ఇంటికి ఆహ్వానించండి. వారిని గౌరవించండి. పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి. అప్పుడు వారికి ఆహారం అందించి.. తగిన బహుమతులు ఇవ్వండి. గురువుని తృప్తిపరచి పంపండి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని విశ్వాసం. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com