యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. సౌదీ అరేబియా ఆందోళన

- July 22, 2024 , by Maagulf
యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. సౌదీ అరేబియా ఆందోళన

రియాద్: సౌదీ అరేబియా శనివారం అల్ హుదైదా గవర్నరేట్‌లో ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ ప్రాంతంలోని ప్రస్తుత ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.  గాజాపై యుద్ధాన్ని ముగించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగిస్తుందని, అల్ హుదైదాలో ఇజ్రాయెల్ దాడుల తర్వాత యెమెన్‌లో మిలిటరీ తాజా పరిణామాల పట్ల సౌదీ అరేబియా చాలా ఆందోళనతో ఉందని  విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  అంతర్జాతీయ సమాజం స్పందించాలని,  ఈ ప్రాంతంలో వివాదాలకు ముగింపు పలికేందుకు తమ బాధ్యతలను నెరవేర్చాలని పిలుపునిచ్చింది. మరోవైపు గాజాపై యుద్ధాన్ని ముగించడానికి సౌదీ అరేబియా చేస్తున్న నిరంతర ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.  యెమెన్‌లో శాంతి ప్రయత్నాలకు నిరంతర మద్దతును అందిస్తామని,  ఈ ప్రాంతంలో భద్రత మరియు శాంతిని సాధించడానికి మద్దతు కొనసాగుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా పశ్చిమ యెమెన్‌లోని అల్ హుదైదా ఓడరేవుపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు.  80 మంది గాయపడ్డారు. హౌతీ-అనుబంధ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఓడరేవులోని చమురు నిల్వ కేంద్రాలపై వైమానిక దాడులు జరిగాయి. భారీ మంటలు సంభవించాయి.  తన గగనతలాన్ని ఉల్లంఘించడానికి ఏ సంస్థను అనుమతించమని రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ టర్కీ అల్-మాలికీ హెచ్చరించారు. హుదైదాను లక్ష్యంగా చేసుకోవడంలో సౌదీ అరేబియాకు ఎలాంటి సంబంధం లేదా ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com