మ‌హనీయుల పేర్లు పెట్ట‌డం హార్షణీయం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్

- July 28, 2024 , by Maagulf
మ‌హనీయుల పేర్లు పెట్ట‌డం హార్షణీయం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్

అమ‌రావ‌తి: భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఏపీ విద్యాశాఖలో పథకాలను డాక్ట‌ర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేర‌కు ప‌వ‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారని గుర్తు చేశారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి.. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమని కొనియాడారు.

డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి పేరుతో..

పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో అమలు చేయడం సముచితమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందన్నారు.

మ‌ధ్యాహ్న భోజ‌నానికి డొక్కా సీత‌మ్మ పేరు..

మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇందుకు భిన్నంగా‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలన్నారు. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయని అభిప్రాయపడ్డారు.

యువ‌త‌లో స్ఫూర్తి నింపేలా క‌లాం పేరు..

మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారని తెలిపారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారని అన్నారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.

పాత పేరు..కొత్త పేరు

జగనన్న అమ్మ ఒడి – తల్లికి వందనం
జగనన్న విద్యా కానుక – సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర
జగనన్న గోరుముద్ద – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం
మన బడి నాడు నేడు – మన బడి మన భవిష్యత్తు
స్వేచ్ఛ – బాలికా రక్ష
జగనన్న ఆణిముత్యాలు – అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com