ప్రముఖ భరత నాట్యం, కూచిపూడి నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత..

- August 04, 2024 , by Maagulf
ప్రముఖ భరత నాట్యం, కూచిపూడి నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత..

హైదరాబాద్: భరత నాట్యం, కూచిపూడి నర్తకిగా ఎంతో పేరు, ప్రతిష్టలు సాధించి నాట్యాన్ని దేశ విదేశాలకు వ్యాప్తిచేసిన యామినీ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. 84 ఏళ్ళ వయసులో యామిని కృష్ణమూర్తి మరణించారు.వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నేడు శనివారం సాయంత్రం కన్నుమూశారు.

యామినీ కృష్ణమూర్తి కన్నుమూతతో నాట్య పరిశ్రమలో విషాదం నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

భారత దేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందాను. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన నర్తకిగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు.

యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో 1940లో కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు. చెన్నైలో మొదట భరతనాట్యంలో శిక్షణ తీసుకొని అనంతరం వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. ఒడిస్సీలో కూడా శిక్షణ పొందారు. మోహినీ, సత్యభామ, ఉష, శశిరేఖ.. ఇలా ఎన్నో నృత్యరూపకాలతో మెప్పించింది.

యామినీ కృష్ణమూర్తికి ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ ఇచ్చి సత్కారించింది. టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా యామినీ కృష్ణమూర్తి సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె మరణంతో నాట్య లోకం శోకంలో మునిగింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ యామినీ కృష్ణమూర్తి మరణంపై స్పందిస్తూ.. ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి గారి మరణం బాధాకరం. కళారంగానికి యామినీ కృష్ణమూర్తి అందించిన సేవలు మరువలేనివి. టీటీడీ ఆస్థాన నర్తకిగా సేవలందించిన యామినీ కృష్ణమూర్తి ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. యామినీ కృష్ణమూర్తి ఆత్మకు శాంతిచేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు. మరికొంతమంది ప్రముఖులు యామినీ కృష్ణమూర్తికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com