క్విట్ ఇండియా ఉద్యమం
- August 08, 2024
"మీకు ఓ చిన్న మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని మీ హృదయాల్లో బలంగా పదిలపరచుకోండి. మీ ప్రతిశ్వాసలోనూ అది వ్యక్తమవ్వాలి. 'విజయమో-వీర స్వర్గమో' (డు ఆర్ డై) అన్నదే ఆ మంత్రం. పరాయి పాలన నుంచి మాతృదేశానికి విముక్తి కల్పిద్దాం. లేదా ఆ క్రమంలో ప్రాణాలను వదిలేద్దాం. నిరంతర బానిసత్వంలో మగ్గిపోవడానికి ఏమాత్రం అంగీకరించొద్దు" అని క్విట్ ఇండియా ఉద్యమానికి నాందిగా గాంధీజీ పూరించిన శంఖారావమిది.
అదొక ఉద్యమం.. కాదు కాదు జన ఉప్పెన. బ్రిటిష్ అరాచక పాలనలో కుతకుతలాడుతున్న భారతీయులు.. చావో రేవో అంటూ గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టం అది. సమాచార వ్యవస్థ నామమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో.. దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలు ఎవరికి వారే నాయకులై.. కదం తొక్కిన చారిత్రక సంగ్రామం. అదే క్విట్ ఇండియా. అనేక పోరాటాల సమాహారమైన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అదో మైలురాయి. నిజానికి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించే నాయకుడంటూ ఎవరూ అప్పటికి అందుబాటులో లేరు. ఉద్యమానికి ఊపిరి పోసిన అగ్రనేతలందరినీ బ్రిటిష్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. దిశానిర్దేశం చేసే మార్గదర్శకులెవరూ లేకున్నా.. ప్రజల సమరోత్సాహంతో ఆ ఉద్యమం మహోజ్వలంగా సాగింది. నేడు క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అగ్రగణ్యులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేల విజ్ఞప్తి మేరకు 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన మహాత్ముడు 1917 నుంచి 1942 వరకు దాదాపు 25 ఏళ్లపాటు వివిధ రకాల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం అందకుండా పోతోందనే ఆవేదన ఆయనలో గూడు కట్టుకుపోయింది. 1942 జూన్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను అసహనానికి గురవుతున్నాను' అని వ్యాఖ్యానించడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన రెండు నెలలకే ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమానికి మహాత్ముడు పిలుపునిచ్చారు. 'విజయమో.. వీర స్వర్గమో' (డు ఆర్ డై) అంటూ గర్జించారు.
1939లో హిట్లర్ నాయకత్వాన నాజీ జర్మనీ ప్రారంభించిన యుద్ధంలో ఐరోపాలో బ్రిటిష్ సేనలు మట్టికరిచాయి. మరోవైపు, 'ఆసియా చిట్టెలుక'గా పిలిచే జపాన్.. 'ఆసియా ఆసియావాసులకే' అంటూ పొరుగునే ఉన్న మలయా (నేటి మలేసియా), సింగపూర్, ఇండోనేసియా తదితర దేశాల్లో తిష్ఠ వేసిన బ్రిటిష్ సైన్యాన్ని వెళ్లగొడుతూ.. భారత్‌ను సమీపిస్తోంది. అదే సమయంలో.. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా నాజీ సేనలు బ్రిటన్‌లో ప్రవేశించడమే తరువాయి అన్నట్లుగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి.
జపాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయుల సహాయం కోరాలని అమెరికా, రష్యా, చైనాల నుంచి బ్రిటన్ పాలకులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఆదేశాల మేరకు 1942 ప్రారంభంలో లేబర్ పార్టీ నాయకుడు సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో తమకు సహకరిస్తే.. స్వయం పాలన ఇస్తామని చెప్పి, చివరకు వచ్చేసరికి 'డొమినియన్ స్టేటస్' అంటూ మెలిక పెట్టింది.
ఈ ప్రతిపాదనను భారతీయులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఈ మెలికపై తీవ్రస్థాయిలో మండిపడిన కాంగ్రెస్ పార్టీ భారతీయులకు స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశం బ్రిటిష్ వారికి లేదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. అనంతరం వార్ధాలో ఆగస్టు 8న సమావేశమై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను కార్యోన్ముఖులను చేస్తూ భారీ ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. గోవాలియా ట్యాంక్ మైదానంలో బహిరంగ సభ ముగిసిన గంటల వ్యవధిలోనే బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ, నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, అబుల్‌కలాం ఆజాద్ సహా కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్టుచేసి జైళ్లలో పెట్టింది.
కాంగ్రెస్ పార్టీని చట్టవ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నిషేధించింది. పార్టీ నిధులను స్తంభింపజేసింది. ఈ సమయంలో అరుణా అసఫ్ అలీ రంగంలోకి దిగారు. ఆగస్టు 9న పార్టీ సదస్సును నడిపించిన ఆమె.. గోవాలియా మైదానంలోనే కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అసలే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు పెరిగిపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రజలు నిప్పుకణికల్లా 'క్విట్ ఇండియా' ఉద్యమంలోకి దూకారు.
గాంధీజీ పిలుపునిచ్చిన మర్నాడు (ఆగస్టు 9న) పుణె, అహ్మదాబాద్‌లలో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పదో తేదీన దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లలో నిరసనలు మిన్నంటాయి. క్రమంగా ఉద్యమం దేశవ్యాప్తంగా గ్రామాల వరకు విస్తరించింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరాహార దీక్షలు చేశారు. కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. చాలా చోట్ల రైలు పట్టాలను తొలగించారు. వంతెనలు, టెలిఫోన్ స్తంభాలను కూల్చివేశారు. మరోవైపు.. బ్రిటిష్ సర్కారు దొరికిన వారిని దొరికినట్లు జైళ్లలో పడేసింది.
దేశంలోని జైళ్లన్నీ నిండిపోయాయి. "క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో బ్రిటిష్ సైనికులు 50,000 మంది భారతీయులను కాల్చి చంపారని" సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా అప్పటి వైస్రాయ్ లిన్‌లిత్‌గోకు లేఖ రాశారంటే అణచివేత ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మహోజ్వల పోరాటం సత్ఫలితాన్నే ఇచ్చింది. తర్వాత అయిదేళ్లకు 1947లో కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకగా స్వతంత్ర భారత్ ఆవిర్భవించింది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









