కేరళ సీఎంతో కలిసి వయనాడ్‌లో ప్రధాని మోడీ ఏరియల్‌ సర్వే

- August 10, 2024 , by Maagulf
కేరళ సీఎంతో కలిసి వయనాడ్‌లో ప్రధాని మోడీ ఏరియల్‌ సర్వే

వయనాడ్‌: ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో కలిసి భారత వైమానిక దళ హెలికాప్టర్‌లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. చూరల్మల, ముండక్కై, పూంచిరిమట్టం గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

సర్వే అనంతరం ప్రధాని మోడీ కల్పేటలోని ఎస్‌కేఎంజే హయ్యర్ సెకండరీ స్కూల్‌లో దిగారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు వెళుతున్నారు. వారి వెంట కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మోడీ కొండచరియలు విరిగిపడిన చూరల్మల గ్రామానికి వెళ్లవలసి ఉంది. మోదీ 24 కిలో మీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది.

ప్రభావిత ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరిస్తారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకుముందు, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 11 గంటలకు దిగిన ప్రధానికి సీఎం, గవర్నర్ స్వాగతం పలికారు. వీరంతా వైమానిక దళ హెలికాప్టర్‌లో వయనాడ్ బయలుదేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com