వరలక్ష్మీ వ్రతం
- August 16, 2024
శ్రావణమాసం స్త్రీలకు ముఖ్యమైన మాసం. ఈ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు లక్ష్మిదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. తెలుగింటి ఆడపడుచుల ముఖ్యమైన పండుగల్లో శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం ప్రముఖమైన పండుగ. పూలు, గుమ్మాలకు మామిడాకులు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. లక్ష్మీదేవిని వరలక్ష్మీగా కూడా పిలుస్తారు. వరలక్ష్మీ అంటే వరాలు ప్రసాదించే దేవత అని అర్థం. ఆమె భక్తులకు అన్నీ విధాలా అనుగ్రహిస్తుంది.భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి.
శ్రావణమాసంలో ప్రతిరోజూ శుభదినంగా భావిస్తాం. ముఖ్యంగా మంగళవారాలు గౌరీదేవిని, శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల సౌభాగ్యాన్ని చల్లగా కాపాడుతుందని నమ్మకం. లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ప్రతి స్త్రీ యందు ఉండాలని కొలుస్తారు. లక్ష్మీదేవిని ఘనంగా పూజిస్తారు. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని పెళ్ళయిన స్త్రీలు తప్పక పాటిస్తారు. ఈ వ్రతంలో అష్టలక్ష్ములను ఆరాధిస్తారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను తమ స్థోమత ప్రకారం దేవి దగ్గర ఉంచి దానిని మెడలో ధరిస్తారు. కొత్త చీర, గాజులు లక్ష్మీదేవికి సమర్పిస్తారు. చేతికి కట్టుకునే తోరణంతో పూజ పూర్తవుతుంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి…. కలశాన్ని ప్రతిష్టించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది, దానిపై కొబ్బరికాయను ఉంచాలి.
కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపుముద్దలు కానీ, పసుపుకొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమే! అమ్మవారిని అష్టోత్తరశతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంధిపూజ చేస్తారు. ఇందు కోసం మూడు లేదా అయిదు తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ, తోరపూజలోని ఒకో మంత్రం చదువుతూ ఒకో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి.
వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ… అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి. ఇకపూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు. ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలదీ తీపిపదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు.
కొబ్బరికాయ అన్నా, అరటిపండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. వరలక్ష్మీ పూజలో భాగంగా అష్టోత్తరశతనామావళి, మహాలక్ష్మి అష్టకమ్ తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తయిదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు.
రలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే తీసుకోవాలి.. ముత్తయిదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి… సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తయిదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి.. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు.. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.
వరలక్ష్మీ వ్రతం చేసే వారు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అసలే వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు.. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చేసినా.. ఈ వ్రతం కథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు.
శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసే వారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టడం, తిట్టుకోవడం వంటివి చేయరాదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు. అయితే అలా వీలు కాని వారు కేవలం కలశం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక.. ఈ రోజు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?