ప్రజా బాంధవుడు-సర్దార్ లచ్చన్న

- August 16, 2024 , by Maagulf
ప్రజా బాంధవుడు-సర్దార్ లచ్చన్న

ఉత్తరాంధ్ర నుంచి ఎగసిపడ్డ రాజకీయ కెరటం ఆయన... జీవితాంతం బలహీనవర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి ఆయన... దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ఆయనే... ఆ రాజకీయ మహా శిఖరం సర్దార్ గౌతు లచ్చన్న... స్వాతంత్య్ర సమరయోధుడిగా,జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా,రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టింది. నేడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి. 

సర్దార్ గౌతు లచ్చన్న1909, ఆగస్టు 16న ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆనాటి గంజాం జిల్లా సోంపేట తాలుకాలో ఉన్న బారువా గ్రామంలో జన్మించారు. చిట్టయ్య-రాజమ్మ దంపతులకు ఆయన ఎనిమిదో సంతానం.ఆయన తండ్రి గౌడ వృత్తిలో ఉన్నప్పటికీ... తనలాగా తన కొడుకులు కూడా అదే వృత్తిలో ఉండిపోవద్దని వారిని బాగా చదివించాలనుకున్నాడు. బారువా ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు,ఆ తర్వాత శ్రీకాకుళం ఉన్నత పాఠశాలలో గౌతు లచ్చన్న విద్యాభ్యాసం సాగింది.

శ్రీకాకుళం ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలోనే ఆయన జాతీయత భావాలను ఏర్పరుచుకున్నారు. నర్సింహ మూర్తి అనే మాష్టారు ఆయనకు మార్గదర్శిగా ఉండేవారు. మెట్రిక్యులేషన్ చదవుతుండగానే గాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం,విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్టయి కొన్నాళ్లు టెక్కలి,బరంపురంలలో జైలు జీవితం గడిపారు. 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని 5 నెలలు రాజమండ్రి జైల్లో ఉన్నారు. గాంధీ పిలుపు మేరకు హరిజన సేవ సంఘాలను ఏర్పాటు చేసి హరిజన రక్షణ యాత్రలు చేపట్టారు. అంటరాని తనాన్ని దూరం చేసేందుకు హరిజనులను ఆలయ ప్రవేశం చేయించారు. రాత్రిపూట బడులు నిర్వహించి బడుగు,బలహీనవర్గాలకు విద్యను బోధించారు.

1930లో మందసా నుంచి మద్రాసు వరకు రైతు చైతన్య కూలీ యాత్రను చేపట్టారు. నిడుబ్రోలులో ఆచార్య రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో చేరారు. అక్కడ విద్యాభ్యాసం అనంతరం జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు చేపట్టారు. 1935లో కాంగ్రెస్ సోషల్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాష్ట్రంలో ఎన్నో రైతు ఉద్యమాలు నడిపారు. 1940లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన గౌతు లచ్చన్న... మూడేళ్లు జైలు జీవితం గడిపారు.1947లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1950లో ఆచార్య కృషికార్ లోక్ పార్టీలో ప్రధాన పాత్ర పోషించారు. 1953,అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాస్ నుంచి రావాల్సిన ఆస్తుల పంపకాలను పరిశీలించిన సభ్యుల్లో లచ్చన్న ఒకరు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రకాశం పంతులు మంత్రివర్గంలోనూ, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ లచ్చన్న విద్యుత్ శాఖ  మంత్రిగా పనిచేశారు. రంగా గారితో కలిసి రాజాజీ ఏర్పాటు చేసిన స్వతంత్ర పార్టీలో కృషికార్ లోక్ పార్టీని విలీనం చేశారు. 1961లో స్వతంత్ర పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు లచ్చన్న అధ్యక్షుడుగా వ్యవహరించారు.1967లో శ్రీకాకుళం లోక్ సభకు, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికై తన గురువు రంగా కోసం పార్లమెంట్ సీటుకు రాజీనామా చేసి ఆయన్ని గెలిపించారు. స్వతంత్ర పార్టీ జనతా పార్టీలో విలీనం జరిగిన తర్వాత 1978లో లచ్చన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జనతా పార్టీ తరుపున అధికార ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకునిగా ఉంటూనే పభ్లిక్ అక్కౌంట్స్ ఛైర్మన్ గా సైతం వ్యవహరించారు. జనతా పార్టీ విచ్చిన్నం తర్వాత మాజీ ప్రధాని చరణ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన లోక్ దళ్ పార్టీలో కొనసాగారు. 

1982లో ఎన్టీఆర్ టిడిపిలోకి ఆహ్వానించినా లోక్ దళ్ అధినేత చరణ్ సింగ్ కి ఇచ్చిన మాట కోసం అటువెళ్ళలేదు. చరణ్ సింగ్ మరణం తర్వాత కొంతకాలం బహుజన పార్టీలో పనిచేసిన లచ్చన్న ఆ తరువాత  రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని, పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి చివరి శ్వాస వరకు కృషి చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉంది 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డ్ ఇప్పటికీ ఆయన పేరిట మీదే ఉండటం విశేషం. లచ్చన్న కుమారుడు మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర్ శివాజీ, మనవరాలు ప్రస్తుత పలాస ఎమ్యెల్యే గౌతు శిరీషలు ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 

 మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే. ఒకరు సర్దార్ వల్లభభాయి పటేల్. మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. ఒకరిది దేశస్ధాయి, మరొకరిది రాష్ట్ర స్థాయి. సర్దార్ అంటే సేనాని. స్వాతంత్ర్యోద్యమ పోరాట వీరునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన కురువృద్ధుడు సర్దార్ గౌతు లచ్చన్న. జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా గౌడ చరిత్ర ఒక మంచి మనిషీ ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న  2006 ఏప్రిల్ 19 న కన్ను మూశారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com