అమెరికాలో ఘనంగా భారతదేశ78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 16, 2024 , by Maagulf
అమెరికాలో ఘనంగా భారతదేశ78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అమెరికా: డాలస్ లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.  

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర కు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారత దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు, గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు. ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయలు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్ లు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు-సత్యన్ కళ్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు.       

               

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com