ఆర్థిక మంత్రి-నిర్మలా సీతారామన్

- August 18, 2024 , by Maagulf
ఆర్థిక మంత్రి-నిర్మలా సీతారామన్

ఉన్నత చదువులు చవి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నిర్మలా సీతారామన్ భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ తోలి మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. అలాగే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు . ఇలా ఎన్నో ఘనతలు సాధించిన తెలుగింటి కోడలు నిర్మలమ్మ జన్మదినం నేడు.

నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మధురైలో లో జన్మించారు. నిర్మల పాఠశాల విద్యను మద్రాసు, తిరుచిరాపల్లిలో పూర్తి చేశారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మీ రామస్వామి కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు.1984లో ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్)  పూర్తి చేశారు. జేఎన్‌యూలో చదువుతున్న సమయంలో నిర్మల తన భర్త పరకాల ప్రభాకర్‌ను కలిశారు. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఈ జంట 1986 సంవత్సరంలో పెద్దలను ఒప్పించిన ప్రేమ వివాహం చేసుకున్నారు . వీరికి ఓ కుమార్తె (వంగ్మాయి).

అనంతరం ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్లిన నిర్మల .. అక్కడ పర్ట్ టైమ్ గా హాబిటాట్ లో సేల్స్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తరువాత కొంత కాలం ఆమె అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ (UK)లోని ఆర్థికవేత్తకు సహాయకురాలుగా పనిచేశారు. ఆమె PWC (ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్), BBC వరల్డ్ సర్వీస్‌లో సీనియర్ మేనేజర్ (పరిశోధన, అభివృద్ధి విభాగం)గా కూడా పనిచేశారు.

అనంతరం భారత్ కు వచ్చిన ఆమె 2003 నుండి 2005 మధ్యకాలంలో జాతీయ  మహిళా కమిషన్‌లో కూడా సభ్యురాలిగా కూడా సేవలందించారు. భర్త  కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఈమె దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సమయంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితురాలైన నిర్మల 2006లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అనతికాలంలో అంటే.. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో బిజెపి అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ వాణిని బలంగా వినిపించారు. ఇలా 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోనే ఆరుగురు బిజెపి అధికార ప్రతినిధుల బృందంలో ఆమె కూడా కీలక నేతగా స్థానం సంపాదించుకున్నారు.

2014లో బీజేపీ తరుపున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సీతారామన్.. నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో  జూనియర్ మంత్రిగా నియమితులయ్యారు. మే 2016లో రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేయుచున్న నిర్మల సీతారామన్ మూడేళ్లలోనే కీలకమైన రక్షణశాఖ మంత్రిగా నియమించబడ్డారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సెప్టెంబర్ 3, 2017న అత్యంత కీలకమైన రక్షణ శాఖ నిర్మల సీతారామన్ దక్కింది. ఇలా రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ గా నిర్మల సీతారామన్ చరిత్ర సృష్టించారు.  

గతంలో 1975, 1980 నుంచి 1982 వరకు రెండుసార్లు ఇందిరా గాంధీ భారత రక్షణ మంత్రిగా వ్యవహరించారు. గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేయడంతో రక్షణ శాఖ అదనపు బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కొంతకాలం చూస్తూ వచ్చారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఆయనకే రక్షణ శాఖ బాధితులు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ బాధ్యతలను నిర్మలమ్మకు అప్పగించారు. రక్షణ మంత్రిగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు నిర్మలమ్మ.

2019లో మోడీ 2.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తోలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆర్థిక మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.కోవిడ్ సమయంలోనూ దేశ  ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ప్రశంసలు అందుకున్నారు. 2024లో మోడీ 3.0 ప్రభుత్వంలో సైతం ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో  వరుసగా ఆమె ఏడోసార్లు బడ్జెట్‌ను నేరుగా సభలో ప్రవేశపెట్టి  వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలమ్మ బద్దలుకొట్టారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com