భరతమాత వీరపుత్రుడు-నేతాజీ

- August 18, 2024 , by Maagulf
భరతమాత వీరపుత్రుడు-నేతాజీ

స్వాతంత్రం కోసం అహింసా విధానంలోనే కాదు సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి.. ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్. రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని.. పోరుబాట కూడా ముఖ్యమని బలంగా నమ్మి 'మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను' అనే నినాదంతో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేడు ఆ మహనీయుడి వర్థంతి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1879 జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్.. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవాలని తీర్మానించారు. ‘మానవసేవే మాధవసేవ’ అనే నినాదం, రామకృష్ణుడు, స్వామి వివేకానంద ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. ‘‘నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది.. జ్వాలాంతమైన వివేకా నందుని దేశభక్తి భావాలు నా రక్తనాళాలలో లావాలా ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయోద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయి’’ అని బోస్ సగర్వంగా చెప్పుకొన్నారు.

తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి, ఇంగ్లండ్‌కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటుచేసుకుంది. ఐసీఎస్‌ శిక్షణ తీసుకున్నా అధికారిగా బాధ్యతలు స్వీకరించక స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రిటిష్ అధికారి వెల్స్ క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్‌ దాస్‌తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు.

తన గురువైన  చిత్తరంజన్‌ దాస్‌ మార్గదర్శనంలో జాతీయ కాంగ్రెస్‌లో చేరి దేశ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. శ్రీ ఆర్యా పత్రికలో సంపాదకుడిగా ఆయన రాసిన వ్యాసాలు స్వాతంత్ర సమరంలో పాల్గొనే వీరుల్లో ఉత్సాహాన్ని నింపాయి.తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్.. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. అహింసామార్గం ఆంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసుకున్న బోస్ 1941లో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్లల్లో దుమ్ముకొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు.

ఆజాద్ హిందూ ఫౌజ్‌ను స్థాపించి ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భరతమాతను రక్షించేందుకు ‘చలో ఢిల్లీ’, ‘నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను’ అనే నినాదాలను ఇచ్చారు.1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. నేతాజీ మరణంతో  అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com