ఎయిరిండియా విమానాల్లో ఇక వైర్‌లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

- August 22, 2024 , by Maagulf
ఎయిరిండియా విమానాల్లో ఇక వైర్‌లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రయాణికుల కోసం కొత్త తరహా సేవల్ని తీసుకొచ్చింది.ఇకపై ప్రయాణ సమయంలో వినోదాన్ని అందించేందుకు వైర్‌లెస్‌ ఇన్‌ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (IFE) సర్వీసులను తీసుకొచ్చినట్లు బుధవారం ప్రకటించింది. తొలుత వైడ్‌ - బాడీ విమానాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

'విస్తా' పేరుతో ఎయిరిండియా కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. బ్లూబాక్స్‌ వావ్‌ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ద్వారా ఈ సర్వీసులను అందిస్తుంది. దీంతో ప్రయాణికులు ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను నేరుగా వారి డివైజుల్లోనే వీక్షించొచ్చు. ఇందులో బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లు, హాలీవుడ్‌ ప్రీమియర్స్‌, గ్లోబల్‌ మ్యూజిక్‌ హిట్స్‌తో పాటు పలు డాక్యుమెంటరీలుఉంటాయి. రియల్ టైమ్ ఫ్లైట్ ట్రాకింగ్ కోసం లైవ్ మ్యాప్‌ను కూడా విస్తా డిస్‌ప్లే చేస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్‌, మ్యాక్‌ఓఎస్‌ డివైజుల్లో ఈ సేవలు పొందొచ్చు. ఆస్కార్‌ నామినేటెడ్‌ చిత్రాలు, షార్ట్‌ ఫిల్మ్‌లతోపాటు చిన్న పిల్లల కోసం రూపొందించిన వీడియోలు ఇలా మొత్తం ఇందులో 950 గంటలకు పైగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను జోడించింది.

ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లు కొత్త సేవల్ని తీసుకొచ్చినట్లు ఎయిరిండియా చీఫ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా తెలిపారు. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ సర్వీసులను ప్రారంభించామన్నారు. విస్తా సేవలు తీసుకురావడంపై ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వైడ్‌ - బాడీ విమానాలకే పరిమితమైన ఈ సేవల్ని త్వరలోనే చిన్న విమానాలకు సైతం విస్తరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com