సీ ప్లేన్ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

- August 23, 2024 , by Maagulf
సీ ప్లేన్ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూ ఢిల్లీ: దేశంలో సీ ప్లేన్ మార్గదర్శకాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విడుదల చేశారు. దేశంలో సీ ప్లేన్‌ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడుతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

నూతన సీప్లేన్ విధానంతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందన్నారు. నేషనల్ ఏవియేషన్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో సీప్లేన్ సమగ్ర మార్గదర్శకాలను మంత్రి ఆవిష్కరించారు. నూతన మార్గదర్శకాలతో సీ ప్లేన్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి సైతం దోహద పడనున్నట్లు వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతాలు, తీర ప్రాంతాలను సద్వినియోగించుకునేందుకు సీ ప్లేన్ విధానాలు ఉపయోగపడతాయన్నారు. దేశంలోని విస్తారమైన జలమార్గాలను ఉపయోగించుకునేందుకు విమానయాన శాఖ సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు. తాజా మార్గదర్శకాలను ఏకీకృతం చేయడంతో దేశ రవాణా వ్యవస్థలో ఇదో మైలురాయిగా నిలిచిపోనున్నట్లు పేర్కొన్నారు.

ఏపీలో..

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం తదితర సువిశాల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, రాజమండ్రి, నాగార్జునసాగర్‌ వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో సీప్లేన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. రవాణా, వ్యాపార సామర్థ్యాలను పెంపొందించడమే ఈ విభాగంలో కీలకమని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, విమానయాన నిపుణులు, పర్యావరణ అధికారులతో సహా వివిధ వర్గాలతో సంప్రదించి, పర్యావరణ అనుకూలంగా మార్గదర్శకాలు రూపొందించినట్లు వెల్లడించారు.

భద్రతా నిబంధనలకు అనుగుణంగా..

భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఏరోడ్రోమ్‌ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆపరేటర్ల విధులు, బాధ్యతలను త్వరలో రూపొందించనున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com