కోలీవుడ్ కెప్టెన్ ...!

- August 25, 2024 , by Maagulf
కోలీవుడ్ కెప్టెన్ ...!

విజయకాంత్...తమిళ ప్రేక్షకులకే కాదు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి సుపరిచితులైన కోలీవుడ్ స్టార్ హీరో. తమిళ సినీ, రాజకీయరంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్‌ బిగినింగ్‌లో సినిమాల్లోకే పనికి రాడని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అభిమానులు కెప్టెన్ అని ప్రేమగా పిలుచుకునే విజయకాంత్ జన్మదినం.

విజయకాంత్‌ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి.1952,ఆగస్టు 25న తమిళనాడు మధురైలో తెలుగు మూలాలు ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు కె.ఎన్‌. అళగర్‌స్వామి, ఆండాళ్‌ అజగర్‌స్వామి. చిన్న తనం నుంచే సినిమాల పట్ల ఉన్న మక్కువతో పలు నాటకాల్లో రాణించారు. 27 ఏళ్ల వయసులో ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ (1979) చిత్రంతో తెరంగేట్రం చేశారు.అందులో విలన్ గా కనిపిస్తారు. ఆ తర్వాత రెండు మూడేళ్లు వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరయ్యారు.  

1980లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’తో విజయాలు అందుకున్నారు. 150కి పైగా చిత్రాల్ల్లో నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు  విడుదలకావడం  విశేషం. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘సగప్తం’ (2015). విజయకాంత్‌ నటించిన ప్రతి చిత్రంలో మంచి సందేశం ఉండేలా చూసుకునేవారు.

విజయకాంత్‌ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగు,  హిందీ భాషల్లో ఎక్కువ అనువాదమవుతుండేవి. అవన్నీ చక్కని విజయాలు సాధించాయి. ‘శివప్పు మల్లి’ (ఎర్ర మల్లెలు రీమేక్‌), ‘జదిక్కొరు నీధి’ తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించారు. దాంతో తమిళనాట ఆయన్ను ‘పురాచీ కళింగర్‌’ (విప్లవాత్మక నటుడు) అని పిలిచేవారు. ఆయన వందో చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. దాంతో అభిమానులంతా ఆయనకు ‘కెప్టెన్‌ విజయకాంత్‌’గా బిరుదు ఇచ్చారు.

తమిళ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన తొలి 3డీ చిత్రం విజయకాంత్‌ నటించిన ‘అన్నై ్ఘభూమి’. ఇందులో ఆయన రాధారవి, కన్నడ నటుడు టైగర్‌ ప్రభాకర్‌తో కలిసి నటించారు. ‘ఈట్టి’లో కన్నడ నటుడు విష్ణువర్థన్‌తో, ‘మనకనక్కు’లో విశ్వనాయకుడు కమల్‌హాసన్‌తో, ‘వీరపాండియన్‌’లో శివాజీ గణేశన్‌తో కలిసి నటించారు. ఒకానొక సమయంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లకు పోటీగా నిలిచారు విజయకాంత. ఆయన దర్శకుడిగానూ సత్తా చాటారు. ఆయన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్‌.కె. సుదీశ్ తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు.

దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, డ్యూయల్‌ రోల్‌ చేయాలన్నా విజయకాంత్‌ ఓ అడుగు ముందుండేవారు. కమర్షియల్‌ చిత్రాలతోనూ అలరించేవారు. పారితోషికం విషయంలో ఆయన ఆలోచన రీతి బావుండేదని సన్నిహితులు చెబుతుంటారు. నిర్మాత ఆర్థిక పరిస్థితులు చూసి అంతా బావుంటే పారితోషికం అడిగేవారని, నిర్మాత పరిస్థితి బాగోకపోతే వారి నుంచి రెమ్యునరేషన్‌ తీసుకునేవారు కాదని ఆయన స్నేహితులు చెబుతుంటారు. విజయకాంత్ దర్శకుల హీరో. చిన్నా.. పెద్దా అని అన్న తేడా లేకుండా అందరిని సమానంగా ఆధరించారు. ప్లాప్ లకుభయపడకుండా... కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. ఆయన పరిచయం చేసిన ఎందరో దర్శకులు నేడు అగ్ర దర్శకులుగా కొనసాగుతున్నారు.

1994లో ‘తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్‌ పురస్కారం), 2001లో ‘కలైమళి అవార్డు’ అందుకున్నారు. 2001లో ‘బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు’, 2009లో ‘టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్‌’ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చర్చ్‌ మేనేజ్‌మెంట్‌) పొందారు. ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అయితే చాలానే అందుకున్నారు.

ప్రజలకు సేవ  చేయాలనే సంకల్పంతో విజయకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016,2021 ఎన్నికల్లో పరాజయం పొందారు. 2012-16 మధ్యలో ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. తెరమీద ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే విజయకాంత్‌ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే ఆయనది ప్రేమ వివాహం. 1990, జనవరి 31న ప్రేమలతను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

విజయకాంత్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనే. సామాజిక సేవా కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇచ్చిన అతికొద్ది మంది హీరోల్లో ఆయన ఒకరు. కోలీవుడ్ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా చేసిన సేవా కార్యక్రమాలు గురించి ఆరోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆయా  సినీ పరిశ్రమల్లో చర్చ జరిగేది. తన మాతృ రాష్ట్రమైన తమిళనాడుకు సంబంధించిన అనేక అంశాల్లో కేంద్రం వైఖరిని నిరసిస్తూ చేసిన ధర్నాలకు సంపూర్ణ మద్దతునిచ్చేవారు.

సంపాదించిన ప్రతి రూపాయిలో యాభై శాతం దానధర్మాలకు విజయకాంత్ వినియోగించేవారు. హీరోగా తానూ తిన్న భోజనమే షూటింగ్ సెట్ లోని ప్రతి ఒక్కరు తినాలని నిర్మాతలకు కండిషన్ పెట్టి, అందుకయ్యే ఖర్చును నిర్మాతలకు భారం కానీయకుండా తన రెమ్యునరేషన్ లో తగ్గించుకునేవారు.  కష్టపడి పనిచేసే వర్కర్లకు సరియైన భోజనం పెడితేనే వారు కష్టించి పనిచేయగలరనే ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఎంజిఆర్ తర్వాత ఇటువంటి మానవతావిలువలను పాటించి, అమలు చేసిన హీరోగా విజయకాంత్ అందరినీ మెప్పించి, కురుప్పు ఎంజిఆర్ అనే చిరస్థాయి కీర్తిని సంపాదించుకున్నారు.

విజయకాంత్ లాంటి గొప్ప మానవతావాది 2023, డిసెంబరు 28న అనారోగ్యం కారణంగా తన 71వ ఏట చెన్నైలోని మియోట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. తన నటనతో, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రేక్షకుల మనసుల్లో  ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారు.  

--డి.వి.అరవింద్((మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com