శ్రీ కృష్ణాష్టమి...!

- August 26, 2024 , by Maagulf
శ్రీ కృష్ణాష్టమి...!

హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, అష్టమి రోహిణి, గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. విష్ణు మూర్తి.. పది అవతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడని పురాణోక్తి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో గోపాలుడి జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.

శ్రీమహావిష్ణువు అవతార పరంపరలో భాగంగా ద్వాపర యుగంలో దేవకి వసుదేవులకు ఎనిమిదో సంతానంగా కృష్ణుడుగా జన్మిస్తాడు. బాల్యంలో చిలిపి చేష్టలతో చిలిపి కృష్ణుడుగా, వెన్న దొంగగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా, గీతా బోధ చేసి ఆది గురువుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. ఎంతమంది రాక్షసులను సంహరించినా అందరూ కృష్ణుని చిన్న కన్నయ్యగానే బాగా ఇష్టపడతారు.

కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి శుచితో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొవాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో, పూల మాలలతో అలంకరించాలి. చిన్ని కృష్ణుని సర్వాంగ సుందరంగా అలంకరించాలి. చిన్ని కృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండిలో నీళ్లు కలిపి కృష్ణుని పాదాలను చక్కగా వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ మొదలు పెడితే మంచిది.

ఉత్తరభారతంలో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటారు. కన్నయ్యకు ప్రేమతో 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, వెన్న, మినప సున్నుండలు, కలకండ, నేతితో చేసిన లడ్డూలు వంటివి సమర్పిస్తే సరిపోతుంది. అయితే ఏ నైవేద్యం సమర్పించినా దానిమీద తులసి దళాలు మాత్రం తప్పకుండా వేయాలి. అప్పుడే ఆ ప్రసాదానికి పవిత్రత చేకూరుతుంది.

కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. అయితే ఇది తప్పనిసరి కాదు. ఎవరి ఆచారాలను వారు పాటించవచ్చు. బాల కృష్ణుడి విగ్రహం ముందు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి, భక్తులు ఎక్కువగా కన్నయ్యని అర్ధరాత్రి 12 గంటల తర్వాతనే పూజిస్తారు.

జన్మాష్టమి రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి, ఆ రాత్రికి శ్రీ కృష్ణుని లీలలు, కథల గురించి పాడుకుంటూ జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి. ఈ రోజు భాగవతంలోని దశమ స్కందం చదవాలి. ఆలయంలో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేసిన వారికి వంశాభివృద్ధి, ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. స్కంద పురాణం ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలిగి మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం.

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 2:19 గంటలకు ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26 సోమవారం మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది. అయితే కృష్ణాష్టమి అనేది రెండు రకాలుగా ఉంటుందని.. అందులో ఒకటి స్మార్త కృష్ణాష్టమి, రెండవది వైష్ణవ కృష్ణాష్టమి అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కృష్ణాష్టమి సాయంత్రం జరిగే ఉట్టి కొట్టే ఉత్సవం కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో ప్రతి ఊరిలో, వీధి వాడా ఉత్సాహంగా జరుగుతుంది. చిన్న పిల్లలను కృష్ణుడిలా, గోపికల్లా అలంకరించి సందడిగా సాగే ఈ ఉట్టి ఉత్సవం చూడటానికి జనం పోటెత్తుతారు. ఈ రోజు మథుర, ద్వారకా, బృందావనం, గురువాయూర్లో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ దేవాలయాల్లో కూడా కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ కృష్ణాష్టమి పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. మన సంస్కృతీ సంప్రదాయాలను మన భావి తరాలకు భద్రంగా అందజేద్దాం.

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com