వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

- August 28, 2024 , by Maagulf
వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.తన కుమార్తె పుట్టినరోజు నేపథ్యంలో యూకే పర్యటనకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. దీంతో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొద్దిరోజుల కిందట సిబిఐ కోర్టును జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు.

తన కుమార్తె పుట్టినరోజు ఉండటంతో సెప్టెంబర్ మూడో తేదీ నుంచి 25వ తేదీ వరకు బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ పిటిషన్ పై మంగళవారం సాయంత్రం విచారణ జరిపిన సిబిఐ కోర్టు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది. అయితే విదేశీ పర్యటనకు వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నెంబర్, మెయిల్ వివరాలను కోర్టుకు, సిబిఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కు ఐదేళ్ల కాల పరిమితితో కొత్త పాస్ పోర్టు జారీకి కూడా సిబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు పూర్తిగా అనుమతి లభించినట్లు అయింది. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

విదేశీ పర్యటన నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వేరువేరుగా సిబిఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారం రోజుల కిందట ఈ పిటిషన్లపై విచారించిన సిబిఐ కోర్టు తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సిబిఐ ఇరువురు నేతల విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ వాదనలు వినిపించినట్లు చెబుతున్నారు. సిబిఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కొన్ని షరతులను విధిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులు వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ1, విజయసాయిరెడ్డి ఏ2 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికీ విచారంలోనే ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే తప్పనిసరిగా సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వీరికి ఏర్పడింది. గతంలోనూ పలుమార్లు ఈ ఇరువురు నేతలు కోర్టు అనుమతితోనే విదేశీ పర్యటనకు వెళ్లారు. తాజాగా జగన్ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లేందుకు పిటిషన్లు దాఖలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com