టాలీవుడ్ మన్మథుడు...!
- August 29, 2024
'శివ'గా సైకిల్ చైన్ తెంచి, టాలీవుడ్లో కొత్త రికార్డు సృష్టించారు. 'అభిరామ్'గా అమ్మాయిలపై అసహ్యం వ్యక్తం చేస్తూ నవ్వులు పంచారు. 'ప్రకాశ్'గా ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. 'గణేశ్'గా 'మాస్' అనే పదానికి అసలైన అర్థమిచ్చారు. అలాంటి ఆయన 'అన్నమాచార్య', 'కంచెర్ల గోపన్న', 'శిరిడి సాయి'గా కనిపించి ఔరా అనిపించారు. సుమారు 3 దశాబ్దాలుగా విభిన్న పాత్రలతో సాహసాలు చేస్తున్న ఆ 'కింగ్' ఎవరో కాదు అక్కినేని నాగార్జున. టాలీవుడ్ గ్రీకువీరుడిగా కొనియాడబడుతున్న నాగార్జున పుట్టిన రోజు నేడు.
టాలీవుడ్ నవ మన్మధుడు అక్కినేని నాగార్జున 1959, 29 ఆగస్టున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు రెండో కుమారుడిగా చెన్నైలో జన్మించారు. నాగార్జున చెన్నైలోని ప్రసిద్ధ గిండీ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ, అమెరికాలోని ఈస్ట్రన్ మిచిగాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, నాగార్జున గిండీ కళాశాలలో కలిసి చదువుకున్నారు.
తండ్రి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అలియాస్ ఏయన్నార్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ తోలి స్టార్ హీరోగా రాణించారు. తన సమకాలీనుడైన ఎన్టీఆర్ కంటే ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక డిమాండ్ కలిగిన హీరోగా నిలిచారు ఏయన్నార్. తండ్రి అభీష్టం మేరకు సుమారు 8 నెలల వయసున్నప్పుడే నాగార్జున తెరపై కనిపించారు. ఆ సినిమా ఏదోకాదు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘వెలుగు నీడలు’. బాలనటుడిగా సుడిగుండాలు చిత్రంలో తండ్రితో కలిసి నటించారు. నిజజీవితంలో లాగే ఈ సినిమాలో వారిద్దరూ తండ్రి కొడుకులుగా నటించారు.
1986లో ‘విక్రమ్’తో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగార్జున ప్రయాణమేంటో అందరికీ తెలిసిందే. మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో లవర్ బోయ్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఆ తరవాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో నాగ్ అసలు సిసలు మాస్ హీరోగా మారారు. ఈ చిత్రం టాలీవుడ్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇక ఆ తరవాత నాగార్జున వెనుదిరిగి చూడలేదు. ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు నాగార్జున.
మాస్, క్లాస్, డివోషనల్, రొమాన్స్, యాక్షన్, సోషల్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్, పాట్రాయిటిక్.. వీటిలో నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. రికార్డులు, కలెక్షన్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నాగార్జున. నాగార్జున క్లాస్ హీరో!.. ఎవరన్నారా మాట?.. ‘గీతాంజలి’ చూసినోళ్లు!.. వారెవరూ ‘హలోబ్రదర్’ చూడలేదా?.. ఐతే నాగ్ మంచి కామెడీ హీరో!.. ‘మాస్’ చూడలేదా?.. సరే నాగ్ మాస్ హీరో!.. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ బాధ పడతారేమో?.. ఐతే నాగ్ క్లాసికల్ హీరో!.. అట్టాకాదు గాని ఇంకో మాట చెప్పు!.. నాగ్ ‘ఆల్ రౌండర్’..! అంతేగా, అంతేగా. కింగ్ అక్కినేని నాగార్జున ఒక జోనర్‌కు పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయన చేయని జోనర్ లేదు.
కలెక్టర్‌గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే, శ్రీరామదాసు (నాగేశ్వరరావు), స్నేహమంటే ఇదేరా (సుమంత్), మనం (నాగేశ్వరరావు, నాగచైతన్య, అఖిల్), బంగార్రాజు (నాగచైతన్య). అటు తండ్రి, ఇటు తనయులతో కలిసి నటించిన అరుదైన అవకాశం టాలీవుడ్లో నాగార్జునకే దక్కిందని చెప్పొచ్చు. ‘మనం’లో అక్కినేని మూడు తరాల హీరోలు కనిపించి, ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచారు.నాగ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘విక్రమ్’, తండ్రీకొడుకులతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘మనం’.. ఈ రెండూ మే 23నే విడుదలయ్యాయి. అందుకే ఆ తేదీ అంటే తనకెంతో ప్రత్యేకమంటారు నాగార్జున.
టాలీవుడ్లో ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన హీరో నాగార్జున అంటే అతిశయోక్తికాదు. నాగ్ చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. కుమారులు నాగచైతన్య, అఖిల్‌లకు గట్టిపోటీనిస్తున్నారు. ఇంకో విషయం.. తెలుగు సినీ పరిశ్రమలో నాగార్జున పరిచయం చేసిన దర్శకులే అత్యధికం. మొత్తం 40 పైచిలుకు కొత్త దర్శకులను నాగార్జున పరిచయం చేశారు.
"నటనలో వైవిధ్యం కనిపిస్తుంది. గతంలో పోషించిన పాత్రల పేరు మార్చి, దుస్తులు మార్చి ఏదో కొత్తగా చేశాం అని అనిపించుకోవటం నాకు ఇష్టం ఉండదు. అందుకే నూతన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటా. ఆ క్రమంలో ఎదురు దెబ్బలు తిన్నా.. విజయాల్నీ అందుకున్నా. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్‌ని అయ్యానంటే కారణం కొత్త దర్శకులు, వారి ఆలోచనల వల్లే’’ అని అంటుంటారు నాగార్జున.
‘త్రిమూర్తులు’, ‘రావుగారి ఇల్లు’, ‘ఘటోత్కచుడు’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘స్టైల్’, ‘తకిట తకిట’, ‘దొంగాట’, ‘అఖిల్’, ‘సైజ్‌జీరో’, ‘ప్రేమమ్’ సినిమాల్లో అతిథి పాత్రలు పోషించి, కనువిందు చేశారు. హిందీ, తమిళ సినిమాల్లోనూ నాగ్ నటించారు.సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై కథాబలం ఉన్న చిన్న సినిమాలను ఆయన నిర్మిస్తుంటారు. ‘ఉయ్యాలా జంపాలా’, ‘నిర్మలా కాన్వెంట్’, ‘రంగుల రాట్నం’ తదితర చిత్రాలు అలా రూపొందినవే.
వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటారు నాగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. నాగార్జునను ఆదర్శంగా తీసుకొని ఆ తరవాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని టెలివిజన్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం నాగ్ ‘బిగ్ బాస్’ షోను విజయవంతంగా నడిపిస్తు్న్నారు.
నాగార్జున అంటే సినిమాల అందరికి గుర్తుకొచ్చేది బిజినెస్. తన తరం టాలీవుడ్ హీరోల్లో బిజినెస్ రంగంలో బాగా రాణిస్తూన్న వ్యక్తిగా నాగ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, ఫార్మా వంటి పలు రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా పెట్టుబడులు పెట్టారు. మార్కెట్ విలువ ప్రకారం నాగ్ ఆస్తుల రూ.9 వేల కోట్లకు పైమాటే అని ఆయన వ్యాపారాలు గురించి తెలిసిన వ్యక్తులు చెబుతారు.
ఎంత పెద్ద హీరో అయినా, ఎన్ని కోట్లకు అధిపతి అయినా నాగార్జున ఎప్పటికీ ఒదిగే ఉంటారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు.అక్కినేని నటవారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు నాగార్జున. ఎంతటి ప్రయోగానికైనా వెరవని ధైర్యం అతన్ని యువసామ్రాట్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇతనేం హీరో అన్నవారిచేతనే….హీరో అంటే ఇతనిలా ఉండాలి అనేలా స్టైల్ క్రియేట్ చేసుకున్నారు నాగార్జున.క్లాసులోను మాస్ లోను మిళితమైన తీరే ఆయన్ని 3 దశాబ్దాలుగా అందరికి దగ్గరయ్యేలా చేసింది. నాగార్జున భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..