రామజన్మభూమి ఉద్యమకర్త..!

- September 15, 2024 , by Maagulf
రామజన్మభూమి ఉద్యమకర్త..!

రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన అశోక్ సింఘాల్, దళితుల కోసం ప్రత్యేక దేవాలయాలను నిర్మించడంతో స్ఫూర్తిదాయక పాత్రను నిర్వహించారు.దేవాలయాల్లోకి ప్రవేశం లేదంటూ అగ్రవర్గాల ఛీత్కారాలను ఛీదరించుకొని పరమతాన్ని ఆశ్రయిస్తున్న సమయంలో దళితుల కోసం ప్రత్యేక దేవాలయాల నిర్మాణానికి ఉద్యమించారు. అలా దాదాపు 200 దేవాలయాలను నిర్మించారు. ఆరెస్సెస్‌తో ప్రారంభమైన ఆయన హిందూ మతోద్ధరణ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్కు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకునే వరకు కొనసాగింది. నేడు విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపకులు అశోక్ సింఘాల్ జన్మదినం.

అశోక్ సింఘాల్ 1926,సెప్టెంబర్ 15వ తేదీన ఉమ్మడి ప్రావిన్స్ రాష్ట్రంలోని ఆగ్రా పట్టణంలో ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించారు.1950లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెటలర్జీ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. ఆయన 1942లోనే ఆరెస్సెస్‌లో చేరారు. పట్టభద్రుడయ్యాక సంఘంలో ఫుల్‌టైమ్ ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా మారారు.ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చురుకైన ప్రచారక్‌గా ప్రశంసలు అందుకున్నారు.1964లో విశ్వహిందూ పరిషత్ స్థాపించిన వ్యక్తుల్లో సింఘాల్ ఒకరు. ఢిల్లీ, హర్యానాలకు ఆరెస్సెస్‌ ప్రాంత ప్రచారక్‌గా మారారు.1980లో తమిళనాడు రాష్ట్రంలోని మీనాక్షీపురం గ్రామంలో జరిగిన మత మార్పిడులు దేశంలో అలజడులు సృష్టించాయి. ఆ ప్రాంతంలో పర్యటించిన సింఘాల్ తన తదుపరి మజీలికి సిద్దామయ్యారు.

దేశవ్యాప్తంగా హిందూ మతంలోని దళిత వర్గాలు వివక్ష కారణంగా, విదేశీ శక్తుల ప్రలోభాలకు గురై మత మార్పిడులు చేసుకుంటున్న తరుణంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) సంయుక్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.1984లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆయన నిర్వహించిన వీహెచ్‌పీ ధర్మ సంసద్‌కు వందలాది మంది సాధువులు, హిందూ స్కాలర్లు హాజరయ్యారు. దేశంలో హిందూ మతాన్ని పునరుద్ధరించేందుకు ఆయన ఈ సంసద్‌లో సుదీర్ఘ చర్చలు జరపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో భాగంగానే పుట్టుకొచ్చిన రామజన్మభూమి ఉద్యమానికి ముఖ్య సారథిగా పనిచేశారు.

1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన ఆ ఉద్యమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 2011 వరకు బాధ్యతలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2015, నవంబర్ 17న శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆయన చిరకాల స్వప్నం. ఆయన స్వప్నాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారు.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com