భారత ఇంజనీరింగ్‌ పితామహుడు ...!

- September 15, 2024 , by Maagulf
భారత ఇంజనీరింగ్‌ పితామహుడు ...!

మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్‌ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.ఆనకట్టలు, డ్యాంలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాల్లో వాహనాల రాకపోకలు ఇలా ఎన్నింటినో ఇంజినీరింగ్‌ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారు.అలాంటి వారిలో భారత జాతి గర్వించదగ్గ గొప్ప మహనీయులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిక్కులకు చాటారు.ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు.నేటికీ అవి చెక్కుచెదర లేదంటే అతిశయోక్తి కాదు.నేడు భారత ఇంజనీరింగ్‌ పితామహుడు, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబర్‌ 15న మైసూర్ రాజ్యంలో భాగమైన చిక్కబళ్లాపూర్‌ సమీపంలోని ముద్దెనహళ్లిలో తెలుగు మూలాలు కలిగిన సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీనివాసశాస్త్రి, వెంకటలక్ష్మమ్మలు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు లక్ష్మీపతిభట్టు 16వ శతాబ్దంలో ఇప్పటి ప్రకాశం జిల్లాలో భాగమైన బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామం నుంచి  శ్రీశైలం వెళ్లి పండిత విద్యల్లో శిక్షణ పొంది కర్ణాటకలోని అవతికి వలస వెళ్లారు.స్థానిక పాలకుడు దొడ్డబైరేగౌడ వారిని మంత్రిగా నియమించి ముద్దెనహళ్లి, బండేహళ్లి గ్రామాలను దానంగా ఇచ్చారు. వీరి కుమారుడే తిప్పశాస్త్రి, ఆయన కుమారుడు శ్రీనివాసశాస్త్రి, వారి కుమారుడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

శ్రీనివాసశాస్త్రి మైసూర్‌లోని చిక్కబళ్లాపూర్‌ సమీపంలోని ముద్దెనహళ్లిలో స్థిరపడ్డారు. ఆయన సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. విశ్వేశ్వరయ్య బాల్యంలోనే తండ్రి మరణించడంతో మేనమామ రామయ్య వీరిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించారు.చిన్న నాటి నుంచి చదువుల్లో బాగా రాణిస్తూ బెంగళూరులోని సెంట్రల్‌ కాలేజీలో సీటు సంపాదించారు. కాలేజీ ఫీజు కోసం విశ్వేశ్వరయ్య ట్యూషన్‌ చెప్తూ 1880లో బీఎస్సి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ప్రతిభ కలిగిన విశ్వేశ్వరయ్యను నాటి  మైసూరు రాజ్య దివాన్‌ రంగయ్య గుర్తించి ప్రభుత్వానికి సిఫార్స్‌ చేసి స్కాలర్‌షిప్‌ను ఇప్పించారు. దాంతో ఆయన పూణే వెళ్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థలో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రథమ శ్రేణిలో పాసయ్యారు.

బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విశ్వేశ్వరయ్యను నియమించింది. మరుసటి ఏడాది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఉన్నతి పొందారు. నాటి ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్‌ బరాజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు. అద్వితీ యమైన మేధోసంపత్తితో సింధూనది నీటిని సుద్నోరుకు చేరేలా చేశారు. ఆ నీటిని నిల్వ చేయడానికి వినూత్న విధానం కూడా రూపొందించారు. దాహరి దగ్గర నంబనది మీద సైఫన్‌ పద్ధతిన కట్టను నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య ఆటోమేటిక్‌ గేట్లను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బ్రిటిష్ పాలకుల కోరిక మేరకు 1906లో ఎడెన్‌ (యెమన్ దేశంలో ఉంది) నగరం నీటి సరఫరా ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా నియమించింది. కొల్లాపూర్‌, ధార్వాడ, బీజాపూర్‌ తదితర పట్టాణాల్లో మంచినీటి పథకాలను రూపొందించారు. ఆయన ఆధ్వర్యంలోనే మూసీకి వరదలను నివారించేందుకు హుస్సేన్‌సాగర్‌ వంటి నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్‌కు విస్తృత సేవలు అందించారు.

1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, యూరోప్ దేశాల్లో పర్యటిస్తూ ఆధునిక ఇంజనీరింగ్ విధానాలను అధ్యయనం చేశారు. నాటి మైసూర్ మహారాజు గారి ఆహ్వానం మేరకు 1909లో మైసూరు సంస్థానం దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశారు. హెబ్బాళ్‌ వ్యవసాయ కళాశాల, మైసూర్‌ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ద సెంచురీ క్లబ్, భద్రావతి ఉక్కు కార్మాగారం, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, మైసూర్ సోప్‌ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్‌ను నెలకొల్పారు. ఆయన ప్రజ్ఞతో నిర్మించిన కృష్ణారాజసాగర్‌ కింద మైసూర్ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవితాంతం సమాఖ్య అధ్యక్షునిగా విశ్వేశ్వరయ్య కొనసాగారు. తుంగభద్ర ప్రాజెక్టు రూపశిల్పి కూడా ఆయనే.

దివాన్‌ పదవిలో ఉండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని తన బంధువులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పించి వారికి తన సొంత డబ్బులు ఇచ్చి ఇతర వృత్తుల్లో ఉండేలా చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇండియాలో విమాన పరిశ్రమ నిర్మాణం అత్యవసరమైంది. విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగళూరులో విమాన పరిశ్రమ, విశాఖలో నౌకయాన నిర్మాణం ప్రారంభించారు. 1946లో తిరుమల మొదటి ఘాట్‌ మార్గానికి  రూట్‌మ్యాప్‌ రూపొందించిన వ్యక్తి విశ్వేశ్వరయ్య. 90 ఏళ్ల వయసులో అప్పటి ప్రధాని నెహ్రూ ఆహ్వానం మేరకు పాట్నా వద్ద గంగానదిపై బ్రిడ్జిని తమ బృందంతో నిర్మించారు.

విశ్వేశ్వరయ్య గారు నీతి, నిజాయితీకి మారుపేరు. ఒకసారి విదేశీ పర్యటనకు డబ్బులు అవసరం కాగా తాను స్థాపించిన మైసూర్‌ బ్యాంక్‌లో అప్పు కోసం తనవద్ద ఉన్న ఇంటి  పత్రాలను తాకట్టు పెట్టారు. ఆయన కోరుకుంటే ఎటువంటి తాకట్టు లేకుండానే అప్పు తీసుకోవచ్చు కానీ, వారి నైతికతకు సరిపడని వ్యవహారం. ఈ సంఘటన ఒక్కటి చాలు వారు ఎంత నిజాయితీ పరులో అర్థం అవ్వడానికి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు విశ్వేశ్వరయ్య అధ్యక్షుడిగా వ్యవహరించారు.  

1911లో ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం  కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (companion of the order of Indian empire) గా నియమించింది. 1915లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. 1955లో విశ్వేశ్వరయ్య గారిని భారతరత్న బిరుదుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1962 ఏప్రిల్‌ 12న బెంగళూరులోని తన స్వగృహంలో మోక్షగుండం విశ్వేశరయ్య గారు దివంగతులయ్యారు. ఇంజనీరుగా భారతదేశానికి  వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 15వ తేదీని "ఇంజనీర్స్‌ డే"గా నిర్వహిస్తున్నారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com