సినిమా రివ్యూ: ‘దేవర’

- September 28, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘దేవర’

‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత కొరటాల శివ, ఎన్టీయార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘దేవర’. కొరటాల కెరీర్‌లో ఆ తర్వాత ‘ఆచార్య’ రూపంలో పెద్ద డిజాస్టర్ బయటికొచ్చింది. మరి, ‘ఆచార్య’ డిజాస్టర్ నుంచి ‘దేవర’ను కాపాడుకోగలిగాడా.? లేక, కంటిన్యూ చేశాడా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
ప్రపంచానికి దూరంగా ఎర్ర సముద్రం అనే కొండపై వున్న నాలుగు గ్రామాలకు సంబంధించిన కథ ఇది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ వారు కొల్లగొట్టిన దేశ సంపదను వారి నుంచి ఎత్తుకొచ్చి పేదలకు పంచుతుంటారు ఎర్రసముద్రంలోని కొందరు యోధులు. కానీ కాలక్రమంలో వారి వారసులు ఆ సొత్తును అక్కడి కొందరు దాదాలకు దొంగతనంగా తెచ్చిస్తూ.. జీవనం సాగించడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి యోధుల్లో ఒకరు దేవర (జూనియర్ ఎన్టీయార్), అతని స్నేహితుడు భైరా (సైఫ్ అలీఖాన్). అయితే, ఒకానొక టైమ్‌లో దేవర తాము చేసేది ఎంత పెద్ద తప్పిదమో తెలుసుకుని ఈ పని చేయొద్దంటూ వారిని వారిస్తాడు. కానీ, అది నచ్చని భైరా అతని స్నేహితులు దేవరను మట్టు పెట్టాలనుకుంటారు. కానీ, భైరా మనుషులను అడ్డుకునేందుకు దేవర వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే సడెన్‌గా దేవర అదృశ్యమవుతాడు. దేవరను భైరా చంపేశాడా.? ఆయన కొడుకుగా వచ్చిన వర (జూనియర్ ఎన్టీయార్ డ్యూయల్ రోల్) ఎందుకు పిరికివాడిలా వున్నాడు.? అసలు భైరా మనుషులను దేవర ఎలా భయపెట్టాడు.? గ్యాంగ్ స్టర్ యతి ఎవరు.? చివరికి దేవర ప్రయత్నం గెలిచిందా.? వర తండ్రిలా బలవంతుడిగా మారాడా.? లేదా.? తెలియాలంటే ‘దేవర’ సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
దేవర, వర రెండు పాత్రల్లోనూ ఎన్టీయార్ తనదైన పర్‌ఫామెన్స్ ప్రదర్శించాడు. ‘దేవర’గా రౌద్రం చూపించాడు. కానీ, డైరెక్టర్ పనితనం ఈ క్యారెక్టర్‌ని ఇంకా బలంగా డిజైన్ చేసి వుంటే బాగుండేదనిపిస్తుంది. వర పాత్రలో ఆల్రెడీ ‘జై లవ కుశ’ , ‘అదుర్స్’ సినిమాల్లో ఆ తరహా పాత్రను ఎన్టీయార్ పోషించేశాడు. సో, చాలా ఈజీగా నటించేశాడు. తంగం పాత్రలో జాన్వీ కపూర్ జస్ట్ ఓకే. జాన్వీ కపూర్‌కి ఇది తెలుగులో తొలి చిత్రం. బోలెడంత బిల్డప్ ఇచ్చి ఆమెను టాలీవుడ్‌కి తీసుకొచ్చారు. కానీ, ఈ సినిమాలో జాన్వీ పాత్ర జస్ట్ గెస్ట్ రోల్ అంతే అనిపిస్తుంది. ‘చుట్టమల్లే..’ పాట కోసమే కేవలం జాన్వీ కపూర్‌ని తీసుకొచ్చారా.? అనిపిస్తుంది. దేవర భార్య పాత్రలో కనిపించిన శృతి బాగా నటించింది. భైరాగా సైఫ్ అలీఖాన్ పాత్రలోనూ ఏమంత కొత్తదనం కనిపించదు. కానీ, ఆయన వరకూ ఆయన బాగానే నటించి మెప్పించాడు. ఎర్ర సముద్రంలోని ఇతర గ్రామ పెద్దల పాత్రల్లో అజయ్, శ్రీకాంత్ ఓకే అనిపిస్తారు. కథను నెరేట్ చేసే పాత్రలో ప్రకాష్ రాజ్ తనకు కొట్టిన పిండి వంటి పాత్రే. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేర నటించి మెప్పిస్తారు.

సాంకేతిక వర్గం పని తీరు:
అనిరుధ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, పాటలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లో బీజీఎం బాగుంది. కానీ, పాత నేపథ్యమున్న కథకు, ట్రెండీ మ్యూజిక్ ఇచ్చినట్లనిపిస్తుంది. అది కథకు అంతగా అతికినట్లుగా అనిపించదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎర్రసముద్రం అనే ఓ కొత్త ప్రపంచాన్ని, అందులోని విజువల్స్ కళ్లకు ఇంపుగా ఆకర్షణగా చూపించడంలో సఫలమయ్యాడు. నిర్మాణ విలువలు సినిమా రేంజ్‌కి తగ్గట్లుంటాయ్. ఇక, దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే, ‘ఆచార్య’ రూపంలో పెద్ద డిజాస్టర్ ముందుంది. అలాంటప్పుడు ఈ సినిమా విషయంలో ఇంకెంత జాగ్రత్త తీసుకుని వుండాలి. ఆచార్య కోసం సృష్టించిన కొత్త ప్రపంచాన్నే, ఎర్ర సముద్రం అనే పేరు మార్చి చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ కలరింగ్ అదే ఫీల్ కలిగిస్తుంది. పాత రొట్ట కొట్టుడు కథే. కథనాన్ని కూడా కొత్తగా నడిపించలేకపోయాడు. కొన్ని చోట్ల ట్విస్టులు వస్తూ వుంటాయ్. కానీ, వావ్.! అనిపించేలా మాత్రం వుండవు. వాటర్‌లో కంపోజ్ చేసిన యాక్షన్ ఘట్లం ఒకింత ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాలో యాక్షన్ ఘట్టాలకు లోటేం లేదు. కానీ, అవి అలా వస్తూ పోతూ వుంటాయ్. ఏమంత పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవ్. హీరోయిన్ జాన్వీతో చిన్న ఎన్టీయార్ వర లవ్ ట్రాక్ బోర్ కొట్టేలా డిజైన్ చేశాడు. ఎమోషన్ ఎక్కడా కనెక్ట్ కాదు. ఇంటర్వెల్ బ్లాక్ బాగానే కట్ చేసినా.. తదుపరి ఇంకేదో కొత్త కథను చూపిస్తాడు.. షాక్ అయ్యేలా కథనం నడిపిస్తాడు.. అని ఆశిస్తే నిరాశే మిగులుతుంది. పతాక సన్నివేశంలో సెకండ్ పార్ట్ కోసం వదిలిన లీడ్ అక్షరాలా ‘బాహుబలి’ సినిమాని తలపిస్తుంది. కానీ, ఓవరాల్‌గా ‘ఆచార్య’ సెగలు కొరటాలలో ఇంకా పోయినట్లు లేదనడంలో అతిశయోక్తి కాదేమో.

ప్లస్ పాయింట్స్.
కథా నేపథ్యం, అక్కడక్కడా కొన్ని యాక్షన్ ఘట్టాలు,  ఫస్టాఫ్‌లో పెద్ద ఎన్టీయార్ పర్ఫామెన్స్, సముద్రంలోని ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఘట్టం..

మైనస్ పాయింట్స్:
సాగతీతలా అనిపించిన సెకండాఫ్, బోరింగ్ స్క్రీన్‌ప్లే, కొత్తదనం లేని కథనం, ఆచార్య, బాహుబలి రిఫరెన్సులు కనిపించడం..

చివరిగా: ‘దేవర’ రొటీన్ రొట్ట కొట్టుడు యవ్వారమే.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com