తెలంగాణ ఉద్యమ యోధుడు
- September 28, 2024తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన తోలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తను జ్ఞాపకం ఎరిగిన నాటి నుంచి ఉద్యమాలే జీవితంగా బతికి, తన సర్వస్వాన్ని ప్రజల కోసం ధారపోసిన ధీశాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పదవులను గడ్డిపోచలా భావించారు.ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలను ఎదుర్కొని, తన నివాసం ‘జలదృశ్యం’లోనే ఎమ్మెల్యేలను కూడగట్టారు. ఈ జల దృశ్యమే మలి దశ పోరుకి వేదికయ్యింది. తెలంగాణ కోసం జరిగిన మూడు దశల ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న ఏకైక వ్యక్తి బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం ధారపోశారు. తన జీవిత కాలం అంతా తెలంగాణ ప్రజల కోసమే పరితపించారు. నేడు స్వాతంత్య్ర సమరయోధులు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి.
కొండా లక్ష్మణ్ బాపూజీ 1915,సెప్టెంబర్ 27న నాటి నైజాం రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో మధ్యతరగతి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఆసిఫాబాదులో సాగింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్స్ చదివి భాగ్యనగరంలోని న్యాయవాద వృత్తిని చేపట్టారు.
1938లో పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో పాల్గొని పుత్లీబౌలిలో అరెస్టయ్యారు.1940లో న్యాయవాదిగా బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు.1940లో ఆంధ్ర మహాసభలో చేరి ఖద్దరు వస్త్రాల ప్రచారం, అమ్మకం చేపట్టారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆబిడ్స్ పోస్టాఫీసుపై, కోఠీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటంలో పాల్గొని నిజాం పాలనకు చరమగీతం పాడిన ఉద్యమకారుల్లో ముఖ్యులు బాపూజీ. హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమయ్యాక 1952లో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1957లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం దామోదర సంజీవయ్య కేబినెట్‌లో ఆబ్కారీ, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత సీఎం పదవి కోసం పోటీ పడినా దక్కలేదు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన సున్నితంగా తిరస్కరించారు.
కాసు బ్రహ్మనంద రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉంటూనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ ఉధృతి కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామానే తెలంగాణ ఉద్యమాన్ని ఒక చారిత్రక మలుపు తిప్పింది. 1973లో పీవీ నరసింహారావు తదనంతరం బాపూజీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దొరికింది. కానీ, నాటి హోమ్ మంత్రి ఉమా శంకర్ దీక్షిత్ పట్టుదల కారణంగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. 1958లో బాపూజీ హుస్సేన్‌సాగర్ తీరాన భూమి కొనుక్కొని 'జలదృశ్యం' పేరిట బంగ్లాను నిర్మించుకున్నారు.
తెలంగాణ ఉద్యమం ఓట్లు, సీట్లకు పరిమితమై రాజీ ధోరణితో నడుస్తూ, నిరాశ నిస్పృహలతో జనం ఈసురోమంటున్న దశలో ఆయన తెలంగాణ ప్రజల్లో భవిష్యత్ పై ఆశలను చిగురింపజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షపై అమితంగా ఆలోచించే బాపూజీ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు తన ఇల్లునే పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించిన సహృదయ సౌజన్య శీలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఏక నాయకత్వం పనికిరాదని సమష్టి నాయకత్వం మాత్రమే ఆశయ సిద్ధికి దోహదం చేస్తుందని ఎలుగెత్తి చాటిన బాపూజీ.. విద్యార్థి, యువజనులను చైతన్యం చేసి 96 ఏండ్ల వయసులో సైతం తెలంగాణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి తెలంగాణ ఉద్యమంలో సామాజికతను జోడించారు.
జాతీయోద్యమంలో సామాజిక మూలాలు వీడకుండా ప్రజా రాజకీయాలు చేసిన బాపూజీ చేనేత సహకారోద్యమంలో నేతన్నల హక్కుల సాధనకు శ్రమించారు. రాడికలిస్ట్ ఎంఎస్ రాయ్ ఆలోచనలు, రచనలకు, ప్రసంగాలకు ప్రభావితుడై ఆయన ప్రసంగాలను ‘భారత విప్లవ సమస్యలు’ అనే పేరుతో ఉర్దూలోకి అనువాదం చేసి ముద్రించారు. పల్లెలు, పట్టణాల్లోని మురికి వాడల్లో ఉండే పేదలు కుటీర పరిశ్రమల్లో, వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులు చేసుకుని బతికే వారి జీవితాలను మార్చాలని అనుక్షణం తపించిన వ్యక్తి బాపూజీ. వడ్రంగి, కంసాలి, కంచర, మేధర, బెస్త, కల్లుగీత కార్మికుల, దర్జీల, వడ్డెరుల లాంటి ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారు.
మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి సాక్షిగా నిలిచిన బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్యమ రూపంలో ముందుకు వచ్చిన అన్ని సందర్భాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. 2012, సెప్టెంబర్ 21న 97 సంవత్సరాల వయస్సులో బాపూజీ కన్నుమూశారు.తెలంగాణ ప్రజల విముక్తి కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసిన బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం