విశ్వకవి సామ్రాట్
- September 28, 2024రాజు మరణించెనొక తార రాలిపోయె, సుకవి మరణించెనొక తార గగనమెక్కె, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు' అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటి చెప్పిన కవి గుర్రం జాషువా. ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19వ శతాబ్దం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం నూతన ఒరవడితో తన రచనలు కొనసాగించారు జాషువా. ప్రజలలో తన రచనల ద్వారా చైతన్యాన్ని రగిల్చారు. నేడు కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి.
గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాని వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో గుర్రం వీరయ్య-లింగమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి యాదవ కులం, తల్లి మాదిగ కులానికి చెందినవారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో విద్యాభాస్యంలో అనేక కష్టాలు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. కొప్పరవు కవుల అవధానంలో తాను రాసిన అభినందన పద్యాలను వేదిక మీద వినిపించాలని ప్రయత్నిస్తే నిమ్నకులం వాడికి సభలో ప్రవేశార్హత లేదని అన్య వర్ణాలవారు తృణీకరించారు. ఈ పరిస్థితుల్లో పాడుబడ్డ మసీదే పాఠశాలగా, గుడ్డిదీపమే గురువుగా చదువుకున్నాడు.
'నా గురువులు ఇద్దరు- పేదరికం, కుల మత భేదాలు. ఒకటి సహనాన్ని నేర్పితే, రెండోది ఎదిరించే శక్తిని పెంచిందిగాని బానిసగా మార్చలేదు. దారిద్య్రాన్ని, కులభేదాన్ని చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తికట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం' అంటారు జాషువా. పొట్టకూటి కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. బడిపంతులుగా, రెండో ప్రపంచయుద్ధ ప్రచారకుడిగా, టూరింగ్ సినిమాల్లో మూకీ సినిమాలకు కథావాచకుడిగా పనిచేశారు. అద్దెకు, ముద్దకు సరిపోక నానా కష్టాలు పడ్డారు. మద్రాసు ఆకాశవాణి తెలుగు విభాగంలో స్పోకెన్‌వర్డ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
ఆ కాలంలో దళితులకు తిండి, బట్ట తో పాటు స్వేచ్ఛా జీవనం కూడా దుర్భేద్యంగా ఉండేది. 'కఠిన చిత్తుల దురాగములు ఖండించి కనికర మొలకించు కులము నాది' అందుకే 'నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయును' అని గర్జించాడు. చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీసి విప్లవమూర్తిగా సాక్షాత్కరించాడు. 'పంచమ కులం ఎక్కడుంది?' అని నిలదీసాడు. 'ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుట విన్నాను గాని, వసరమునకన్న హీనుడు భాగ్యుడు, యైదవ కులస్థుడెవరమ్మా' అని ఆవేదన చెందారు. తన పద్యాలను దళిత సాహిత్యానికి మార్గదర్శకంగా నిలిపారు. 'ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి యినుప గజ్జెల తల్లి జీవనము సేయు గసరి బుసగొట్టు నాతని గాలిసోక నాల్గు పడగల హైందవ నాగరాజు' అని హిందుత్వాన్ని నిరసించారు.
'విశ్వనరుడను నేను, నాకు తిరుగులేదు' అని చాటి చెప్పారు. కష్టజీవి గురించి చెబుతూ 'వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వానికి భుక్తి లేదు' అంటారు. 'చిక్కిన కాసుచే దనివిజెందు నమాయకుడెల్ల కష్టముల్, బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి, నల్దిక్కులు గల్గు లోకమున ధిక్కరియున్న యరుంధతీ సుతుండొక్కడు, జన్మమెత్తె భరతోర్వరకుం కడగొట్టు బిడ్డడై' అనే పద్యం కష్టజీవి కష్టాలను వివరించారు.
జాషువా అనేక రచనలు చేశారు. ఖండకావ్యాలు రాశారు. వాటిలో గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర అతి ముఖ్యమైనవి. లఘుకావ్యాలు కూడా ఉన్నాయి. ఫిరదౌసి కావ్యంలో వేదన కనిపిస్తుంది. పర్షియన్ చక్రవర్తి గజినీ మహ్మద్ ఆస్థానంలోని కవి ఫిరదౌసి. 'మాటకొక బహుమానం ఇస్తానని' రాజు చెబితే పదేళ్లు శ్రమించి మహాకావ్యం రాస్తాడు. చివరికి అసూయాపరుల మాటలు విని రాజు ఇచ్చిన మాటను తప్పుతాడు. ఆవేదనతో ఆ కవి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వేదనను తానే స్వయంగా అనుభవించినట్లుగా రాశారు జాషువా. తనలోని ఆవేదనలు సమాజానికి తెలియపరచడమే తన రచనల సారాంశమని చెప్పడానికి ఇది నిదర్శనం. జాషువా సమాజంలోని హెచ్చుతగ్గులను వెతికి, దానికి గల కారణాలను పరిశీలించి, అనేక కోణాలలో ఆలోచించి తన కవిత్వ మార్గాన్ని ఎంచుకున్నారు.
'గబ్బిలం' కావ్యం అందుకు నిదర్శనం. దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం 'గబ్బిలం' రాశారు. ఇది కాళిదాసు 'మేఘసందేశం' తరహాలో సాగుతుంది. కావ్యంలో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు. అతడు తన గోడును సమాజానికి వినిపించడమే కావ్యాంశం. 'నాదు కన్నీటి కథ సమన్వయము సేయనార్ద్ర హృదయంబు గూడ కొంతవసరంబు' అని గబ్బిలం గురించి జాషువా వాపోయాడు. ఉత్తమ జాతి పక్షులనబడే హంసలు, పావురం, చిలుకలను పక్కకు తీసి సమాజంలోకి అతి వేగంగా దూసుకుపోయేలా 'గబ్బిలం' కవి కళ్లకు దళితంగానే కనిపించింది.
జాషువాది నిసర్గమైన శైలి. పద్యరచనాశిల్పం తెలిసిన కవుల్లో అగ్రశ్రేణికి చెందినవాడు. ఆయన కవిత్వంలో అద్భుతమైన సృజనాత్మకత, అపురూపమైన భావనాశక్తి కనిపిస్తాయి. 'ముదుల కోయిల కంఠ నివాసము సేయు కొసరింపు కూతల' గుట్టు తెలిసినవాడు. ఇతర భాషాపదాలు కూడా జాషువా కవిత్వంలో అందంగా ఒదిగిపోతాయి. సంయమనం గల రసావేశం జాషువా సొత్తు. జాషువాది అభ్యుదయ మార్గమైన మార్క్స్ దారి కాదు. నారాయణరెడ్డి చెప్పినట్లు 'ఆయనది మహాత్మపథం, మహాబోధి దృక్పథం'. 'కలడంబేద్కరు నా సహోదరుండు' అంటూ సహానుభూతి ప్రకటించి అంబేడ్కర్ అడుగుజాడల్ని అనుసరించాడు.
గుర్రం జాషువాకు 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారాలు అందించింది. కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి బిరుదులు కూడా అందుకొన్నారు. రాష్ట్ర శాసనమండలిలో సభ్యులుగా కూడా ఉన్నారు. 1971, జులై 24 న ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిత్వం, వ్యధ, కావ్యాల రూపంలో మాత్రం మన మధ్య ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. సమాజ మార్పు కోసమే జాషువా విశేష సాహిత్య సంపదను సృష్టించారు. 'ఈ సమాజం ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉంటే బాగుంటుందనే' వరకు ఆయన కవిత అజరామరంగా ప్రజల నాలుకలపై నర్తిస్తూనే ఉంటుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం