సినిమా రివ్యూ: ‘సత్యం సుందరం’.!
- September 28, 2024
తమిళ హీరో కార్తీ, సీనియర్ హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘సత్యం సుందరం’. ‘96’ వంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్.సి దర్శకత్వం వహించారు. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ అందుకుంది. మరి, తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి) ఉద్ధండరాయుని పాలెంకి చెందిన వ్యక్తి. తనకు ఆ ఊరు అన్నా.. ఆ ఊరులోని తన తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా చాలా ఇష్టం. కానీ, బంధువుల్లో కొందరు చేసిన మోసానికి సత్యం ఆ ఇంటీని కోల్పోవాల్సి వస్తుంది. దాంతో, చిన్న తనంలోనే కుటుంబంతో కలిసి వైజాగ్‌కి వెళ్లిపోతాడు. ఏళ్లు గడిచిపోతాయ్. అక్కడే వైజాగ్‌లో ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగానే వుంటాడు సత్యం. కానీ, తనకు తన సొంత ఊరు, సొంత ఇళ్లు ఎప్పుడూ గుర్తొస్తూనే వుంటాయ్. ఓ సారి ఓ వివాహ వేడుక నేపథ్యంలో ఊరి నుంచి ఆహ్వానం రావడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్ధండరాయుని పాలెం వస్తాడు సత్యం. అక్కడ ఓ వ్యక్తి (కార్తి) బావ.. బావ.. అంటూ వెంట పడుతూ ఎక్కడ లేని ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తుంటాడు. మొదట్లో అతన్ని జిడ్డుగా భావించిన సత్యం.. ఆ తర్వాత ఆ వ్యక్తి చూపించే ప్రేమాప్యతలకు ఫిదా అయిపోతుంటాడు. కానీ, తనకు తన ఊరి వాళ్లు చేసిన అన్యాయం, అక్కడి మనుషుల మీద పెరిగిన ద్వేషం గుర్తొచ్చి చెప్ప పెట్టకుండా ఆ ఊరి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాతే ఆ వ్యక్తి ప్రేమ విలువ తెలుస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.? సత్యానికి, తనతో వున్న బంధం ఏంటీ.? అంత మంచి వ్యక్తిని కలవడానికి సత్యం మళ్లీ సొంతూరికి తిరిగొచ్చాడా.? తెలియాలంటే ‘సత్యం సుందరం’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
కార్తి, అరవింద్ స్వామి నటన ఈ సినిమాకి ప్లస్. డైరెక్టర్ ఈ కాస్టింగ్ సెలక్షన్‌తోనే సగం సక్సెస్ అయిపోయాడు. ఇక, తెరపై కార్తి, అరవింద్ స్వామి కనిపించరు. వారి పాత్రలే కనిపిస్తాయ్. అత్యంత సహజ సిద్ధంగా. నటించారు అనే దానికన్నా.. జీవించేశారు అనడం అతిశయోక్తి వుండదేమో. సినిమా ఆధ్యంతం ఓ అద్భుతమైన నవల చదువుతున్నట్లుగా సాగిపోతుంది. కమర్షియల్ సినిమాల్లో మాదిరి ఎక్కడా కుదుపులుండవ్. చూస్తున్నంతసేపూ ఫీల్‌ని అనుభూతి చెందుతూనే వుంటాం సత్యం, సుందరం పాత్రల్లో. శ్రీ దివ్య తదితర పాత్రలు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
హాయిగా సాగిపోయే కథలో అక్కడక్కడా ఆకట్టుకునే భావోద్వేగాలు.. మళ్లీ వెంటనే హాయిగా నవ్వుకునే నవ్వులు.. కొన్ని చోట్ల మనసు బరువెక్కించే భారమైన సన్నివేశాలు.. సినిమా మొత్తం క్యారీ చేస్తుంటాయ్. అందరికీ ఫ్యామిలీ బంధాలు.. వాటి గొప్పతనాన్ని గుర్తు చేసే ఓ మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ఈ ‘సత్యం సుందరం’. ఓ సక్సెస్ ఫార్ములాతో లేదంటే, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాత్రమే సినిమాలు రూపొందుతోన్న ఈ రోజుల్లో ఇలాంటి ఓ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తెరపైకి తీసుకురావాలనుకున్న ఆలోచనకు ప్రేమ్ కుమార్‌కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. అలాగే, అలాంటి ఓ కథని ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలా చెప్పడంలోనూ సక్సెస్ అయ్యాడు ప్రేమ్ కుమార్. సినిమాలోని ఎమోషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కనెక్ట్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయ్యింది. జ్యోతిక, సూర్య అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయ్. పల్లెటూరి వాతావరణాన్ని అది కూడా తెలుగు నేటివిటీకి కూడా కనెక్ట్ అయ్యూ విధంగా విజువల్స్ చూపించిన సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.
ప్లస్ పాయింట్స్:
కార్తీ, అరవింద్ స్వామి నేచురల్ పర్‌ఫామెన్స్, కథను, కథనాన్ని హాయిగా నడిపించిన విధానం, క్లైమాక్స్‌లో కార్తి పాత్ర పేరును రివీల్ చేసే ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించినా మనసుకు హత్తుకున్న కొన్ని ఎమోషనల్ సీన్స్.. కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్ సీన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ప్లస్ పాయింట్సే కనిపిస్తాయ్ ఈ సినిమాలో.
మైనస్ పాయింట్స్:
చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఇలాంటి సినిమాల్లో మైనస్‌లు వెతకడం కన్నా మూర్ఖత్వం ఇంకోటి వుండదు. ఎంకరేజ్ చేయాల్సిందే.
చివరిగా:
తొలకరి చినుకుల్లో వచ్చే మట్టి వాసనలా.. హయిగా సాగిపోయే పిల్లయేరులా.. సాగిపోయే ఓ అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’.!
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..