వెండితెర నవ్వుల మాంత్రికుడు
- October 01, 2024
తెలుగు తెరపై నెల్లూరు యాసకు ఒక గుర్తింపును తీసుకొచ్చినవారు తొలితరం దిగ్గజ హాస్య నటులు రమణారెడ్డి గారు. ‘ఎట్టా .. ఎట్టెట్టా?’ అంటూ నవ్వులను పరవళ్లు తొక్కించినవారాయన. ఆరు అడుగులు ఉన్నా.. శరీర సౌష్ఠవం పెద్దగా లేకున్నా.. తన ముఖ కవళికలు.. హావభావాలు వంటి వాటితో…ఆయన తెలుగు ప్రజలను మెప్పించారు. అప్పట్లో తెరపై రేలంగి – రమణా రెడ్డి సమకాలికులు. కలిసి కామెడీని పరుగులు తీయించిన జంట. లావుగా ఉన్న రేలంగి ఎంతమాత్రం కదలకుండా నవ్విస్తే .. బక్కపలచగా ఉన్న రమణా రెడ్డి బొంగరంలా గిర్రున తిరుగుతూ .. దభాలున కుప్పకూలిపోతూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నేడు వెండితెర నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి గారి జయంతి.
రమణా రెడ్డి గారి పూర్తిపేరు తిక్కవరపు వెంకటరమణా రెడ్డి.1921, అక్టోబర్ 1న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని వేంకటగిరి సంస్థానంలో భాగమైన జగదేవిపేటలో తిక్కవరపు సుబ్బిరామరెడ్డి, కోటమ్మ దంపతులకు జన్మించారు. వీరి అన్నగారి కుమారుడే ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బిరామ రెడ్డి గారు. వీరిచెల్లెలు భర్త విజయవాడలో శానిటరి ఇనిస్పెక్టర్ చదివించారు. గుంటూరులో 'టీకాలు'వేసే ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగం చేసేవారు. తన పెద్ద అక్క కుమార్తె సుదర్శనమ్మను వివాహం చేసుకున్నారు. సినిమా రంగం మీద వ్యామోహంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నెల్లూరు ప్రాంతం నుంచి సినిమా ఫీల్డ్ కి వెళ్లిన తొలితరం నటుల్లో ఆయన ఒకరు.
1951లో తన దగ్గర బంధువు నెల్లూరిలో ప్రముఖ న్యాయవాది అల్లాడిశంకరరెడ్డి (లవకుశ నిర్మాత)పిలుపు మేరకు మద్రాసు వచ్చి వైవిరావు(నటిలక్ష్మి తండ్రి) దర్శకత్వంలో సర్వోదయ వారి'మానవతి'(1951) జానపద చిత్రంలో జంగమదేవర వేషంలో'తళుక్ తళుక్ మని మెరిసే'అంటూ పాటపాడారు. మెదటి చిత్రంలో విలన్ గానటించారు.ఆచిత్రంలో కథానాయకుడు చదలవాడనారాయణరావు. జూ"శ్రీరంజని కథానాయకి. అనంతరం దీక్ష'(1951) 'పల్లెటూరు'(1952)గరికపాటి రాజారావు గారు నిర్మించిన పుట్టిల్లు'(1953)(ఈచిత్రం ద్వారా జమున పరిచయం అయ్యారు) 'కన్నతల్లి'(1953)(ఈచిత్రద్వారా గాయని సుశీల పరిచయం అయ్యారు) ''పార్వతి కల్యాణం'(1958)లో నారదుని పాత్ర ధరించారు. సారథీస్టూడియోస్ వారి 'రోజులుమారాయి' (1955)చిత్రంలో కరణం పాత్రమంచి పేరు వచ్చింది.అలా 'ఇల్లరికం' (1959) 'ఆత్మబలం'(1964) 'అంతస్తులు'(1965) వంటి వందల చిత్రాలలోనటించారు.
రమణారెడ్డి తెరపై ఉన్నట్టుగా చలాకీగా .. గడసారిగా బయట ఉండరు. బయట ఆయన చాలా మితభాషి. అందువలన ఎవరూ కూడా ఆయనకి ఒక వేషం ఇస్తే బాగా నవ్విస్తాడని అనుకోలేదు. అలా మొత్తానికి తన ప్రయత్నాలు ఫలించి, చిన్న చిన్న వేషాలను సంపాదించుకుంటూ ముందుకు వెళ్లసాగారు. అలా ఆయన గురించి అందరికీ ఒక స్పష్టమైన అవగాహన వచ్చేలా చేసిన సినిమాలుగా ‘బంగారు పాప’ .. ‘మిస్సమ్మ’ కనిపిస్తాయి. ముఖ్యంగా ‘మిస్సమ్మ’లో ప్రేమిస్తున్నానంటూ ఒక పువ్వు పట్టుకుని సావిత్రి వెంటపడే పాత్ర అప్పుడే కాదు .. ఇప్పటికీ నవ్వులు పూయిస్తూనే ఉంటుంది.
గ్రామీణ నేపథ్యంలోని పాత్రలు .. పట్నం నేపథ్యంలోని పాత్రలను ఆయన అద్భుతంగా పోషించడం మొదలుపెట్టారు. బక్కపలచని ఆయన రూపం .. నెల్లూరు యాస .. కాళ్లు .. భుజాలు ఎగరేస్తూ నడిచే తీరు .. కామెడీలోనే కన్నింగు చేసే విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇక అప్పట్లో ఆయనకి భార్యగా సూర్యకాంతం .. కూతురుగా గిరిజ .. అల్లుడుగా రేలంగి కాంబినేషన్ సీన్స్ థియేటర్లను నవ్వుల నావలా మార్చేవి.
మామకి మస్కా కొట్టే అల్లుడి పాత్రలో రేలంగి రెచ్చిపోతే, అల్లుడి పథకాలకు గండికొట్టే మామగా రమణా రెడ్డి చెలరేగిపోయేవారు. ఒకానొక దశలో రేలంగి – రమణా రెడ్డి లేని సినిమా అంటూ ఉండేది కాదు. వాళ్లిద్దరూ పోస్టర్ పై కనిపిస్తే చాలు .. జనాలు ఆ సినిమాకి వెళ్లిపోయేవారు. అప్పటి రచయితలు కూడా రమణా రెడ్డి బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా డైలాగ్స్ రాసేవారు. ముఖ్యంగా రమణా రెడ్డి డైలాగ్స్ లో తెలుగు సామెతలు మరింత గమ్మత్తుగా వినిపించేవి. అప్పట్లో కొంతమంది దర్శకులు తమ సినిమాలో కచ్చితంగా రమణా రెడ్డి ఉండేలా చూసుకునేవారు.
రమణా రెడ్డి సాంఘికాలు మాత్రమే కాదు .. ఆ పర్సనాలిటీతో జానపద .. పౌరాణిక సినిమాలు కూడా చేశారు. అయితే పాత్ర ఏదైనా .. దాని తీరుతెన్నులు ఎలాంటివైనా నెల్లూరు మాండలికంలోనే ఆయన డైలాగులు చెప్పేవారు. ఆయనకి గల క్రేజ్ కారణంగా .. అదే ఒక ప్రత్యేకతగా నిలవడం వలన ఎవరూ కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పేవారు కాదు. ఇక ఆయన ఎప్పుడూ ఎవరినీ విమర్శించేవారు కాదు. అందరితోను ఆప్యాయంగానే ఉండేవారు. అందువలన ప్రతి ఒక్కరూ తమ సినిమాలో రమణా రెడ్డి ఉండాలనే కోరుకునేవారు.
స్వార్థపరుడైన వ్యాపారిగా .. దొంగలెక్కలు రాసే గుమస్తాగా .. ఆస్తిపాస్తులు ఉన్న కుర్రాడికి ఎలాగైనా తన కూతురిని అంటగట్టాలనే దురాశా పరుడిగా .. భార్యకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టే భర్తగా .. పెళ్లి సంబంధాలు చెడగొట్టే బాపతు పాత్రల్లోను ఆయన జీవించేవారు. రెండు దశాబ్దాలకి పైగా ఆయన ఎన్నో పాత్రలను చేశారు. ఆ సినిమాలను గురించి చెప్పుకోవాలంటే అదో మహా గ్రంథమే అవుతుంది.
రమణారెడ్డి గారికి ముందు నుంచి మ్యాజిక్ సరదా వుండేది. సినిమా వేషాలు దొరకనప్పుడూ, దొరికిన తర్వాత తీరిక దొరికినప్పుడూ, మ్యాజిక్ నేర్చుకున్నారు. చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. శిష్యుల్ని తయారుచేసేవారు. ‘సేవాసంఘాల సహాయనిధికి’ అంటే, ఆ సంస్థ గుణగణాల్ని పరిశీలించి, ఉచితంగా మ్యాజిక్ ప్రదర్శనలుఇచ్చేవారు.కొన్ని షూటింగుల టైమ్‌లో విరామం దొరికితే, అందరి మధ్య కూచుని చిన్న చిన్న ట్రిక్కులు చేసి, ‘అరెరె!’ అనో, ‘అబ్బా!’ అనో అనిపించేవారు. ఆరుద్ర కూడా చిన్నచిన్న మ్యాజిక్‌లు చేసేవారుగనక, ఈ ఇద్దరూ కలిస్తే ఆ టాపిక్ వచ్చేది. కొత్తకొత్త ట్రిక్సూ వచ్చేవి.
వ్యక్తిగా రమణారెడ్డి సౌమ్యుడు. తెరమీద ఎంత అల్లరీ, ఆర్భాటం చేసి నవ్వించేవారో బయట అంత సీరియస్. ఏవో జోకులువేసినా సైలెంటుగానే ఉండేవి. గట్టిగా మాట వినిపించేది కాదు. మనసుకూడా అంత నెమ్మదైనదే. ఏనాడూ ఎవరి గురించీ చెడుమాట్లాడ్డమో, విమర్శించడమో చేసేవాడు కాదు. తన పనేదో తనది, ఒకరి సంగతి తనకక్కరల్లేదు. అంత నవ్వించినవాడూ తన ఆనారోగ్యాన్ని మాత్రం నవ్వించలేకపోయాడు. అది అతన్ని బాగా ఏడిపించింది. అనారోగ్యం కారణంగానే 1974,నవంబర్ 11తేదిన తన 53వ యేట రమణారెడ్డి గారు కన్నుమూశారు. తరాలు మారుతున్నా .. కామెడీ రూపు రేఖలు మారుతున్నా .. రమణారెడ్డి స్థానం రమణా రెడ్డి గారిదే. ఆ స్థానాన్ని ఆక్రమించడం .. అధిగమించడం మరికారికి సాధ్యం కాదు.
- డి.వి.అరవింద్, మాగుల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!