వెండితెర కట్టప్ప...!

- October 03, 2024 , by Maagulf
వెండితెర కట్టప్ప...!

సముద్ర కెరటాన్ని చూస్తే ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురని కూలుతూ ఉంటుంది. మళ్ళీ లేస్తూనే ఉంటుంది. కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ కెరీర్ గ్రాఫ్ చూసినా అదే అనిపిస్తుంది. తెరపై సత్యరాజ్ ను చూడగానే ఈ తరం వాళ్ళు ‘బాహుబలి’ సీరిస్ ‘కట్టప్ప’ అంటూ ఉంటారు.  కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో అందమైన విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు సత్యరాజ్. తమిళ నాట స్టార్ హీరోగా సాగిన తరువాత, క్యారెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. అప్పటి నుంచి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సత్యరాజ్ క్యారెక్టర్ యాక్టర్ గా అలరిస్తూనే ఉండడం విశేషం. నేడు వెండితెర కట్టప్ప పుట్టినరోజు.

సత్యరాజ్ అసలుపేరు రంగరాజ్‌. 1954 అక్టోబర్ 3న కొయంబత్తూరు సమీపంలోని గాంధీనగర్ ఆయన జన్మస్థలం. తండ్రి సుబ్బయ్య డాక్టర్. కొయంబత్తూరులోనే సత్యరాజ్ బి.ఎస్సీ వరకు చదివారు. చిన్నతనం నుండే సినిమాల్లో నటించాలన్న అభిలాష ఉండేది, పెద్దయ్యాక అది మరింత ఎక్కువయింది. ఎమ్.జి.రామచంద్రన్, రాజేశ్ ఖన్నాలు సత్యరాజ్ అభిమాన నటులు. ఎలాగైనా నటునిగా తెరపై కనిపించాలన్న అభిలాషతో చెన్నై చేరారు సత్యరాజ్. అయితే, ఆయన తల్లికి సత్యరాజ్ సినిమా యాక్టర్ కావడం ఏ మాత్రం ఇష్టం లేదు.

తమిళ హీరో సూర్య తండ్రి శివకుమార్ అప్పట్లో స్టార్ హీరో. ఆయనను కలసి ఎలాగైనా తనకు నటునిగా అవకాశాలు ఇప్పించమని ప్రాధేయపడ్డారు సత్యరాజ్. అయితే బుద్ధిగా ఇంటికి వెళ్ళి, కన్నవారు చెప్పినట్టు నడచుకోమని సలహా ఇచ్చారు శివకుమార్. కానీ, సత్యరాజ్ చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన మిత్రుడు మాదంపట్టి శివకుమార్, ప్రతి నెలా సత్యరాజ్ కు డబ్బు పంపేవారు. దాంతో పట్టువదలని విక్రమార్కునిలా సత్యరాజ్ ప్రయత్నాలు కొనసాగించారు. కొన్ని చిత్రాల్లో ఆఫ్ బిట్ రోల్స్ లోనూ కనిపించారు.

కమల్ హాసన్ హీరోగా రూపొందిన ‘సట్టం ఎన్ కైయిల్’ చిత్రంలో తొలిసారి కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్. అందులో విలన్ తెంగై శ్రీనివాసన్ అనుచరునిగా సత్యరాజ్ నటించారు. కొన్ని చిత్రాలకు ప్రొడక్షన్‌ మేనేజర్ గానూ పనిచేశారు. ఆయన మేనేజర్ గా పనిచేసిన చిత్రాలలోనూ నటించేవారు. శోభన్ బాబు హీరోగా రూపొందిన ‘ఇద్దరు కొడుకులు’లో విలన్ గా నటించారు సత్యరాజ్. 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన ‘సావి’ చిత్రంలో తొలిసారి హీరోగా నటించారు సత్యరాజ్.

సత్యరాజ్ హీరోగా రూపొందిన “నడిగమ్, బ్రమ్మ, రిక్షామామ, కళ్యాణ గలాట్టా, సుయంవరమ్, మలబార్ పోలీస్” వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ‘అమైది పడై’ చిత్రంలో తండ్రీకొడుకులుగా సత్యరాజ్ నటించి ఎంతగానో మురిపించారు. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. హీరోగా ప్రభ తగ్గగానే సపోర్టింగ్ యాక్టర్ గా మారిపోయారు సత్యరాజ్. ఆయనకు ఇద్దరు పిల్లలు. కూతురు దివ్య, తనయుడు సిబిరాజ్. తండ్రిలాగే సిబిరాజ్ సైతం నటనలో అడుగుపెట్టాడు. సత్యరాజ్ “లీ, నాయిగల్ జాకిరతై, సత్య” వంటి చిత్రాలను నిర్మించారు. ‘విల్లాది విలన్’ అనే చిత్రానికి దర్శకత్వం కూడా నిర్వహించారు. ఇది మంచి విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమా ‘శాస్త్రి’పేరుతో అనువాదమయింది. ఎందుకనో ఈ సినిమా తరువాత సత్యరాజ్ దర్శకత్వానికి దూరంగా జరిగారు.

సుదీర్ఘ విరామం తర్వాత 2009లో కోలీవుడ్ దర్శకుడు శివ, గోపీచంద్ తెరకెక్కించిన శంఖం చిత్రం ద్వారా సత్యరాజ్ టాలీవుడ్ బాట పట్టారు. శంఖం తరువాత వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆయనకు మిర్చి, బాహుబలి సిరీస్ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకోని రావడమే కాకుండా ఇతర భాషల్లో నటించే అవకాశాలు వచ్చేందుకు దోహదపడ్డాయి. తన వృత్తినే తాను దైవంగా భావిస్తానని చెబుతుంటారు సత్యరాజ్. తెలుగువారి మదిలో ‘కట్టప్ప’గా చోటు చేసుకున్న సత్యరాజ్ ఇప్పటికి అనేక చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. 


 - డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com