బీర్ల అమ్మకాల్లో తెలంగాణ రికార్డు..

- June 21, 2016 , by Maagulf
బీర్ల అమ్మకాల్లో తెలంగాణ రికార్డు..

 బీర్ విక్రయాల్లో తెలంగాణ టాప్ లేపింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలకు అందనంత ఎత్తులో నిలిచింది. విక్రయాల్లో అగ్రస్థానాల్లో నిలిచి అధికారులను ఆశ్చర్యపరిచింది. బీర్ల అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే నంబర్‌వన్‌గా నిలిచింది. అదీ ఏరేంజ్‌లో అంటే రెండోస్థానంలో ఉన్న కేరళ కంటే కూడా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు తెలంగాణలో జరిగాయి.

2015-16 ఆర్థిక సంవత్సరంలో మందుబాబులు భారీగా బీర్లు లాగించేశారు. తెలంగాణలో మొత్తం 334.56 లక్షల కేసుల బీర్లు గుటకాయ స్వాహా చేశారు. సగటున మనిషికి 7.48 లీటర్ల బీరు విక్రయాలు జరిగాయి. కూల్ బీర్‌ను లాగించేయడంలో కేరళ రెండో స్థానంలో నిలిచింది. కేరళలో సగటున 3.64 లీటర్ల మేరకు బీరు తాగారు. అంటే మళయాళీల కంటే తెలంగాణలో రెట్టింపు బీర్లు తాగేశారన్నమాట. కర్నాటక మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 2.72 లీటర్లతో నాలుగో స్థానంలో ఉంది. మద్యం విక్రయాల్లో మాత్రం సగటున 8.23 లీటర్లతో కర్నాటక టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. సగటున 6.82 లీటర్లతో తమిళనాడు రెండోస్థానంలో నిలిచింది. బీర్ విక్రయాల్లో అగ్రస్థానం సాధించిన తెలంగాణ మద్యం అమ్మకాల్లో 6లీటర్ల సగటుతో మూడో స్థానంలో సెటిలైంది. 5.47లీటర్లతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. బీర్ల అమ్మకాల్లో రెండో స్థానంలో ఉన్న కేరళ మద్యం విక్రయాల్లో మాత్రం చివరిస్థానంలో నిలిచింది. బీరు మద్యం అమ్మకాలను చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈ సారి బీర్ల అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com