రాజకీయ ఋషివర్యుడు...!
- October 11, 2024
భారతదేశ రాజకీయాల్లో నానాజీ దేశ్‌ముఖ్ ఒక ప్రభల శక్తి. ఈనాడు భారతీయ జనతా పార్టీ పూర్వ విభాగమైన జనసంఘ్ పార్టీకి క్షేత్ర స్థాయిలో పటిష్టమైన పూనాదులు వేసిన కార్యశీలి.తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పట్ల నాటి సమాజంలో ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చిన గొప్ప వ్యూహకర్త నానాజీ.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఊపు తీసుకురావడమే కాకుండా, కేంద్రంలో తోలి కాంగ్రెసేతర ప్రభుత్వా ఏర్పాటుకు కృషి చేసిన రాజకీయ చాణక్యుడు ఆయన.ఇదే సమయంలోనే సమాజ సేవలో అంకితం అయ్యేందుకు రాజకీయాలను తృణ ప్రాయంగా త్యజించిన ఋషితుల్యుడిగా మారారు.నేడు ప్రముఖ రాజకీయవేత్త, సామాజిక సేవా కార్యకర్త స్వర్గీయ రాజకీయ ఋషివర్యుడు నానాజీ దేశ్‌ముఖ్ జయంతి.
నానాజీ దేశ్‌ముఖ్ అసలు పేరు చండికాదాస్ అమృతరావు దేశ్‌ముఖ్.1916,అక్టోబర్ 11న ఒకప్పటి నిజాం సంస్థానంలోని మరాఠ్వాడా ప్రాంతంలో భాగమైన కడోలి అనే చిన్న పట్టణంలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణిస్తే మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకున్నారు. వారి కుటుంబ ఆర్థిక స్థితి సైతం అంతంత మాత్రమే ఉండటం చేత తన పోషణ కోసం కూరగాయలు అమ్మేవారు. చదువు పట్ల మొదటి నుండి ఆసక్తి ఉండటంతో బాగా శ్రద్ధగా చదివేవారు. పై చదువుల కోసం తెలిసిన వారి ద్వారా నాటి రాజస్థాన్ ప్రాంతంలోని శిఖర్ రాజా ఇస్తున్న ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేసుకోగా, నానాజీ ప్రతిభకు ముగ్దుడైన రాజావారు పిలానీలోని బిర్లా కళాశాలలో చదువుకోవడానికి ఉపకారవేతనం మంజూరు చేశారు.పిలానీలో ఇంటర్ పూర్తి చేశారు నానాజీ.
నానాజీ దేశ్‌ముఖ్ మేనమామకు రాష్ట్రీయ సవయం సేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.హెడ్గేవార్ తరచూ వారింటికి వస్తూ ఉండటంతో పాటు ఆయన వ్యక్తిత్వ ప్రభావం యువ నానాజీ మీద పడింది. హెడ్గేవార్ స్ఫూర్తితోనే సంఘంలో చేరారు. పిలానీలో చదువుతున్న సమయంలోనే అక్కడ శాఖను ప్రారంభించారు. నానాజీలోని చురుకుదనం, కార్యదీక్ష, నాయకత్వ లక్షణాలకు ముగ్దులైన సంఘ్ పెద్దలు 1940 ప్రారంభంలో నాటి యునైటెడ్ ప్రావిన్స్(నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం)లోని పూర్వాంచల్ ప్రాంతంలో సంఘ్ బలోపేతం కోసం ప్రచారక్ గా పంపారు. గోరఖ్ పూర్ కేంద్రంగా చేసుకొని సంఘ్ కార్యకలాపాలను వేగంగా విస్తరించారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళినాటికి యూపీలోని అన్ని ప్రాంతాల్లో సంఘ్ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి.
నెహ్రూ విధానాలను నిరసిస్తూ ఆయన మంత్రివర్గంలో కీలక సభ్యుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ రాజీనామా చేసి, నాటి సంఘ్ చాలక్ గురూజీ సహకారంతో భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించగా, సంఘ్ తరుపున దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బీహారీ వాజపేయ్ మరియు నానాజీ దేశముఖ్ మరియు ఇతర సంఘ కీలక కార్యకర్తలు ఆ పార్టీలో పనిచేసేందుకు గురూజీ సమ్మతించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బీహారీ వాజపేయ్ లు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కాగా, నానాజీ ఉత్తరప్రదేశ్ జనసంఘ్ కార్యనిర్వాహక కార్యదర్శిగా యూపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. సంఘ్ శాఖల ద్వారా జనసంఘ్ పార్టీకి క్షేత్రస్థాయిలో జవసత్వాలు కల్పించారు. 1957 లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని బలరాంపూర్ నుంచి అటల్ బిహారీ వాజపేయ్ ఎంపీగా ఎన్నికవ్వడంలో నానాజీ పాత్ర కీలకం.
నెహ్రూ మరణం తర్వాత యూపీ రాజకీయాల్లో వచ్చిన మార్పులకనుగుణంగా జనసంఘ్ పార్టీని నడిపిస్తూ కాంగ్రెసేతర పక్ష పార్టీలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియాతో పాటుగా రైతు నేత చరణ్ సింగ్ వంటి విపక్ష నేతలతో కలిసి పనిచేశారు.1967లో యూపీలో విపక్ష పార్టీలన్ని కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నానాజీ ప్రధాన పోషించారు. కాంగ్రెస్ దిగ్గజ నేత చంద్రభాన్ గుప్తాకు సీఎం పీఠం దక్కనీయకుండా చేయడంలో నానాజీ పన్నిన వ్యూహాలు ఈనాటికి రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. 1967 నాటికీ యూపీ నుంచి అత్యధిక మంది జనసంఘ్ ఎంపీలు లోక్ సభకు వెళ్లడంతో నానాజీ పేరు జాతీయ రాజకీయాల్లో తెరపైకి వచ్చింది.
1968లో జనసంఘ్ పెద్దదిక్కుగా ఉన్న దీనదయాళ్ ఉపాధ్యాయ ఆకస్మిక మరణంతో పాటుగా సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నానాజీ. జనసంఘ్ పార్టీ ఆర్థిక మూలాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. రాజకీయాల్లో నానాజీ పేరు వింటూ వచ్చిన ఆనాటి ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్తలు ఆయనతో సన్నిహిత పరిచయాలు ఏర్పర్చుకోవడమే కాకుండా, జనసంఘ్ పార్టీకి భారీగా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వీరిలో పాకిస్థాన్ వ్యవస్థాపకుడైన జిన్నా మనవడు, వాడియా గ్రూప్ అధినేత నుస్లీ వాడియా మొదటి స్థానంలో ఉండేవారు. నానాజీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నంత కాలం జనసంఘ్ మరియు తన మాతృ సంస్థ సంఘానికి విరాళాలు వెల్లువలా వచ్చేవి.
70వ దశకం దేశ రాజకీయాల్లో వచ్చిన సంచలనాత్మక మార్పుల్లో నానాజీ ప్రముఖమైనది. సర్వోదయ ఉద్యమ నేత, గాంధేయవాదిగా ముద్ర పడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారు అవినీతి వ్యతిరేకంగా ప్రారంభించిన లోక్‌సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శిగా, ఆయన కుడిభుజంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో భారతదేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావజాలాలను పక్కన పెట్టి మరి స్వపక్షాన్ని, మిగిలిన విపక్ష పార్టీలను కలుపుకొని వెళ్లడంలో ప్రత్యేక చొరవ చూపించారు. ఎమెర్జెన్సీ సాకుగా చూపి నాటి ఇందిరా ప్రభుత్వం ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలందరిని అరెస్ట్ చేసి జైళ్ళకు తరలించినా, ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు.
1977 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు విపక్ష పార్టీల నేతలను కలుపుకొని జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జనతా పార్టీని ఏర్పాటు చేయడంలో నానాజీ పాత్ర ఉంది. ఆ ఎన్నికల్లో తాను బలరాంపూర్ నుండి పోటీ చేసినా తన విజయం కోసం కాకుండా జనతా పార్టీ అభ్యర్థుల విజయం కృషి చేశారు. అయన ప్రచారం చేసిన వారితో పాటుగా నానాజీ సైతం ఘనవిజయం సాధించారు. మొరార్జీ దేశాయ్ సారథ్యంలో ఏర్పడ్డ తోలి కాంగ్రెసేతర కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టమని దేశాయ్ స్వయంగా కోరినా నిర్ద్వందంగా తిరస్కరించారు. మాజీ ప్రధాని, అప్పటి జనతా పార్టీ యువనేత చంద్రశేఖర్ సైతం నానాజీలాగే మంత్రి పదవిని చేపట్టకపోవడం విశేషం.
1980లో జనతా పార్టీ విచ్ఛిన్నం, అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో రాజకీయాల పట్ల విరక్తి చెందారు. తనకు తానుగానే రాజకీయాల నుండి వైదొలగి తనకిష్టమైన సమాజ సేవలో నిమగ్నమయ్యారు. 60వ దశకంలోనే వినోబా భావే నడిపిన భూదాన ఉద్యమంలో, జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సర్వోదయ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నానాజీలో రాజకీయ అహాన్ని పెంచకుండా ఉండటంలో ఆయనలోని సేవా తత్పరత కారణం అని ఆయన సమకాలిక రాజకీయ నాయకులు సైతం అంగీకరిస్తారు. సర్వోదయ ఉద్యమం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ - ప్రభావతి దేవి దంపతులకు ఆత్మీయుడయ్యారు. రాజకీయాల నుండి విరమించిన తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న చిత్రకూట్ అనే చిన్న పట్టణంలో స్థిరపడ్డారు.
శ్రీరామ చంద్రుడు నడయాడిన చిత్రకూట్ ప్రాంతానికి చారిత్రాత్మక గుర్తింపు ఉంది. దాంతో పాటుగా ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడటంతో పాటుగా కరువు పరిస్థితులు,మూఢాచారాలు, బందిపోటు ముఠాల అరాచకాల కారణంగా నిరక్ష్యరాస్యత అధికంగా ఉండేది. ఆ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను చైతన్యం చేయాలనే తలంపుతో తన రాజకీయ మార్గదర్శి దీనదయాళ్ ఉపాధ్యాయ పేరు మీదగా ట్రస్ట్ ఏర్పాటు చేసి యూపీ, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని సుమారు 200 పైగా వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకోని, ఉపాధ్యాయ ప్రవచించిన "ఏకాత్మ మానవవాదం" (Integral Humanism) సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ గ్రామస్తుల సహకారంతో ఆయా గ్రామాల్లో మద్యపాన నిషేధం, మూడాఛారాల రూపుమాపడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటుగా అహింసాత్మకంగా పోరాడుతూ బందిపోటు ముఠాలను జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా కృషి చేశారు.
విద్య పట్ల నానాజీకి మక్కువ ఎక్కువ.పరిస్థితుల మూలంగా తానూ ఉన్నత విద్యను అభ్యసించక పోయినా, విద్యాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. గోరఖ్ పూర్ కేంద్రంగా తోలి సరస్వతీ శిశు మందిరాన్ని స్థాపించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోని సంఘ్ పెద్దలు సైతం దేశవ్యాప్తంగా శిశు మందిరాలను ఏర్పాటు చేశారు. నేడు సరస్వతీ శిశు మందిరాల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే,దీనదయాళ్ ట్రస్ట్ తరుపున చిత్రకూట్ పరిసర ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యత నిర్మూలనకు పాఠశాలలు, వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, దేశంలోనే మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి గల గ్రామీణ విశ్వవిద్యాలయమైన "చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం"ను స్థాపించి ఛాన్సలర్ గా నానాజీ వ్యవహరించారు. గ్రామీణభివృద్ధికి సంబంధించిన కోర్సులతో పాటుగా ఆధునిక వృత్తి విద్యా కోర్సులను అందిస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సహకారాన్ని అందించారు.
నానాజీ మార్గదర్శనంలో చిత్రకూట్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధితో పాటుగా, ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తూ రోడ్లు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్ డ్యాముల నిర్మాణంతో ఆ ప్రాంతాన్ని కరువు రహిత ప్రాంతంగా మార్చుకున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ జీవితాలను బాగు చేసిన నానాజీ గారు వాళ్లకు దైవంతో సమానం. చిత్రకూట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దిద్దడంలో సైతం ఆయన పాత్ర మరువలేనిది.
రాజకీయాల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషమైన కీర్తిని పొందిన నానాజీ పత్రికా రంగంలో సైతం రాణించారు. సంఘ్ పెద్దల కోరిక మేరకు రాష్ట్రధర్మ, పాంచజన్య హిందీ పత్రికలను స్థాపించారు. ఈ రెండు పత్రికలకు వాజపేయ్ వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకొని సంఘ్ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మలచడం కోసం అహోరాత్రులు శ్రమించారు. ఈ రెండు పత్రికలను లాభాల బాటలో నడిపించేందుకు కొత్త కొత్త మార్కెటింగ్ విధానాలను ప్రవేశపెట్టి విజయం సాధించారు. పత్రికా ప్రపంచంలో నానాజీ కృషిని గుర్తిస్తూ అఖిల భారత పత్రికా సంఘంలో శాశ్వత ఆహ్వానితుడి హోదాను ఇచ్చారు.
గ్రామీణాభివృద్ధికి నానాజీ దేశ్‌ముఖ్ చేసిన కృషికి గానూ దేశ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించారు. 1999లో పద్మ విభూషణ్ అవార్డుతో ఆయన్ను కేంద్రం గౌరవించింది. అదే సంవత్సరం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన మరణించిన 9 ఏళ్ల తర్వాత 2019లో మోడీ సర్కార్ "భారతరత్న" పురస్కారంతో గౌరవించింది.
భారతదేశం యొక్క అసలైన సంపద సహజ వనరుల రూపంలో గ్రామాల్లో దాగి ఉందని అభిప్రాయపడ్డారు. దీన్ని ప్రభుత్వ పెద్దలు విస్మరిస్తున్నారని అన్నారు. కేవలం నగరాలను మాత్రమే అభివృద్ధి చేస్తూ దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాలను విస్మరించడం తగదని ఆయన బ్రతికున్న కాలంలో పలుమార్లు ధ్వజమెత్తారు. చివరి శ్వాస వరకు గ్రామీణాభివృద్ధికి పాటుపడ్డ మహనీయుడైన నానాజీ దేశ్‌ముఖ్ గారు 2010,ఫిబ్రవరి 27లో తన 95వ యేట చిత్రకూట్ లోని దీనదయాళ్ ట్రస్ట్ కార్యాలయంలోని తన నివాసంలో కన్నుమూశారు. నానాజీ మరణించి దశాబ్దం కావొస్తున్నా ఆయన చేసిన సమాజహిత కార్యక్రమాల ద్వారా చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి