సౌదీ నుంచి కోడలిని చంపటానికి అత్త ప్లాన్

- June 22, 2016 , by Maagulf
సౌదీ నుంచి కోడలిని చంపటానికి అత్త ప్లాన్

కోడలిని చంపించడానికి సౌదీ నుంచి అత్త కుట్ర. అక్కడి నుంచి నిందితుడు మదనపల్లె రాక. రెండు రోజుల రెక్కీ, అంతలోపే అరెస్టు చేసిన పోలీసులు మదనపల్లె: సౌదీ అరేబియా నుంచి కోడలి హత్యకు కుట్ర పన్నింది ఓ అత్త. హత్య చేయడానికి స్వయానా మరిదిని రంగంలోకి దింపింది. సౌదీలోనే ఉన్న అతను హత్య చేయడానికి మదనపల్లెకు వచ్చాడు. నిందితుడు రెండురోజులు రెక్కీ నిర్వహించాడు. ఇంతలో హత్యకు కుట్ర పన్నిన విషయం పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అరెస్టు చేసి మంగళవారం మదనపల్లె కోర్టులో హజరుపరిచారు. దీంతో కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు..
తంబళ్లపల్లెకు చెందిన ఈశ్వరమ్మ కొన్నేళ్లుగా సౌదీలో ఉంటూ భారీగా ఆస్తులను సంపాదించింది. ఈమెకు కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆమె సౌదీలో ఉండగానే కొడుకు వినయ్‌కుమార్ (23) ఏడు నెలల క్రితం గాలివీడు ప్రాంతానికి చెందిన అశ్విని (20)ని కులాంతర వివాహం చేసుకున్నాడు. తమ కులం కాని ఆమెను కొడుకు పెళ్లి చేసుకోవడంతో భవిష్యత్తులో ఆస్థిపాస్తుల సమస్యలు వస్తాయని భావించింది. దీంతో కోడలిని హత్య చేసి అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. ఇందుకు సౌదీలోనే ఉన్న మరిది గోవిందు అలియాస్ రమణతో పన్నాగం పన్నింది. ఎలాగైనా కోడలిని హత్య చేసి తిరిగి వచ్చేయని పురమాయించి ఇక్కడకు పంపించింది. దీంతో ఇటీవల మదనపల్లె చేరుకున్న గోవిందు ఓ వాహనం అద్దెకు తీసుకున్నాడు. కోడలు కురబలకోట మండలంలోని ముదివేడులో ఉండడంతో రెండు రోజుల క్రితం అక్కడికి వచ్చాడు. ఇక్కడ అశ్విని భర్త వినయ్‌కుమార్‌తో కలసి ఉంటోంది. సమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడకు చేరుకున్నాడు. అశ్విని బయటకు వస్తే చంపేయాలని ముదివేడులో కాపుకాశాడు. లేదంటే ఆమె భర్త బయటకు వెళ్లిన వెంటనే ఇంట్లోకి చొరబడి చంపాలనుకున్నాడు. అయితే అశ్విని గర్భిణీ కావడం ఆపై అనారోగ్యం వల్ల మదనపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లింది. విషయం తెలియక రెండు రోజుల పాటు కాపు కాసినా ఫలితం లేకపోయింది. ఈ లోపు చంపడానికి వచ్చిన విషయం కాస్తా పోలీసులకు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com