సినిమా రివ్యూ: ‘పొట్టేల్’

- October 25, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘పొట్టేల్’

ఈ మధ్య కాలంలో ప్రచార చిత్రాలతోనే నెక్స్‌ట్ లెవల్ బజ్ క్రియేట్ చేసిన సినిమా ‘పొట్టేల్’. ఓ చిన్నపాటి వివాదం, మరో చిన్న సాయం.. ఇలాంటి సంఘటనలు ఈ సినిమాపై అంచనాలు పెరిగేందుకు ఆస్కారమయ్యాయని కూడా చెప్పొచ్చు. హీరోయిన్ అనన్య నాగళ్ల ‘కమిట్మెంట్’ అనే వివాదంలో అనుకోకుండా ఇరుక్కోవడం.. అదే అనన్య నాగళ్ల వరద బాధితుల కోసం చేసిన చిన్న సాయం రెండూ ఈ సినిమాకి మంచి ఓపెపింగ్స్ వచ్చేందుకు కారణమయ్యాయ్. మరి ఆ అంచనాల్ని సినిమా అందుకుందా.? లేదా.? తెలియాలంటే, కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
1970 - 80 మధ్య కాలం నాటి కథ ఇది. మూఢనమ్మకాలు, పటేల్, పట్వారీ పధ్దతులు, చిన్న కులాల వారిపై అణచివేత.. గట్రా అనేక అంశాలు ఈ సినిమాలో చూపించారు. తెలంగాణా - మహారాష్ట్ర బోర్డర్‌లోని గుర్రం గట్టు అనే గ్రామంలో కథ మొదలవుతుంది. ఆ ఊరి గ్రామ దేవత అయిన బాలమ్మకి ఏటా ఏటా జాతర జరుగుతుంది. ప్రతీ ఏటా జాతరలో ఓ పొట్టేల్‌ని బలి ఇస్తారు. ఆ జాతర జరిగే సమయంలో ఊరి పటేల్‌కి అమ్మవారు పూనుతుంటుంది. వంశ పారం పర్యంగా వచ్చే ఈ సాంప్రదాయం ఆ ఊరి అప్పటి పటేల్ (అజయ్)కి మాత్రం చిన్నతనం నుంచీ అమ్మవారు పూనదు. కానీ, నాటకాలాడుతూ జనాల్ని మోసం చేస్తుంటాడు. ఈ విషయం ఆ ఊరివాడే  అయిన గంగాధరీ (యువ చంద్రకృష్ణ)కు మాత్రమే తెలుస్తుంది. కానీ, తన మాటలు ఊర్లో ఎవ్వరూ నమ్మరు. మరోవైపు బలహీన వర్గాలకు చదువుకునే హక్కు, అర్హత లేకుండా చేస్తారు పటేళ్లు. అలాంటి పటేల్‌ని ఎదిరించి తన కూతురు సరస్వతి (తనస్వి)ని చదివించడమే తన ధ్యేయంగా వుంటాడు గంగాధర్. మరోవైపు ఈ సారి జాతరకు బలివ్వాల్సిన పొట్టేల్ సంరక్షణ బాధ్యతలు గంగాధర్‌కి అప్పగిస్తాడు పటేల్. గంగాధర్, తన కూతురు చదువు విషయంలో చేస్తున్న ప్రయత్నాలు కనిపెట్టిన పటేల్, గంగాధర్ వద్ద వున్న పొట్టేల్‌ని ప్లాన్ ప్రకారం మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్‌ని తీసుకురాకుంటే, తన కూతురునే అమ్మవారికి బలిస్తాననీ, ఇది అమ్మవారి మాటగా జనాల్ని నమ్మించి గంగాధర్‌ని హింసలకు గురి చేస్తాడు. మరి, మాయమైన పొట్టేల్‌ని వెతికేందుకు గంగాధర్ ఎలా కష్టపడ్డాడు.? పటేల్ దారుణాల్ని ఎలా బయటపెట్టాడు.? పటేల్ బారి నుంచీ మూఢన నమ్మకాల ముసుగులో కూరుకుపోయి, నిజం తెలుసుకోని జనం బారి నుంచీ తన కూతురుని గంగాధర్ ఎలా రక్షించుకున్నాడు.? గంగాధర్ భార్య బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటీ.? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
కొత్త నటుడు యువ చంద్రకృష్ణకు తొలి సినిమానే అయినా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. చాలా కాలం తర్వాత అనన్య నాగళ్లకు మంచి పాత్ర దక్కింది. ఇంపార్టెన్స్ వున్న పాత్రలో నటించి మెప్పించింది. మరో కీలకమైన పాత్ర సినిమాకి హైలైట్ అయిన పాత్ర.. అజయ్ పాత్ర. పటేల్ పాత్రలో అజయ్ విశ్వరూపం చూపించాడు. తనదైన అనుభవంతో నటించి మెప్పించాడు. డిఫరెంట్ వేరియేషన్స్ వున్న ఈ రోల్‌ని అజయ్ తనదైన ఎక్స్‌పీరియన్స్‌తో శభాష్ అనిపించేలా నటించాడు. కొన్ని సందర్భాల్లో విలన్ పాత్ర మరీ ఇంత కఠినంగా వుంటుందా.? అనిపించేలా ప్రభావం చూపించాడు తన పాత్రతో అజయ్. స్కూల్ టీచర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ నటన ఆకట్టుకుంటుంది. ఛత్రపతి శేఖర్ తనకిచ్చిన పరిధిలో ఎప్పటిలాగే నటించి మెప్పించాడు. మిగిలిన పాత్రలు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
సాహిత్ మోత్కూరి ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే, కథనం నడిపించడంలో కాస్త తడబడ్డాడనిపిస్తుంది. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్.. ఒకింత అలా అలా కథనం నడిచిపోతుంటుంది. కానీ, సెకండాఫ్‌లో ఆ ఫ్లో‌ని క్యారీ చేయలేకపోయాడు. కథలో మూఢనమ్మకాలు, పటేల్ వ్యవస్థ, బలహీనవర్గాల దుర్భరమైన జీవితాలు.. ఆయా వర్గాలు చదువుకోవడం కోసం ఎంత కష్టపడాల్సి వచ్చేదో.. ఇలాంటి అనేక రకాల లేయర్స్‌ని ఈ కథలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ, చివరి వరకూ ఆయా అంశాలను కన్విన్సింగ్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. సినిమాకి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. చాలా సహజ సిద్ధంగా అనిపిస్తాయ్. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే.. గుర్రం గట్టు అనే గ్రామంలోకి ఫస్టాఫ్ అంతా ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోతారు. అంతలా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయ్. నిర్మాణంలో ఎటువంటి లోపాలూ కనిపించవ్. మినిమమ్ బడ్జెట్‌లో మంచి అవుట్ పుట్ రాబట్టారు. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ ఫర్వాలేదని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:
ప్రధాన పాత్రల పర్‌ఫామెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కథా ఉద్దేశ్యం..

మైనస్ పాయింట్స్:
ఎంచుకున్న కథాంశాన్నీ, కథనంలో బ్రిలియంట్‌గా ప్రెజెంట్ చేయలేకపోవడం, చాలా చోట్ల లాజిక్ లేని సన్నివేశాలు, భరించలేని హింస, ప్రేక్షకులకు సహన పరీక్షే..

చివరిగా:
‘పొట్టేల్’ రిలీజ్‌కి ముందు క్రియేట్ అయిన బజ్, తెరపై నెరేట్ చేయడంలో మిస్సింగ్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com