సంగీత సామ్రాట్-సాలూరు రాజేశ్వరరావు
- October 25, 2024
సాలూరు రాజేశ్వరరావు... తెలుగు సినిమా సంగీతంలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకులు. ఆయన బాలమేధావి అనే చెప్పాలి. పట్టుమని ఐదేళ్ళు కూడా నిండని వయసులోనే హార్మోనియం మెట్లపై పాటలకు బాణీలు కట్టేవారు.తబలా, మృదంగం కూడా లయబద్ధంగా వాయించేవారు. చిత్రసీమలో సాలూరి వారి బాణీలు మధురామృతం పంచాయి.మూకీ సినిమాల నాడు సైతం సాలూరి వారి స్వరకల్పన సాగింది. టాకీలలో మరపురాని ‘మల్లీశ్వరి’ని మన ముందు ఉంచారు. ‘చంద్రలేఖ’ డ్రమ్స్ మ్యూజిక్ తో యావత్ భారతాన్నీ మురిపించారు. ‘విప్రనారాయణ’ పాటల సవ్వడి ఈ నాటికీ యెదలను మీటేలా చేశారు. ఏది చేసినా అన్నిటా సాలూరు మార్కు వినిపిస్తుంది. అదే ఈ నాటికీ తెలుగువారిని పులకింప చేస్తోంది.నేడు సంగీత సామ్రాట్, స్వర్గీయ సాలూరు రాజేశ్వరరావు వర్థంతి.
సాలూరు రాజేశ్వరరావు గారు 1922, అక్టోబర్ 11న బొబ్బిలి సంస్థానంలో భాగమైన సాలూరు తాలూకాలోని శివరామపురం గ్రామానికి చెందిన సన్యాసిరాజు, మంగమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి మంచి కవి, మృదంగ విద్వాంసుడు. విజయనగరం సంస్థానంలో ఆయన పనిచేసేవారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీల్లో మృదంగం వాయించేవారు. చిన్నతనంలోనే అన్న హనుమంతరావుతో కలసి తండ్రి వద్ద సంగీతాభ్యాసం చేసేవారు.నాలుగేళ్ళ ప్రాయంలోనే కర్ణాటక సంగీతంలోని రాగాలను ఇట్టే పట్టేసేవారు. తండ్రి వద్దనే హార్మోనియం, తబలా నేర్చుకున్నారు.
తండ్రి సన్యాసి రాజు ఆ రోజుల్లో విడుదలయ్యే మూకీ సినిమాలకు తెర చెంతనే కూర్చుని హార్మోనియం వాయించేవారు.చిన్నారి రాజేశ్వరరావు సైతం ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో హార్మోనియం వాయించి అందరినీ అలరించేవారు. అప్పుడే హచ్చిన్స్ రికార్డింగ్ కంపెనీ వారు కొత్త గాయకుల అన్వేషణలో రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి బెంగుళూరు తీసుకెళ్ళి భగవద్గీత తోబాటు కొన్ని పాటలు పాడించి రికార్డు చేసి విడుదల చేశారు. వేల్ పిక్చర్స్ వారు ‘1934 లో ‘శ్రీకృష్ణలీలలు’ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుపుతూ గూడవల్లి రామబ్రహ్మం, పి.వి. దాసు బెంగళూరులో రాజేశ్వరరావు పాడిన రికార్డులు విని అతనికి శ్రీకృష్ణుడు వేషాన్ని ఖరారు చేశారు.అలా పన్నెండేళ్ళ వయసులో బెరుకు లేకుండా రాజేశ్వరరావు ఆ చిత్రంలో నటించారు.సినిమా 1935 నవంబర్ 23న విడుదలై విజయ దుందుభి మ్రోగించింది.
అలా చిత్రసీమలో నటుడిగా తొలి అడుగు వేసిన రాజేశ్వరరావు ఆపై ‘శశిరేఖా పరిణయం’లో అభిమన్యునిగా నటించి, పాటలతోనూ ఆకట్టుకున్నారు. తరువాత కలకత్తా చేరి అక్కడ ఓ చిత్రంలో నటించే సమయంలో నాటి మేటి గాయకులు కె.ఎల్.సైగల్ వద్ద శిష్యరికం చేశారు. అదే రాజేశ్వరరావు జీవితాన్ని మేలిమలుపు తిప్పింది.అక్కడ ఎందరో పేరొందిన సంగీత దర్శకుల వద్ద హిందుస్థానీ రాగాలనూ ఇట్టే నేర్చుకున్నారు. మద్రాసు చేరాక ‘విష్ణులీల’ అనే చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు. ‘జయప్రద’ చిత్రంతో సోలో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు.
జెమినీ వారి ‘బాలనాగమ్మ’ చిత్రానికి ఎమ్.డి పార్థసారథి సంగీత దర్శకులు కాగా, నేపథ్య సంగీతం బాధ్యత సాలూరు వారికి అప్పగించారు. అందులో నేపథ్య సంగీతం ఆ రోజుల్లో అందరినీ ఆకట్టుకుంది. మరో విశేషమేమంటే, జెమినీ వారి ‘బాలనాగమ్మ’కు పోటీగా వసుంధర సంస్థ ‘శాంత బాలనాగమ్మ’ నిర్మించింది. అందులో బాలవర్ధి రాజు పాత్రలో రాజేశ్వరరావు గారు స్వయంగా నటించి, పాటలు పాడారు. అంతేకాదు ఆ చిత్రానికి సంగీతం సమకూర్చారు. జెమినీ వారి బాలనాగమ్మ భారీతనంతో ఆకట్టుకుని విజయం సాధించింది.
జెమినీ అధినేత వాసన్ కు రాజేశ్వరరావు పై గురి కుదిరింది.దాంతో 1948లో తాను తమిళ,తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘చంద్రలేఖ’కు సాలూరునే సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. అందులో డ్రమ్స్ నేపథ్యంలో రూపొందిన పాటలో సాలూరు ప్రయోగించిన బాణీలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సాలూరు రాజేశ్వరరావు పేరు వినగానే ‘మల్లీశ్వరి’ గుర్తుకు వస్తుంది.ఆ సినిమాను తలచుకోగానే ఆయన బాణీలే మనసున మెదులుతాయి. ఆయన జీవితంలో అన్నిటికన్నా మిన్నగా మేలిమి రత్నంగా వెలుగొందిన చిత్రం వాహినీ వారి ‘మల్లీశ్వరి’. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మల్లీశ్వరి’లోని అన్ని పాటలనూ మనసులను ఆకట్టుకొనేలా స్వరపరిచారు.ఈ చిత్రం ద్వారా దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి చిత్రసీమలో ప్రవేశించారు.రాజేశ్వరరావు అంతకు ముందు, ఆ తరువాత ఎన్ని మధురామృతాలు అందించినా, ‘మల్లీశ్వరి’ అన్నిటిలోకి అతిమధురం అని చెప్పవచ్చు.
‘మల్లీశ్వరి’ తరువాత రాజేశ్వరరావుకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘విప్రనారాయణ’. ఇందులోని పాటలన్నీ అలరించాయి. “ఎందుకోయి తోటమాలీ…అంతులేని యాతన…” పాటను కీరవాణి రాగంలో స్వరపరిచారు.ఈ పాటను విని ఆయనను ఎంతగానో అభిమానించిన శివశక్తిదత్త అదే పనిగా సాలూరు రాజేశ్వరరావు ని చూడటానికి మద్రాసు వెళ్ళారు. ఆ పాట రాగం పేరు తెలుసుకొని, తన తొలి సంతానానికి ఆ పేరే పెట్టాలని నిర్ణయించారు. అలాగే ఆయన తనకు కొడుకు పుట్టగా ఆయనకు కీరవాణి అని నామకరణం చేశారు.ఆ కీరవాణి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మేటి సంగీత దర్శకునిగా సాగుతున్నారు.అలా అభిమానులను ఎంతగానో తన స్వరకల్పనతో ఆకట్టుకున్నారు.
తన సంగీతంతో అలరించడమే కాదు, వ్యక్తిత్వంలోనూ రాజేశ్వరరావు గారిది ప్రత్యేకమైన బాణీ. తనకు ఎవరైనా మనసుకు కష్టం కలిగిస్తే, వారిచ్చే పారితోషికం కోసం ఎదురుచూడకుండా అక్కడిక్కడే సదరు చిత్రాలను వదిలేసిన సందర్భాలున్నాయి.అలా కే.వి.రెడ్డి ‘మాయాబజార్’కు స్వరకల్పన చేస్తూ తనకు నచ్చని అంశాలు చోటు చేసుకోవడంతో ఆ సినిమా వదలుకున్నారు. ఆయన సమకూర్చిన బాణీలను అలాగే పొందుపరచి, మిగిలిన పాటలకు తన మార్కు బాణీలు కట్టారు ఘంటసాల.ఇక పెండ్యాల నాగేశ్వరరావు తన వద్దకు వచ్చి అసిస్టెంట్ గా పనిచేస్తానంటే, వారించి, నీలోనే గొప్ప సంగీతదర్శకుడున్నాడు ప్రయత్నించు అని ప్రోత్సహించారు.
శాస్త్రీయ సంగీతంలోనే అనేకసార్లు మధురామృతం చిలికించిన సాలూరు వారి తరువాతి రోజుల్లో కాలానుగుణంగా తన స్వరకల్పనలో పాశ్చాత్య బాణీలనూ అందిపుచ్చుకొని తెలుగువారిని అలరించారు. నిర్మాతల అభిలాషపై ఉత్తరాది బాణీలను అనుసరిస్తూ స్వరకల్పన చేశారు. సింధుభైరవి, కల్యాణి, మాల్కోస్, భీమ్ పలాస్, మోహన రాగాలంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన సంగీతంలో తమ పాటల స్వర కల్పన జరగాలని తపించిన కవులు ఉన్నారు. ఆయన స్వరకల్పనలో గానం చేసి తరించాలని ఆశించిన గాయకులూ ఉన్నారు.అందరికీ తగిన గుర్తింపు లభించేలా సాలూరి వారి బాణీలు సాగాయి.
వీరి అన్న హనుమంతరావు కూడా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఇక రాజేశ్వరరావు గారి తనయులు అందరూ సంగీత విద్వాంసులే. రామలింగేశ్వరరావు మంచి పియానో/ కీబోర్డ్ ప్లేయర్ కాగా, పూర్ణచంద్రరావు, వాసూరావు మంచి సంగీత దర్శకులు. కోటి విషయానికొస్తే ఆయన ఎన్నో చిత్రాలకు అద్భుత సంగీతం అందించారు.. చివరి రోజుల్లో సాలూరు వారు స్వరకల్పన చేసిన “తాండ్ర పాపారాయుడు, అమెరికా అబ్బాయి, ఆదర్శవంతుడు” చిత్రాల్లోనూ కొన్ని పాటలు మధురామృతం కురిపించాయి.
రాజేశ్వరరావు సరదామనిషి. హాస్యప్రియత్వం ఎక్కువ. ఒకసారి ఓ నిర్మాత వీరికి ఫోను చేసి “కారు రిపేరులో వుంది. మీరు ఆటోలో రండి” అని చెప్పారు. సాలూరు వారికి కోపం వచ్చింది. రెండు గంటలు ఆలస్యంగా స్టూడియోకి చేరుకున్నారు. నిర్మాత “సార్… బాగా ఆలస్యమైనట్లుందే” అని అడిగారు. “అవున్ సార్.. తమరు ఆటోలో రమ్మన్నారు కదా. ఎక్కడా ఆటో దొరకలేదు. ఒక టాక్సీ దొరికింది. దాన్నెక్కి ఆటోకోసం తిరిగి, ఆ ఆటోని పట్టుకునేసరికి ఇంత టైమయింది. ఇవిగో టాక్సీ, ఆటో బిల్లులు” అంటూ చేతికందించారు. నిర్మాత బిక్కమొగం వేశాడు. తెల్లటి పంచె, లాల్చీ వస్త్రధారణతో బెంగాలి బాబులను మరపించే రాజేశ్వరరావు గారు 1999 అక్టోబర్ 25న కన్నుమూశారు. ఆయన గతించి రెడున్నర దశాబ్దాలు అవుతున్నా, ఆయన స్వరపరిచిన స్వరాలు మాత్రం ఈ నాటికీ సంగీత ప్రియులను రసాలూరిస్తూనే ఉండడం విశేషం
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!