వయసు నిర్ధారణకు ఆధార్‌ చెల్లదన్న సుప్రీంకోర్టు

- October 25, 2024 , by Maagulf
వయసు నిర్ధారణకు ఆధార్‌ చెల్లదన్న సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ: నష్ట పరిహారం అందజేయడానికి ఆధార్ కార్డులోని వయసును చూడడం కరెక్ట్ కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్‌-హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం… 2015లోని సెక్షన్ 94 ప్రకారం స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న పుట్టిన తేదీ నుంచి మరణించినవారి వయసును నిర్ణయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించి రూ.19.35లక్షల పరిహారం ఇవ్వాలని రోహ్‌తక్‌లోని మోటార్‌ యాక్సిడెంట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. అనంతరం ఈ కేసు హైకోర్టుకు చేరింది. స్థానిక ట్రైబ్యునల్‌ వయసును తప్పుగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం.. పరిహారాన్ని రూ.9.22లక్షలకు కుదించింది. బాధితుడి ఆధార్‌కార్డు ఆధారంగా వయసు 47ఏళ్లగా నిర్ధరించి పరిహారం లెక్కకట్టినట్లు తెలిపింది. ఆధార్‌ కార్డు ఆధారంగా వయసును పరిగణనలోకి తీసుకొని హైకోర్టు పరిహారం లెక్కకట్టిందని పేర్కొంటూ బాధిత కుటుంబీకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పాఠశాల రికార్డుల ప్రకారం అతడి వయసు 45ఏళ్లు మాత్రమేనని వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరపిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. యూఐడీఏఐ ఇచ్చిన తాజా సర్క్యులర్‌ ప్రకారం.. ఆధార్‌ కేవలం గుర్తింపు కోసమేనని, పుట్టిన తేదీకి రుజువు కాదన్న విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తుచేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com