సుమధుర గాయకుడు-మనో

- October 26, 2024 , by Maagulf
సుమధుర గాయకుడు-మనో

మనో పాడే గీతాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తరువాత ఎలాంటి పాటనైనా అలవోకగా.. అందరినీ ఆకట్టుకునేలా పాడగలే సత్తా ఉన్న ఏకైక గాయకుడిగా మనో గుర్తింపు పొందారు. ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగే పాడుతూ, జనాన్ని ఆకట్టుకున్నారు మనో. ఒకానొక సమయంలో ఏది బాలు పాడిందో, ఏ పాట మనో నోట పలికిందో అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. తెలుగునాట పుట్టి అందరి మన్ననలు అందుకుంటున్న మనో ‘మనోడే’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. పాటల పాడడంతో పాటు డబ్బింగ్ కూడా చెప్పడం మనో ప్రత్యేకత. అలాగే నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా మనో బహుముఖ పాత్రలు పోషించారు. నేడు సీనియర్ గాయకుడు మనో పుట్టినరోజు.

మనో అసలు పేరు నాగూర్ బాబు.1965 అక్టోబర్ 26న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలోని ఓ దూదేకుల సాయుబుల  కుటుంబంలో జన్మించారు. మనో తండ్రి రసూల్ ఆల్ ఇండియా రేడియోలో సంగీతం సమకూర్చేవారు. మనో తల్లి షహీదా రంగస్థల నటి. తల్లితో పాటే మనో కూడా అనేక నాటకాల్లో నటించారు.తన పాటలు తానే పాడుకుంటూ మనో నటించి ఆకట్టుకొనేవారు. నేదునూరి కృష్ణమూర్తి వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు మనో.గాయకుడు కాకముందే, మనో బాల నటుడిగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు. 'నీడ' అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. ఓ వైపు సంగీతసాధన చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు.

దర్శక రత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందిన ‘రంగూన్ రౌడీ’, ‘ఓ ఆడది – ఓ మగాడు’, ‘కేటుగాడు’ వంటి చిత్రాలలో మనో నటించారు. మనో అన్నయ్య సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద తబలా వాద్యకారుడు. అన్న సహకారంతో చక్రవర్తి గారి వద్ద సహాయకుడిగా కొంత కాలం పనిచేశారు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆరంభంలో కోరస్ బృందంలో ఒక సభ్యుడిగా పాడిన మనో, బయట స్టేజ్ షోల్లో సైతం పాటలు పడుతూ వచ్చారు. మనో ప్రతిభను గుర్తించిన చక్రవర్తి, ఇళయరాజా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇళయరాజానే నాగూర్ బాబు పేరును మనోగా మార్చారు. ఇళయరాజాతో పని చేస్తున్న సమయంలోనే సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితో ఏర్పడ్డ పరిచయం మనో జీవితంలో కీలకమైన మలుపు.

బాలునే తన గురువుగా భావించి, మనో ఆయనతోనే కలసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బాలు సైతం సొంత తమ్మునిలా మనోను ప్రోత్సహించారు.తన కెరీర్‌లో బాలు సపోర్ట్ కూడా చాలా ఉందని మనో పలు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. వీరిద్దరూ దేశ విదేశాల్లో ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్‌లు, మ్యూజిక్ షోలు చేశారు. బాలు గారి చొరవ వల్లే మనోకు అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఉన్న అగ్ర కథానాయకులందరికి పాటలు పాడారు. ఇప్పటి వరకు 15 భారతీయ భాషల్లో సుమారు 50 వేల పైచిలుకు పాటలు పాడారు.
   
ఘంటసాల, కిషోర్ కుమార్, మహ్మద్ రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం.. వీరందరూ మనోకి అభిమాన గాయకులు. వీరు పాడే పాటలంటే మనోకి చాలా ఇష్టం. పాకిస్థానీ గాయకుడు గులాం అలీ పాటలను కూడా మనో ఎంతో అభిమానిస్తారు. ముఖ్యంగా ఘంటసాల పాడిన శివశంకరి, రసికరాజా, మది శారదాదేవి వంటి పాటలను తన కచేరీలలో పాడి పేరు సంపాదించుకున్నారు మనో. తనలాంటి వారు గాయకులుగా పేరు తెచ్చుకునేందుకు ఘంటసాల గారి పాటలే కారణమని మనో తరచూ చెబుతుంటారు.

కిల్లర్ సినిమాలోని 'ప్రియా.. ప్రియతమా', శివలోని 'సరసాలు చాలు చాలు శ్రీవారు', నిర్ణయం చిత్రంలోని 'మిల మిల మెరిసిన తార', ప్రేమికుడులోకి 'ముక్కాలా ముక్కాబ్బులా', పెళ్లి చేసుకుందాం సినిమాలోని 'ఓ లైలా లైలా', ముత్తు సినిమాలోని 'తిల్లానా తిల్లానా', కొదమ సింహంలో 'పిల్లో జాబిల్లో', దళపతిలో 'ముద్దబంతి'  పాటలు మనో ఆలపించినవే.  గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా ఎన్నో సినిమాలకు స్వరాలు సమకూర్చారు.

గాయకుడి తర్వాత మనోకు బాగా పేరు తెచ్చింది డబ్బింగ్. కెరీర్ మొదట్లో తెలుగులోకి అనువాదమయ్యే పర బాషా చిత్రాల ముఖ్యపాత్రలకు గాత్ర దానం చేశారు. కమల్ హాసన్ కు ‘సతీ లీలావతి, బ్రహ్మచారి’ చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. అయితే, 1995లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ముత్తు చిత్రానికి తెలుగులో మనో చెప్పిన డబ్బింగ్, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, రజనీకాంత్ మెప్పును సైతం పొందారు. అప్పటి నుంచి రజనీకాంత్ చిత్రాలన్నిటికి మనో డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే, బాలు గారు తెలుగులో కమల్ హాసన్ కు గాత్రం దానం చేస్తే, మనో రజనీకాంత్ కు గాత్ర దానం చేస్తూ వచ్చారు.    

గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నప్పటికి తన దరి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ నటుడిగా వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచారు. అంతేకాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించారు. బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. ఏది ఏమైనా మనో గానం ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉంది. ఆయన మరిన్ని పాటలతో అలరిస్తారని ఆశిద్దాం.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com