తెలుగు వారితో 'కబుర్లు' ఆడిన చలసాని

- October 27, 2024 , by Maagulf
తెలుగు వారితో \'కబుర్లు\' ఆడిన చలసాని

ఎన్ని మాటల్లో ఎంతగా చెప్పుకొన్నా ”సెల్ఫ్‌మేడ్‌ మ్యాన్‌” అన్న పదబంధం అర్థమైనంత స్పష్టంగా మరోమాట అర్థంకాదు. దీనికి ఉదాహరణ  చలసాని ప్రసాదరావు. చిత్రకళ, ఛాయా చిత్రకళ, జర్నలిజం, రచన, సంపాదకత్వం, విమర్శ, కార్యనిర్వహణ… ఇవన్నీ ఆయన ముఖాలు. ఆయన నిర్మొహమాటి, తలవంచని జర్నలిస్టు. వామపక్ష మిత్రుల్ని ప్రేమిస్తూనే వారిలోని ఆరాచకత్వాన్ని, అమానవీయ విలువల్ని తూర్పారబట్టే నిష్పక్షపాతి.కళాసాహిత్యాల్ని చివరివరకూ ప్రేమించి రాశిలోనూ వాసిలోనూ గణనీయమైన కానుకల్ని గర్వంగా అందించిన వ్యక్తి. నేడు ప్రముఖ తెలుగు సాహితీవేత్త స్వర్గీయ చలసాని ప్రసాదరావు జయంతి.

తెలుగు సాహిత్య ప్రపంచంలో చలసానిగా సుపరిచితులైన చలసాని ప్రసాదరావు 1939, అక్టోబరు 27న ఉమ్మడి కృష్ణాజిల్లా, మొవ్వ తాలూకా భట్లపెనుమర్రు గ్రామంలోని సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి వామపక్ష పార్టీలకు మద్దతుదారుగా ఉండేవారు. వారి స్ఫూర్తితో పలు ఉత్తరాంధ్రలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. తండ్రితో పటు చలసాని వారు అక్కడే బాల్యమంత గడిపారు. అదే సమయంలో ఆయన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయారు.ఆ సమయంలో వారి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించారు. ఇక ఆయన పుస్తకాల పురుగైపోయారు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ‘ప్రజాశక్తి, విశాలాంధ్ర’ పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరారు.  

”బాల్యంలోనే నేను లెఫ్టిస్టు రాజకీయ సాహిత్యాలకు సన్నిహితంగా వెళ్లడం వలన, ఆ తర్వాత ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో పనిచేయడం వలన, ఆ నాటి హేమాహేమీలైన సాహితీపరులు, జర్నలిస్టులు, కళాకారుల మధ్య పెరగడం వలన నా అభివృద్ధి, అభిరుచుల పరిణితి శీఘ్రతరం అయ్యాయి” అని ఆయనే చెప్పుకున్నట్లు ఆయనపై ఏ విధమైన ప్రభావాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. 1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఆయన 1956నాటికి వరంగల్లు చేరుకున్నారు. ‘కాకతీయ పత్రిక’అనే వార పత్రికలో అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశారు.

అక్కడ పనిచేస్తూనే హైదరాబాద్‌ లోని ప్రభుత్వ ఫైనార్ట్స్‌ కళాశాలలో కమర్షియల్‌ ఆర్ట్‌లోఅయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు పూర్తిచేశారు. ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు దీర్చారు. 1961లో ఆయన సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించారు. ఆరు సంపుటాలు ఆణిముత్యాలని విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం.

 ‘కళ’ తొలి సంపుటం వచ్చేనాటికి ఆయన విద్యార్థి మాత్రమే! ‘కళ’తోపాటు ‘కాకతీయ శిల్పం’, ‘ఆధునిక చిత్రకళ’, ‘రష్యన్‌ చిత్రకళ’ ‘చిత్తప్రసాద్‌ బొమ్మల ఆల్బమ్‌’ ‘రసన’ వంటి వాటిని ఆయన ప్రచురించి కళారంగానికి ఎనలేని సేవ చేశారు. ఈ గ్రంధాలన్నీ ఆంగ్లంలోకి అనువాదం కావడం మరో విశేషం. ‘కాకతీయ శిల్పం’ ఒక పరిశోధన గ్రంథం. అది రాసేనాటికి ఆయన వయసు ముప్ఫై మాత్రమే. వేయిస్థంభాల గుడి, రామప్ప గుడి… ఇలా అనేక గుళ్లలో నెలకొన్న శిల్ప సంపదను నిశితంగా పరిశీలించి వివరణాత్మక వ్యాసాలు రాశారు. అలాగే చక్కని ఫోటోలు తీసి ప్రచురించారు.

యునెస్కోసంస్థ 1964లో ‘బుక్‌ ఇలస్ట్రేషన్ల’ మీద ఢిల్లీలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న చలసాని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచారపౌర సంబంధశాఖలో స్టాఫ్‌ ఆర్టిస్టుగా చేరారు. అప్పట్నించీ ఆయన ఎన్నో కోర్సులు పూర్తిచేశారు. లండన్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోటెక్నాలజీ సంస్థ డిప్లొమా పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందారు. 1971లో ‘వసుధ’ అనే పత్రికకి సంపాదకులయ్యారు. 1974లో ‘ఈనాడు’లో తొలుత ‘ఆదివారం అనుబంధం’ పార్ట్‌ టైమ్‌ సంపాదకులుగా చేరి 75నాటికి పూర్తిస్థాయి సంపాదకులయ్యారు. దాని తర్వాత ‘విపుల, చతుర’ మాస పత్రికలతో పాటు అడపా తడపా వచ్చే ప్రత్యేక సంచికలకు ఆయనే సంపాదకత్వం వహించారు.

చలసాని గురించి ఆయన మిత్రులు ఒక సంఘటన చెబుతుంటారు. 1978లో’విపుల’లో ‘మాలిక్‌ కా ఘర్‌’ అనే హిందీ కథ తెలుగు అనువాదం ప్రచురితమైంది. దాని రచయిత కె.ఎల్‌ గాంధీ, కృష్ణకాంత్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన సలహాదారుగా ఢిల్లీనుంచి హైదరాబాద్‌ వచ్చారు. తన కథని ప్రచురించిన ‘విపుల’ పత్రికాఫీసుకి ఫోన్‌చేసి తన కథ అనువాదం ప్రచురితమైన ‘విపుల’ ప్రతి ఒకటిమ్మని కోరారు.రాష్ట్రగవర్నరు ఆఫీసునుంచి ఈనాడు కార్యాలయానికి అయిదు నిముషాలకన్నా ఎక్కువ సమయం పట్టదు. గుమాస్తా వచ్చేలోపలే ఇరవయ్యేళ్లక్రితం నాటి సంచికని సిద్ధంచేసి, గుమస్తారాగానే పంపారు. గాంధీ ఆశ్చర్యపోయారు. చలసానిని ఓసారి రాజ్‌భవన్‌కి రమ్మని ఆహ్వానించారు. అక్కడ ఆయన్ని కలుసుకున్న తర్వాత గాంధీ ఆయన ప్రతిభనీ, చెవిటితనాన్ని అధిగమించి తననితాను నిరూపించుకున్న వైనానికీ ఆయన మరీ ఆశ్చర్యపోయారు!

ఈనాడు పత్రికలో ఆయన రెండువందలకు పైగా పుస్తకాల్ని సమీక్షించారు.’కబుర్లు’అనే శీర్షికని వెయ్యివారాలకు పైగా నిర్వహించారు. ఆ శీర్షిక జిగి, బిగి తగ్గకుండా చూశారు. ”కబుర్లు రచయితగా నా లక్ష్యం పాఠకుల్ని కాసేపు నవ్వించే హస్యగాడుగా ఉండిపోవడం కాదు. ఒక అంశం గురించి నేను ఫీలయినదాన్ని నా పాఠకులు కూడా ఫీలయ్యేలా నా రచన కొనసాగాలనేది నా లక్ష్యం. అందుకే కబుర్లలో హాస్యం పాలుకంటేవ్యంగ్యం పాలు ఎక్కువ” – అనేవారాయన. నిజానికి ‘కబుర్లు’ శీర్షికని’వసుధ’ అనే మాసపత్రికలో 1971లో ప్రారంభించారు. ఆ తర్వాత ‘జ్యోతి’అనే మరో మాసపత్రికలో కొనసాగింది. చివరికి 1982 అక్టోబరు 22న ‘ఈనాడు’ దినపత్రికలో వాటికి శాశ్వత చిరునామా కల్పించారు. నిరాఘాటంగా తన జీవితాంతం ‘ఈనాడు’లోనే కబుర్లాడారు.

రవీంద్రనాధ్‌ టాగూర్‌ ఆత్మకథ ”రవి కథ” ఆయన రాసిన తొలి పుస్తకం. తన కథలతో 1969లో ‘కథలు కాకర కాయలు’ అనే పుస్తకం ప్రచురించారు. 1977లో ‘మాస్టర్‌ పీచు’ అనే మరో కథల సంపుటి, 75లో చైనా కథల అనువాదం ‘మార్పు’, 77లో మార్క్సిస్టు సిద్ధాంతవేత్తల మీద ‘నిజాలు’, అనువాద కథల సంపుటాలు ‘రాజులబూజు’, ‘ఆరడుగులనేల’, జూలియస్‌ పుజిక్‌ రచన అనువాదం ‘రక్తాక్షరాలు’, కళలు, సాహిత్యం మీద రాసిన వ్యాసాల సంపుటి ‘రచన’ ఇలా ఎన్నో రచనలు ఆయన బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నాయి. 1991లో ప్రచురించిన ‘ఇలా మిగిలాం’ గ్రంథం సాహిత్య జగత్తులోనూ, కమ్యూనిస్టు మేధావుల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. దాన్ని సమర్థించిన వారే అధికులు. కుండ బద్దలు కొట్టినట్లు సూటిగా నిజాలుచెప్పి ఎందరెందరో భుజాలు తడుముకునేట్లు చేశారు.

ఆయన చిత్రకళ మీద ప్రచురించిన గ్రంథాలు గురించి తెలిసిందే. చలసాని స్నేహశీలి. తెలుగునాట ఎందరో యువ రచయితల్ని మరియు అనువాదకుల్ని తయారుచేశారు. ప్రసిద్ధ రచయిత మహీదర రామమోహనరావుకి ఆత్మీయంగా తన కథల సంపుటి ‘శత్రువు’ను అంకితం చేశారు. 1963లో సంజీవదేవ్‌ ‘రసరేఖలు’ ప్రచురించే సమయంలో అన్నిపనులు ఆయనే ముందుండి చూశారు. ఇలా ఎవరు ఏది కోరినా చేసే స్నేహశీలి చలసాని. 1999 చలసానికి అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మిత్రుల్ని తన ఇంటికి ఆహ్వానించారు. ఆ సందర్భంగా దర్శక రచయిత అక్కినేని కుటుంబరావు ఆయన మీద ఓ లఘచిత్రం రూపొందించారు.

చలసాని ప్రసాదరావు ‘కళ’ ఆరు సంపుటాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పునర్ముద్రిస్తోంది. ఆయన ‘కబుర్లు’ నుంచి ఎంపిక చేసిన వాటిని ‘జాగ్తేరహో’ పుస్తకంగా ముద్రించడం ఆయన కబుర్లు ప్రేమించిన వారికి ఆనందదాయకం. కబుర్ల చలసాని, కళాపిపాసి చలసాని, కళాసాహిత్యాల మేలి కలబోత చలసాని 2002 జూన్‌ పన్నెండో తేదీ తన జీవితం ముగింపుదశని ఓ చేదు ‘కబురు’గా చేసి మిత్రుల్ని దుఃఖసాగరంలో ముంచారు. ”నిశ్శబ్దసాగరంలోని ఓ మహాకెరటం ఉవ్వెత్తునలేని ప్రపంచాన్ని తనదైన దృష్టితో వీక్షించి అలా అలవోకగా వెళ్లి పోయింది. తన నిశ్శబ్దాన్ని రంగులుగా, భాషగా, మహా సౌందర్యవంతమైన మానవ హృదయంగా అనువదించుకున్న చలసాని” అని ఆయన మిత్రులు అన్నట్లే ఆయన నిజంగానే తెలుగు సాహితీ జగత్తులో మహాకెరటం. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com