ఇండియన్ స్పీడ్ డాన్సర్-రాఘవ లారెన్స్
- October 29, 2024
’కష్టించి పనిచేసేవాడిదే ఈ లోకం..’ అన్నారు పెద్దలు. ఆ మాటను తు.చ. తప్పక పాటించిన వారిలో అత్యధికులు విజయతీరాలు చేరుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నూ తప్పకుండా చేర్చాలి. ప్రపంచం అతని ధైర్యాన్ని చూసి తలవంచుకుంది. మనసులో కోరిక ఉంటే ఏ లక్ష్యం కష్టం కాదని నిరూపించాడు. ఎంతో కష్టపడి ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నారు రాఘవ్ లారెన్స్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాఘవ కెరీర్ సాగింది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడుగా రాఘవ తన ప్రతిభను చాటుకుంటూ చిత్ర పరిశ్రమలో ముందుకు సాగుతున్నారు. నేడు రాఘవ లారెన్స్ పుట్టినరోజు.
రాఘవ లారెన్స్ అసలు పేరు లారెన్స్ మురుగైయన్. 1976, అక్టోబర్ 29న చెన్నైలోని రాయపురంలో క్రిస్టియన్ పరైయర్ కుటుంబానికి చెందిన మురుగైయన్, కన్మణి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచీ అనారోగ్యం అతణ్ణి వెంటాడింది. బ్రెయిన్ లో ట్యూమర్ కారణంగా రెండు కాళ్ళు చచ్చు పడిపోయాయి. ఆయన తల్లి, ఎందరో దేవుళ్ళను మొక్కుకున్నారు. రాఘవేంద్రస్వామి గుడిని సందర్శించిన తరువాత లారెన్స్ ఆరోగ్యం మెరుగుపడ సాగింది. ఆపరేషన్ చేస్తే కానీ బతకడని చెప్పిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా లారెన్స్ మెదడులోని ట్యూమర్ కరిగిపోయింది. అతని రెండు కాళ్ళూ బలం చేకూరి నడవడం మొదలెట్టడం చూసి అందరూ ‘అదో అద్భుతం’ అన్నారు.
శ్రీరాఘవేంద్రస్వామి తనను కరుణించాడని ఆ తల్లి మనసు పులకించిపోయింది. లారెన్స్ తన పేరుకు ముందు ఆ స్వామి పేరును ‘రాఘవ’ అని పెట్టుకున్నారు. అప్పటి నుంచీ రాఘవ లారెన్స్ గా మారిపోయారు. అయితే అందరూ అతణ్ణి లారెన్స్ అనే పిలిచేవారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ వద్ద కారు క్లీనర్ గా పనిచేశాడు లారెన్స్. ఆ సమయంలో అతనికి ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్రాయన్ కారు క్లీన్ చేసే బాధ్యతలు అప్పగించారు. అతను తన పనితో పాటు నృత్యం చేసేవాడు. ఒకసారి రజనీకాంత్ అతని డ్యాన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి రాఘవ్‌ని డాన్సర్స్ యూనియన్‌లో చేర్చుకున్నారు. దీని తర్వాత రాఘవ్ లారెన్స్ అదృష్టం మారిపోయింది.
లారెన్స్ పలువురు ప్రముఖ నృత్య దర్శకుల వద్ద పనిచేశారు. గ్రూప్ డాన్సుల్లో తరచూ కనిపించేవారు. సుందరం మాస్టర్, ప్రభుదేవా కంపోజ్ చేసిన పలు చిత్రాలలో లారెన్స్ డాన్సర్ గా పనిచేశారు. ‘ముఠామేస్త్రీ’ సినిమా షూటింగ్ లో “ఈ పేటకు నేనే మేస్త్రి…” పాట చిత్రీకరణలో లారెన్స్ లోని ఈజ్ ను చూసి, అతణ్ణి ముందు వరుసలో నిలచి డాన్స్ చేయమని చిరంజీవి ప్రోత్సహించారు. అలా లారెన్స్ కు తొలిసారి ముందువరుసలో చిందేసే అవకాశం లభించింది. అప్పటి నుంచీ డాన్స్ మాస్టర్స్ సైతం అతనికి ప్రాధాన్యమివ్వసాగారు. కొందరు నృత్య దర్శకులు లారెన్స్ తోనే కంపోజ్ చేయించేవారు.
తెలుగులో జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆంటీ’ సినిమాలో “డింబ డింబరో…” పాటలో లారెన్స్ చేసిన డాన్స్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచీ స్పెషల్ సాంగ్స్ లో లారెన్స్ కు చిందేసే అవకాశాలు లభించాయి. ‘ఆంటీ’ నిర్మించిన టి.వి.డి.ప్రసాద్ తరువాత తీసిన ‘పెళ్ళాల రాజ్యం’కు కూడా లారెన్స్ ను కొరియోగ్రాపర్ గా ఎంచుకున్నారు. లారెన్స్ లోని స్పీడును చూసి అదే టి.వి.డి. ప్రసాద్ అతణ్ణి హీరోగా పరిచయం చేస్తూ ‘స్పీడ్ డాన్సర్’ మూవీని నిర్మించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది.
లారెన్స్ కు మాత్రం కొరియోగ్రాఫర్ గా మంచి అవకాశాలు లభించాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి టాప్ స్టార్స్ అందరి చిత్రాలకు లారెన్స్ తన కొరియోగ్రఫీతో ఎంతగానో అలరించారు. ఆ సమయంలో కొన్ని చిత్రాలలో అలా తెరపై తళుక్కు మంటూ సాగారు లారెన్స్. అప్పుడే అతని మనసులో డైరెక్షన్ పై గాలి మల్లింది. అప్పటికే ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించిన నాగార్జునను కలిసి ‘మాస్’ కథ వినిపించారు లారెన్స్ . ఆ కథ నాగ్ కు నచ్చడం, అందులో ఆయనే హీరోగా నటించి, నిర్మించడం జరిగిపోయాయి. లారెన్స్ కోరుకున్న విధంగా దర్శకుడయ్యారు. ‘మాస్’ ఘనవిజయంతో దర్శకునిగా లారెన్స్ కు మంచి పేరు లభించింది.
లారెన్స్ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ ‘స్టైల్’ నిర్మించారు. అందులో రాఘవపై అభిమానంతో చిరంజీవి, నాగార్జున, స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఒకప్పుడు తన గ్రూప్ లో డాన్సర్ గా పనిచేసిన లారెన్స్ డైరెక్షన్ లో నటించడానికి ప్రభుదేవా సైతం అంగీకరించారు. అలా రూపొందిన ‘స్టైల్’ మంచి పేరే సంపాదించి పెట్టింది. ఆ తరువాత తమిళంలో దెయ్యం కథతో ‘ముని’ రూపొందించారు రాఘవ లారెన్స్. అది పెద్ద హిట్. ఆపై నాగ్ తో ‘డాన్’ తీస్తే అదీ ఆకట్టుకుంది. తమిళంలో ‘ముని’ సీక్వెల్ గా తెరకెక్కించిన ‘కాంచన’ బంపర్ హిట్ కావడంతో రాఘవ పేరు దర్శకునిగా మారుమోగి పోయింది.
కృష్ణంరాజు, ప్రభాస్ తో రాఘవ లారెన్స్ రూపొందించిన ‘రెబల్’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “కాంచన-2, కాంచన-3” కూడా భలేగా వినోదం పంచాయి. ‘కాంచన’ రీమేక్ గా హిందీలో ‘లక్ష్మి’ రూపొందించారు. ఇదే లారెన్స్ కు దర్శకునిగా తొలి హిందీ చిత్రం. అది అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.
అన్నయ్య, పార్థాలే పరవశం, ఇంద్ర, స్టైల్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన రాఘవ లారెన్స్‌కు ఆ చిత్రాలకు గాను ఉత్తమ నృత్య దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డ్స్ లభించాయి. అన్నయ్య, ఇంద్ర, స్టైల్ సినిమాలోని పాటలకు కూడా నృత్య దర్శకత్వం వహించినందుకు నంది అవార్డులు కైవసం చేసుకున్నారు.అంతేకాకుండా ఎడిసన్ అవార్డ్, మణిధనేయం పురస్కారాలను రాఘవ లారెన్స్ కైవసం చేసుకున్నారు.
2015 లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించిన తరువాత ఆయన పేరుతో లారెన్స్ ఒక సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సేవా సంస్థ ఏర్పాటుకు గాను కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. లారెన్స్ తన పరిధిలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నారు లారెన్స్.
తన కెరీర్ లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ కోరుకున్న స్థానం చేరుకున్న రాఘవ లారెన్స్ తన చుట్టూ ఉన్నవారికి చేతనైన సాయం చేస్తూ ముందుకు పోతున్నారు. చిత్రసీమలో ఒకప్పుడు బాగా రాణించి, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికీ లారెన్స్ చేతనైన సాయం చేస్తూ ఉంటారు. మనసున్న మనిషిగా చిత్రసీమలో గుర్తింపు సంపాదించిన లారెన్స్ రాబోయే సినిమాలతో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!