ఇజ్రాయెల్‌కు షాక్‌.. పాలస్తీనా కోసం సౌదీ అరేబియా కీలక సమ్మిట్‌

- November 01, 2024 , by Maagulf
ఇజ్రాయెల్‌కు షాక్‌.. పాలస్తీనా కోసం సౌదీ అరేబియా కీలక సమ్మిట్‌

హమాస్‌, హోజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్‌, ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్‌తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది.

నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్‌ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.

ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.

కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.

ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com