వామపక్ష రాజకీయ దిక్సూచి-విఎస్సార్

- November 15, 2024 , by Maagulf
వామపక్ష రాజకీయ దిక్సూచి-విఎస్సార్

విఎస్సార్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సుపరిచితులైన వంకాయలపాటి శ్రీనివాసరావు ఉమ్మడి నెల్లూరు జిల్లా మర్రిపూడి సమితిలోని కెల్లంపల్లి గ్రామంలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాలలోనే ఇంటర్ ,డిగ్రీ పూర్తి చేశారు.

శ్రీనివాసరావు తండ్రి స్వర్గీయ కామ్రేడ్ వంకాయలపాటి వెంకటస్వామి గారు కమ్యూనిస్టు పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు.నాటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కొండపి, దర్శి మరియు పొదలి నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం పనిచేసిన గుజ్జల యల్లమందా రెడ్డి , దివి శంకరయ్య వంటి పలువురు ముఖ్య నాయకులతో కలిసి అనేక ప్రజా పోరాటాల్లో పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు పుచ్చలపల్లి సుందరయ్య, మోటూరి హనుమంతరావు, మకినేని బసవపున్నయ్య , చండ్ర రాజేశ్వరరావు గార్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

వెంకటస్వామి కమ్యూనిస్టు పార్టీ(సీపీఎం) తరుపున తమ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఆర్.ఎం.పి వైద్యుడిగా పనిచేశారు. చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీలోనే కొనసాగారు.తండ్రి స్పూర్తితో కమ్యూనిస్టు భావజాలంపై చిన్నతనంలోనే మక్కువ పెంచుకున్నారు.1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక సమయంలో వీరి తండ్రి సీపీఎం వైపు వెళ్లడంతో చిన్నతనం నుంచే తండ్రితో పాటు ఆ పార్టీ సమావేశాల్లో పాల్గొనేవారు.

కావలి జవహర్ భారతి కళాశాలలో చదువుతున్న సమయంలోనే వామపక్ష విద్యార్థి సంఘం ఎస్.ఎఫ్.ఐ లో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ కళాశాల విద్యార్థుల సమస్యలపై నెల్లూరు జిల్లాలో పలు విద్యార్థి పోరాటాలు నిర్వహించారు.1978–79 మధ్యన ఎస్.ఎఫ్.ఐ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.

1979- 1982 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు  పార్టీ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి క్రియాశీలక కార్యకర్తగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ తరుపున పనిచేయడం ప్రారంభించి జిల్లా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అనంతరం రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడిగా మరియు పలు అనుబంధ విభాగాల్లో పనిచేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు. ఫ్లోరైడ్ బాధితుల తరుపున , దళితులపై జరిగిన దాడులు వంటి ఉద్యమాల్లో కీలకమైన పాత్ర పోషించారు. రాష్ట్ర స్థాయిలో శ్రీనివాసరావు రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా మోన్ శాంటో బీటీ విత్తనాలపై వీరు ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటం మరువులేనిది.

రైతు కూలీ సంఘంలో పనిచేస్తున్న సమయంలోనే పార్టీ ఆదేశాల మేరకు ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు.జర్నలిజంలో డిగ్రీలు లేకపోయినా తన దీక్షా దక్షతలతో ప్రజాశక్తి దిన పత్రిక సర్కులేషన్ పెరగటానికి దోహదపడ్డారు. వామపక్ష జర్నలిస్టులను తయారు చేసే ప్రజాశక్తి జర్నలిజం కళాశాల ఆధునికీకరణ వీరి హయాంలోనే జరిగింది.

శ్రీనివాసరావు కృషిని గుర్తించిన పార్టీ అగ్రనాయకత్వం 2005లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులై 2021 వరకు పనిచేశారు.పార్టీ ఆదేశాల మేరకు 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.కార్యదర్శిగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు పలు అంశాలపై ఉద్యమిస్తున్నారు.

శ్రీనివాసరావు  వ్యక్తిగతంగా సౌమ్యుడైనప్పటికీ ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు వెనుకాడరు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీలోని వివిధ అనుబంధ సంఘాల నాయకుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించడంతో పాటు వారిని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇప్పటికే విజయవంతం అయ్యారు.

సుమారు 5 దశాబ్దాల ప్రజా రాజకీయ జీవితంలో అన్ని పార్టీల నాయకులతో రాజకీయంగా విభేదించారు తప్పించి వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేసిన దాఖలాలు మచ్చుకైనా లేవు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అంతేకాకుండా, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి వామపక్ష దిగ్గజం బీవీ రాఘవులు గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు గారు ఎన్నికయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com