నేడు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- November 21, 2024 , by Maagulf
నేడు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు ఆమె నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు తలెతకుండా పోలీసులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో నేడు రేపు (గురు, శుక్రవారాలు) ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.పలు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ వెల్లడించారు.

ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్‌ ల్యాండ్‌ జంక్షన్, బేగంపేట్‌ ఫ్లైఓవర్, శ్యాంలాల్‌ బిల్డింగ్, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్‌ ఔట్‌గేట్, ఎయిర్‌పోర్టు వై.జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్‌ భవన్‌ రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, నెక్లెస్‌ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్‌ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్‌ మినార్, ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్, అశోక్‌నగర్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.

ఈనెల 22న (శుక్రవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్‌ సమాచారం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ టోల్ ఫ్రీ నెంబర్ 85004 11111 అందుబాటులో ఉంటుందని చెప్పారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.

ఇకపోతే..రాష్ట్రపతి ముర్ము ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com