పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

- November 21, 2024 , by Maagulf
పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో పాలతో కలిపి అరటి పండును కలిపి పిల్లలు, పెద్దలు తేడా లేకుండా తింటారు. చాలా మంది వీటితో రోజును ప్రారంభిస్తే.. కొందరు వ్యాయామానికి ముందు ఈ ఫుడ్ కాంబినేషన్ ఇష్టపడతారు. ఈ రెండింటిలో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే ఈ రెండింటిని సూపర్ ఫుడ్స్ అంటారు నిపుణులు. అయితే, ఈ రెండు కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అన్న విషయం ఇప్పటికి చాలా మందికి తెలియదు. అయితే, ఈ ఫుడ్ కాంబినేషన్‌తో కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.

అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, బి6 ఉన్నాయి. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం వంద గ్రాముల పండిన అరటిపండ్లలో 12.3 mg విటమిన్ సి, 0.2 mg విటమిన్ B-6, 1.7 గ్రాముల ఫైబర్, 326 mg పొటాషియం ఉంటాయి. ఇక, పాలలో కూడా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. దీంతో.. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్ కాంబినేషన్ సూపర్ అని నిపుణులు చెబుతున్నారు.  

అరటిపండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. పాలలో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు ఆరోగ్యకరమైన గట్ హెల్త్‌కు సాయపడతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటిపండులోని అమైలేస్ వంటి సహజ ఎంజైమ్‌లు శరీరంలోని ఆహారాన్ని ప్రాసెస్ చేయడంలో సహాయపడతాయి. ఫలితంగా పాలతో పాటు అరటి పండును కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంతేకాకుండా మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి.

అరటిపండ్లు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పాలలోని ప్రోటీన్ కంటెంట్ కారణంగా శక్తి మరింత బూస్ట్ అవుతుంది. అందుకే వ్యాయామాలు చేసేవారికి ఇది బెస్ట్ కాంబినేషన్. వర్కౌట్స్ చేసే ముందు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చాలా ఉత్సాహంగా, ఎనర్జీతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండులోని సహజ కార్బోహైడ్రేట్లు, పాలలోని ప్రొటీన్ కండరాల పెరుగుదలకు సాయపడతాయి. 2009లో ది ఫిజిషియన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, వ్యాయామం చేసిన తర్వాత ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కణజాలం బాగుపడుతుంది. అంతేకాకుండా కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ కండరాలలో గ్లైకోజెన్ నిల్వలను భర్తీ చేయడానికి అరటిపండ్లు కార్బోహైడ్రేట్‌లను అందించడంలో సాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అరటిపండులో ఉండే అధిక పీచు పదార్థం మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. అదే పాలతో కలిపి తీసుకోవడం వల్ల మీకు ఆకలి త్వరగా వేయదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఈ రెండింటిని తినడం వల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గిపోతుంది. పాలతో కూడిన అరటి పండు కాంబినేషన్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మిల్క్ కాంబినేషన్‌తో అరటి పండు తినడం వల్ల ప్రయోజనాలే కాదు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. 2021లో జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం, ఆవు పాలతో అరటిపండును ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఇది గుండె, కాలేయానికి హానికరం. ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి.

పాలతో కూడిన అరటిపండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. USDA ప్రకారం, వంద గ్రాముల పండిన అరటిపండులో 85 కేలరీలు ఉంటాయి . USDA ప్రకారం.. 100 గ్రాముల మొత్తం పాలలో 61 కేలరీలు ఉంటాయి. దీంతో ఈ ఫుడ్ కాంబినేషన్ ఎక్కువగా తీసుకోని ఎటువంటి వ్యాయామాలు చేయకపోతే బరువు పెరిగే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మోతాదులో తినకూడదు. ఒక కప్పు పాలు, చిన్న అరటి పండు తింటే చాలు.

కొందరు అజీర్తి, అలెర్జీ సమస్యలతో బాధపడతారు. ఇలాంటి వారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి. లాక్టోస్ అసహనం ఉన్నవారు వీటిని కలిపి తినడం వల్ల అతిసారం, వికారం, కడుపు తిమ్మిరి, బోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. లాక్టోస్ అసహనం ఉన్నవారు పాలలోని చక్కెర లేదా లాక్టోస్‌ను పూర్తిగా జీర్ణించుకోలేరు. ఇక, అరటి పండులో కూడా చక్కెర ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com