రైతు నాయకుడు బాలయ్య
- November 25, 2024
ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేనాటికి సాధారణ యువకుడు. తన ప్రాంత రైతులు పడుతున్న కష్టాలకు చలించిపోయి రైతాంగ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆచార్య రంగాతో కలిసి ఆంధ్ర ప్రాంతమంతటా పర్యటించి, వారి కష్టాలను ప్రభుత్వాలకు తెలిపేలా పత్రికలు నడిపారు. రైతుల సంక్షేమమే దేశ సంక్షేమంగా నమ్మిన అతి కొద్దీ వ్యక్తుల్లో చేగిరెడ్డి బాలిరెడ్డి అలియాస్ బాలయ్య ఒకరు. చివరి శ్వాస వరకు రైతుల అభ్యున్నతికి పాటుపడ్డ నాయకుల్లో బాలయ్య ముందువరసలో ఉంటారు.
బాలయ్యగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి సూపరిచితులైన స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖ రైతు నాయకులు చేగిరెడ్డి బాలిరెడ్డి ఒకప్పటి మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా గిద్దలూరు ఫిర్కా బోగోలు గ్రామంలోని ఎగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.(నేడు బోగోలు గ్రామం ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత పరిధిలోని అర్థవీడు మండలంలో భాగంగా ఉంది). చిన్నతనం నుంచే దేశ స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆసక్తి దానికి తోడు మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై ప్రాథమిక దశలోనే చదువుకు స్వస్తి పలికి స్వాతంత్ర్య ఉద్యమంతో మమేకమయ్యారు.
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూనే రైతాంగ సమస్యలపై దృష్టి సారించారు. నాటి రాయలసీమలోని కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడి కరువు కటాలకు నిలయమైన గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాల్లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. సాగునీటి వనరుల కొరత, కరువు పరిస్థితులు, కామందుల దగ్గర తీసుకున్న అప్పులకు హెచ్చు వడ్డీలు కట్టలేక ఆ ప్రాంతంలో కుటుంబాలకు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం.
స్వతహాగా రైతైన బాలిరెడ్డి తన ప్రాంత రైతుల దీన స్థితికి చలించి వారి తరుపున నిలిచారు. ఇదే సమయంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై పోరాడుతున్న రైతు నాయకులు ఆచార్య ఎన్.జి.రంగా తో వీరికి పరిచయం ఏర్పడింది. రంగాతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నిడుబ్రోలు గ్రామంలో వారు ప్రారంభించిన రామానీడు రైతాంగ విద్యాలయం లో విద్యార్థిగా చేరి పలు అంశాలపై శిక్షణ పొందారు.
ఈ క్రమంలో రంగా గారి ఆలోచనలకు ప్రభావితుడైన బాలిరెడ్డి గారు రైతాంగ విద్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కొంత కాలం అక్కడ అధ్యాపకులుగా వ్యవహరించారు. అనంతరం తన స్వస్థలానికి చేరి తన ప్రాంతంలో రైతు సాయుధ పోరాటాలతో మొదలై అతి కొద్ది కాలంలోనే రాయలసీమ జిల్లాల్లో రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించారు. పలు మార్లు జైలుకు సైతం వెళ్లారు. రంగా ఆధ్వర్యంలో నిర్వహించే కిసాన్ మేళా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతల్లో బాలయ్య కీలకంగా వ్యవహరించేవారు.
ఒకవైపు రాయలసీమలో జరుగుతున్న రైతు పోరాటల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తన గురువు రంగా గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయించారు. అనాదిగా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా నంద్యాల అవల ఉన్న ప్రాంతాల్లో త్రాగు, సాగునీరు కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లను తీర్చాలని కోరుతూ మద్రాస్ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు.
బాలిరెడ్డి గారు కేవలం రాయలసీమ ప్రాంతానికే పరిమితం కాలేదు, కోస్తా జిల్లాల్లో ఉధృతంగా జరిగిన జమీందారి రైతాంగ సాయుధ పోరాటల్లో పాల్గొన్నారు. రంగా ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రతి రైతు సంబంధిత కార్యక్రమాల్లో బాలిరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బాలిరెడ్డి గారు భారతదేశం రైతు ప్రతినిధిగా పలు అంతర్జాతీయ రైతు సమావేశాల్లో పాల్గొన్నారు.ఆరోజుల్లో యూరోప్ మొత్తాన్ని సందర్శించిన అతికొద్ది మంది నాయకుల్లో వీరు ఒకరు.
బాలిరెడ్డి రాజకీయాల్లోనూ రాణించారు. గురువు రంగాతో కలిసి రాయలసీమలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతుల వల్ల అనేక మంది యువకులు తర్వాత కాలంలో రాజకీయ నాయకులుగా ఎదిగి మంత్రి పదవులను అధిష్టించారు. కాంగ్రెస్ బ్రాహ్మణ నేతలైన పట్టాభి, కళా వెంకట్రావులు రంగాకు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక, 1951 పీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో నీలం సంజీవ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్లో రంగాను గెలవనీయకుండా వారు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలో రంగా అనుచరులైన బాలిరెడ్డి, గౌతు లచ్చన్న, రాజగోపాల్ నాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిలు సమర్థవంతంగా ప్రయత్నించినప్పటికీ కేవలం 5 ఓట్ల తేడాతో రంగా ఓటమి పాలయ్యారు.
రంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కృషికార్ లోక్ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీని ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలోపేతం చేయడానికి బాలిరెడ్డి ఎంతో కృషి చేశారు. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ నుంచి కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రధాని నెహ్రూ ఆహ్వానం మేరకు రంగాతో కలిసి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు.
1957లో కొత్తగా ఏర్పాటైన మార్కాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం చేపట్టిన సహకార వ్యవసాయాన్ని ప్రధాని నెహ్రూ దేశవ్యాప్తంగా చేపట్టాలనుకున్న సమయంలో దాని వల్ల భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని భావించి రంగా గారితో కలిసి ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడారు. 1962లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ నేతల సహాయ నిరాకరణ మూలంగా కమ్యూనిస్టు నేత గుజ్జుల యల్లమందా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
బాలిరెడ్డి గారు ఎందరో యువకులను రాజకీయాల్లోకి ప్రోత్సహించారు. వారందరూ తర్వాత కాలంలో ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఎదిగారు. ఇంకొందరు మంత్రులుగా పనిచేశారు.బాలిరెడ్డి గారు పెద్ద చదువులు చదువుకోక పోయినా తమిళం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సాధించారు. పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలపై అనర్గళంగా ప్రసంగించేవారు. బాలిరెడ్డి గారు పాత్రికేయ వృత్తిలో కూడా కొనసాగారు. రైతు సమస్యలపై పలు ఇంగ్లీష్ , తెలుగు పత్రికలకు వ్యాసాలు రాశారు. అంతేకాకుండా రైతుల కోసం రంగా గారి సహకారంతో "విజయప్రభ " పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు.
రైతు పోరాటాల వల్ల రాయలసీమ రైతాంగంలో వీరికి వస్తున్న గుర్తింపు ఓర్చుకోలేని కొందరు పెత్తందారీ కాంగ్రెస్ నేతలు ఆయన్ని రాజకీయంగా ఎదగనీయకుండా తెరవెనుక అనేక కుట్రలకు పాల్పడ్డారు. వీరి కారణంగా బాలిరెడ్డి గారికి రాజకీయాల్లో ఆశించినంత గుర్తింపు దక్కలేదు. అంతేకాకుండా 1962లో మార్కాపురం ఎంపీగా పోటీ చేసిన వీరిని ఓడించారు. బాలిరెడ్డి గారు తన చివరి శ్వాస వరకు రైతాంగం సంక్షేమం కోసమే పనిచేశారు. ఇటువంటి నాయకుల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







