కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూత

- December 10, 2024 , by Maagulf
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూత

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి  ఎస్ఎం కృష్ణ (92) కన్నుమూశారు. కొద్దికాలంగా వృద్ధాప్యం రిత్యా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా.. మంగళవారం తెల్లవారు జామున బెంగళూరు సదాశివనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎంఎం కృష్ణ 1999 – 2004 మధ్య కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2018లో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎస్ఎం కృష్ణ మృతివార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఎస్ఎం కృష్ణ మైసూర్ లోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యారు. అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన ఎస్ఎం కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంకు 16వ ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్ గా, కేంద్ర విదేశాంగ మంత్రిగానూ పనిచేశారు. ప్రజా వ్యవహారాల రంగంలో ఎస్ఎం కృష్ణ అందించిన అసమాన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2023లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగినప్పటికీ.. చివరి దశలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఎస్ఎం కృష్ణ కర్ణాటక అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యుడిగా, 1993 నుంచి 1994 వరకు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా  బాధ్యతలు చేపట్టారు. 2004 – 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా, 2009 -2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా కొనసాగారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతోఉన్న సుదీర్ఘ అనుబంధానికి స్వస్తిచెప్పి 2017 మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. గతేడాది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎస్ఎం కృష్ణ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com