విక్టరీకి కేరాఫ్ అడ్రస్ దగ్గుబాటి వెంకటేష్
- December 13, 2024
విక్టరీ వెంకటేష్.. ఈ పేరు వింటే ఆరు సంవత్సరాల చిన్న పాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వారి వరకు…ఆయన్ని అభిమానించే వారే ఉంటారు. ఆయన్ని అభిమానించని వారు ఉండరు అన్నడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే తమ సొంత సినిమాలనే భావిస్తారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ గురించి చెప్పనవసరం లేదు. వెంకీ మామ సినిమా విడుదలవుతోంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అదొక పండగ. ఎలాంటి క్యారెక్టర్ నైనా తన నేచురల్ యాక్టింగ్ తో రఫ్ ఆడించే అతి కొద్ది మంది హీరోల్లో మన వెంకటేష్ ముందుంటారు. అలాంటి మన వెంకీ మామ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..
వెంకీ మామగా సుపరిచితులైన టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ 1960, డిసెంబర్ 13న ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు జన్మించారు. వెంకటేష్ అసలు పేరు వెంకటేశ్వర్లు, తన తాత దగ్గుబాటి వెంకటేశ్వర్లు గారి పేరునే ఆయనకి పెట్టారు. వెంకటేష్ బాల్యం మొత్తం చెన్నైలోనే సాగింది. చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో ప్లస్ 2 వరకు, లయోలా కాలేజ్ నుంచి బీకామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మాంటెస్సోరిలోని మిడిల్‌బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ సినీ నిర్మాతల్లో ఒకరు. అత్యధిక సినిమాలు నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కడమే కాకుండా మూవీ మొఘల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోస్ ద్వారా ఎందరో ఉపాధి పొందుతున్నారు.1971లో వచ్చిన 'ప్రేమ్ నగర్'లో బాలనటుడిగా వెంకటేష్ చేశారు. 1986లో వచ్చిన 'కలియుగ పాండవులు' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. ఇందులో హీరోయిన్‌గా చేసిన ఖుష్బూకు దక్షిణాదిలో ఇది మొదటి చిత్రం. కలియుగ పాండవులలో వెంకీ నటనకు నూతన కథానాయకుడిగా నంది అవార్డు లభించింది.
అనంతరం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 'స్వర్ణకమలం'లో వెంకీ నటించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం వెంకటేష్‌కు చాలా తొందరగా వచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని 1989 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. 1988లో వచ్చిన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం 'ప్రేమ'లో నటించారు. 'శ్రీనివాస కళ్యాణం', 'బ్రహ్మ పుత్రుడు', 'బొబ్బిలి రాజా' లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన 'క్షణ క్షణం' సినిమా చేశారు వెంకటేష్. సెకండ్ రన్‌లో బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకొన్న ఈ చిత్రం.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
1991లో ఫ్యామిలీ డ్రామా 'చంటి'లో నటించారు. దానిని హిందీలో 'అనారి'గా రీమేక్ చేశారు. ఇందులోనూ వెంకటేష్ హీరోగా.. హీరోయిన్‌గా కరిష్మా కపూర్ చేశారు. ఇది హిందీలో వెంకీకి మొదటి చిత్రం. తెలుగు, హిందీ భాషల్లోనూ ఇది హిట్‌గా నిలిచింది. ఆ ఏడాదే 'శత్రువు', 'సూర్య ఐపీఎస్'తో పాటు 'చినరాయుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
‘కూలీ నెం.1’, ‘క్షణ క్షణం’, ‘చంటి’, ‘సుందరకాండ’, ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ‘పవిత్రబంధం’ వంటి సినిమాలతో నటుడిగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు.‘సూర్యవంశం’, ‘గణేష్’, ‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజా’, ‘కలిసుందాం రా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఘర్షణ’, ‘మల్లీశ్వరి’, ‘సంక్రాంతి’, ‘లక్ష్మీ’, ‘తులసి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’, ‘గురు’, ‘ఎఫ్ 2’, ‘వెంకీ మామ’, ‘ఎఫ్ 3’,’నారప్ప’, సైంధవ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
వెంకటేష్‌ను నంది పురస్కారాలు ఏకంగా ఏడుసార్లు వరించాయి. 'కలియుగ పాండవులు'కు బెస్ట్ మేల్ డెబ్యూగా, 'స్వర్ణ కమలం' సినిమాకు బెస్ట్ యాక్టర్ స్పెషల్ జ్యూరీగా, 'ప్రేమ', 'ధర్మ చక్రం', 'గణేష్', 'కలిసుందాం రా', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. ఫిలింఫేర్ పురస్కారాలకు వెంకీ అంటే ఎంత ఇష్టమో చెప్పడం కష్టం. 'బ్రహ్మపుత్రుడు', 'ధర్మ చక్రం', 'గణేష్', 'జయం మనదే రా' సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారు. 'కలిసుందాం రా' చిత్రానికి ఫిలింఫేర్ స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. 'గురు' చిత్రానికి ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
వెంకటేష్ తన కెరీర్‌లో 75 చిత్రాల్లో హీరోగా నటించారు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. ఇలా ఏ హీరోకూ సక్సెస్ రేటు లేదనే చెప్పాలి. ఆరంభంలో అన్ని జోనర్లలో సినిమాలు చేసిన వెంకటేష్.. తర్వాత ప్రయోగాత్మక చిత్రాలతో వచ్చాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలనూ చేశాడు. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, కొన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ఇవన్నీ వెంకటేష్ రేంజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్లాయి.
వెంకటేష్ అత్యధికంగా తమ సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఎక్కవ చిత్రాల్లో నటించారు. వెంకటేష్ వల్ల సురేష్ ప్రొడక్షన్స్ ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించింది. సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ చేసిన చిత్రాల్లో అత్యధిక చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. తన తరం హీరోలైన చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), నాగార్జున(Nagarjuna)లతో సమానంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్నారు.
ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్టుగా వెంకీకి మంచి పేరుంది. తెలుగులో ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీల్లో తీస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు వెంకటేష్. తెలుగులో శోభన్ బాబు తర్వాత అత్యధిక ఫ్యామిలీ చిత్రాల్లో నటించిన ఘనత వెంకీకి దక్కుతుంది. అందుకే తెలుగు నెల మీద ఆ నటభూషణుడి తర్వాత వెంకీకి మహిళల్లో ఫాలోయింగ్ ఎక్కువ. వెంకీ సినిమా వచ్చిందంటే చాలు సకుటుంబ సపరివార సమేతంగా కలిసి చూడాల్సిందే. అతని సినిమాల్లో సీరియస్నెస్ ,యాక్షన్ తో పాటు కామెడీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే అన్ని రకాల ప్రేక్షకులకి వెంకీ సినిమా అంటే అంత ఇష్టం.
కాంట్రవర్సీలకి దూరంగా ఉండే సినిమాల్లోనే వెంకటేష్ ఎక్కువగా నటించారు. తన సినీ కెరీర్లో.. ఎన్నో మంచి చిత్రాలలో నటించడమే కాకుండా వైవిధ్యమైన తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు వెంకీ. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారంతా మన వెంకీ స్కూల్ నుంచి వచ్చిన వారే. టబు దగ్గర నుంచి ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతున్న కత్రినా కైఫ్ వరకు మొదట నటించింది మన వెంకటేష్ సినిమాలోని. దివ్య భారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి లాంటి స్టార్ హీరోయిన్లు వెంకీ సినిమాలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
సినీ ఇండస్ట్రీలో వివాదరహితంగా ఉండే యాక్టర్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు వెంకటేష్.టాలీవుడ్ లో అజాతశత్రువు అని కూడా ఆయనకు పేరు ఉంది. తన పర్సనల్ లైఫ్ ను.. ప్రొఫెషనల్ లైఫ్ ని ఎక్కువగా మిక్స్ చేయకుండా జాగ్రత్తగా ఉంటాడు.తన కుటుంబానికి సంబంధించిన ఏ విషయాలు ఎక్కువగా మీడియా దగ్గరకు రాకుండా జాగ్రత్త తీసుకునే నటుడు వెంకటేష్.. అతని కుటుంబం ఎప్పుడూ లైమ్ లైట్‌కు దూరంగా ఉంటుంది. ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో మంచి క్రేజ్ మీద ఉన్న ఈ స్టార్ త్వరలో సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి