టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్-దిల్ రాజు
- December 18, 2024
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.హీరోలతో సమానమైన ఇమేజ్ ఈయన సొంతం. ఒక్కసారి దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వచ్చిందంటే హిట్ అనే ముద్ర ప్రేక్షకుల్లో ఉంది. ఎప్పుడో ఒకసారి ఈయన అంచనాలు తప్పుతుంటాయి. నిర్మాతగానే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా తనదైన ముద్ర వేశారు దిల్ రాజు.నేడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని గురించి ప్రత్యేక కథనం.
దిల్ రాజు అసలు పేరు వెంకటరమణా రెడ్డి. 1970 డిసెంబర్ 18న నిజామాబాద్ నార్సింగ్ పల్లిలో జన్మించారు. ఆయనను బంధుమిత్రులు ‘రాజు’ అంటూ అభిమానంగా పిలిచేవారు. చదువుకొనే రోజుల నుంచీ రాజుకు సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. హైదరాబాద్ వచ్చి, బంధువులతో కలసి తొలుత ఆటోమొబైల్ బిజినెస్ లో కాలుమోపారు. తరువాత సినిమాలపై అభిమానంతో అనుభవం కోసం కొన్ని పంపిణీ సంస్థల్లోనూ పనిచేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ పై పట్టు సాధించగానే మిత్రులతో కలసి సొంత బ్యానర్ ‘శ్రీవేంకటేశ్వర ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్’ పెట్టుకున్నారు. తొలుత కోడి రామకృష్ణ ‘పెళ్ళిసందడి’ని నైజామ్ ఏరియాలో విడుదల చేశారు. ఆ పై అనేక విజయవంతమైన చిత్రాలను విడుదల చేసి పంపిణీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు.
దిల్ రాజుకు మణిరత్నం అంటే ఎంతో అభిమానం. ఆయన రూపొందించిన ‘కన్నత్తిల్ ముత్త మిట్టాల్’ను తెలుగులో ‘అమృత’ పేరుతో అనువదించారు. ఆ అనువాద చిత్రంలో దిల్ రాజు భాగస్వామి. అదే రాజు చిత్రనిర్మాణంలో తొలి అడుగు. తరువాత నితిన్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ సినిమా నిర్మించి విజయం సాధించారు. ఆ సినిమా సక్సెస్ తరువాత అందరూ ఆయనను ‘దిల్’రాజు అంటూ పిలిచారు. ఆ పేరే ఇప్పటికీ స్థిరపడిపోయింది.
టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి చిత్రాలను పంపిణీ చేసిన దిల్ రాజు, వారిలో పవన్ కళ్యాణ్, రవితేజ, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నితిన్, సిద్ధార్థ్, రామ్ పోతినేని, నాని, శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, సునీల్ వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. సీనియర్ స్టార్ వెంకటేశ్, మహేశ్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తెరకెక్కించిన రాజు, తరువాత వెంకటేశ్ తో వరుణ్ తేజ్ ను కలిపి ‘ఎఫ్-2, ఎఫ్-3’ చిత్రాలనూ రూపొందించారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళంలో సైతం చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు రాజు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని రాజు తపిస్తూ ఉంటారు. అందువల్లే ప్రేక్షకులు సైతం దిల్ రాజు బ్యానర్ నుండి ఓ సినిమా వస్తోందంటే సదరు చిత్రంలో ఏదో వరైటీ ఉంటుందని విశ్వసిస్తూంటారు.నైజామ్ లోనే కాకుండా వైజాగ్ లోనూ దిల్ రాజు తన పంపిణీ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన మునుముందు మరిన్ని చిత్రాలతో జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







