కర్షక ప్రధాని-చౌధరీ చరణ్ సింగ్
- December 23, 2024
భారత దేశంలో రైతున్నలకు, వ్యవసాయానికి వన్నె తెచ్చిన మహనీయుడు చౌధరీ చరణ్ సింగ్. అన్నదాతల మేలుకోసం తన జీవిత కాలంలో ఎన్నో రైతాంగ పోరాటాలు చేయడమే కాకుండా, వారి సంక్షేమం కోసం మరెన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న రైతు నేత చరణ్ సింగ్. రైతే దేశానికి వెన్నెముక లాంటివాడని నమ్మి అన్నదాతల పక్షాన పోరాటలకే పరిమితం కాకుండా గాంధీజీ స్పూర్తితో దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. రైతు ప్రయోజనాలే తన సిద్ధాంత భావజాలంగా మార్చుకొని రాజకీయాల్లో రాణించారు. దేశానికి ఐదో ప్రధానిగా ఎన్నికయ్యారు. నేడు రైతు బంధు, భారతరత్న మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ 122వ జయంతి సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
రైతు బంధు చౌధరీ చరణ్ సింగ్ 1903, డిసెంబర్ 23న బ్రిటిష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్స్ రాష్ట్రంలోని అవిభక్త మీరట్ జిల్లాలో భాగమైన హాపూర్ తాలూకా నూర్పూర్ గ్రామంలో మధ్యతరగతి జాట్ రైతు కుటుంబంలో జన్మించారు. మీర్ సింగ్, నేతార్ కౌర్ దంపతులు ఆయన తల్లిదండ్రులు. 1923లో ఆగ్రా కళాశాల నుంచి సైన్స్‌లో డిగ్రీ మరియు హిస్టరీలో ఎంఏ పూర్తిచేశారు. 1927లో మీరట్ కళాశాల నుంచి లా కోర్స్ పూర్తి చేశారు.
న్యాయవాదిగా ఉన్నప్పటికీ స్వతహాగా రైతు కుటుంబానికి నుంచి వచ్చిన చరణ్ సింగ్ గారు వ్యవసాయ రంగం మీద మక్కువ ఎక్కువగా చూపేవారు. తన దగ్గరకు వచ్చే రైతుల దగ్గర కొన్నిసార్లు డబ్బులు తీసుకోకుండానే కేసులు వాదించేవారు. వ్యవసాయం మీద మక్కువ తో అత్యంత ధనాన్ని ఆర్జిస్తున్న న్యాయవాద వృత్తికి స్వస్తి పలికారు. అనంతరం మహాత్మా గాంధీ సూచించిన మార్గాన్ని ఎంచుకొని చురుగ్గా స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
1929లో మీరట్‌కు వచ్చి కాంగ్రెస్‌లో చేరిన చరణ్ సింగ్ 1937లో తన 34వ ఏట చప్రౌలీ నుంచి యునైటెడ్ ప్రావిన్స్ అసెంబ్లీకి తోలి సారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1946, 1952, 1962, 1967లో సైతం ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1946లో గోవింద్ బల్లభ్ పంత్ ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. 1951లో న్యాయ, సమాచార శాఖల కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1952లో డాక్టర్ సంపూర్ణానంద్ మంత్రివర్గంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1959లో పదవికి రాజీనామా చేసినప్పుడు రెవెన్యూ, రవాణా శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
1960లో చంద్రభాన్ గుప్త మంత్రివర్గంలో హోం, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 1962- 63వరకు సుచేతా కృపలానీ మంత్రివర్గంలో వ్యవసాయం, అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు.1965లో వ్యవసాయ శాఖ నుంచి వైదొలిగి 1966లో స్థానిక స్వపరిపాలన శాఖ బాధ్యతలు చేపట్టారు.1967లో కాంగ్రెస్ ను వీడి సోషలిస్టులు, జనసంఘ్ నేతలతో సంయుక్త విధాయక్ దళ్ పక్షనేతగా ఎన్నికై తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1970, ఫిబ్రవరి ఫిబ్రవరిలో రెండోసారి సీఎం బాధ్యతలు చేపట్టగా, ఇందిరా సర్కార్ 1970,అక్టోబర్ 2న రాష్ట్రపతి పాలన విధించి చరణ్ సింగ్ సర్కార్ ను డిస్మిస్ చేయడం జరిగింది. 1971-77 వరకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కోనసాగారు.
1975లో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు సైతం వెళ్లారు. 1977లో జనతా పార్టీ స్థాపనలో సైతం కీలకంగా వ్యవహరించడమే కాకుండా, 1977-79 వరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఉపప్రధానిగా ఉంటూనే హోమ్, ఆర్థిక శాఖలను నిర్వహించారు. జనతా ప్రభుత్వం నుంచి జనసంఘ్ వైదొలిగిన తర్వాత.. కాంగ్రెస్ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానిగా చౌధరీ చరణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ లోక్ సభలో తన మెజారిటీని నిరూపించుకోకముందే ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని పదవికి చరణ్ సింగ్ రాజీనామా చేశారు. 1980 జనవరి 14 వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు. 1980 నుంచి 1987 వరకు లోక్ దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు.
పరిపాలనలో అసమర్థత, బంధుప్రీతి, అవినీతిని సహించని కఠినమైన నాయకుడిగా చరణ్ సింగ్ ప్రసిద్ధి చెందారు. ఆయన గొప్ప వక్త, ఆయన పార్లమెంట్లో సమస్యలపై ప్రసంగిస్తుంటే అధికార పక్ష నేతలు ఆసక్తిగా వినేవారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గా ఉన్న సమయంలో దేశంలో నే తొలిసారిగా జమీందారి చట్టాన్ని రద్దు చేశారు, ఆయన్ని అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో సైతం జమీందారి చట్టం రద్దు చేయడం జరిగింది. అలాగే, సన్న, చిన్నకారు రైతులకు కోసం కౌలుదారీ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. భూసంస్కరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చి నిరుపేద రైతాంగానికి భూమిని పంచి మేలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో భూసంస్కరణల కోసం చేసిన కృషికి పూర్తి క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. గ్రామీణ రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే డిపార్ట్మెంటల్ రుణ ఉపశమన బిల్లు (Debt Redemption Bill), 1939 ముసాయిదా రూపకల్పన ఖరారు చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన తీసుకున్న చొరవ ఫలితంగా ఉత్తరప్రదేశ్‌లో మంత్రులకు జీతాలు, ఇతర ప్రయోజనాలు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యమంత్రిగా, 1960 ల్యాండ్ హోల్డింగ్ చట్టం తీసుకురావడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరకంగా ఉండేలా భూమిని కలిగి ఉండేందుకు గరిష్ట పరిమితిని తగ్గించే లక్ష్యంతో ఈ చట్టం తీసుకొచ్చారు.
వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అవగాహ చేసుకున్న వ్యక్తి గా వారి ప్రతినిధిగా చట్టసభల్లో కి ప్రవేశించి వారి అభ్యున్నతికి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడు చరణ్ సింగ్. జవహర్లాల్ నెహ్రూ సహకార వ్యవసాయాన్ని చేపట్టాలని నాగపూర్ కాంగ్రెస్‌లో తీర్మానం చేయించిన సందర్భంలో ఆచార్య ఎన్జీరంగా వలనే చరణ్‌సింగ్ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సహకార వ్యవసాయంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని, దీర్ఘకాలంలో వ్యవసాయ ఉత్పత్తికి దెబ్బ తగులుతుందని చెబుతూ వివరణాత్మక పుస్తకాలను రచించి, ప్రచారం కూడా చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా సైతం లెక్కలేనన్ని వ్యవసాయ రంగ పథకాలు అమలు కు కృషి చేశారు. అలాగే, 1979లో దేశానికి ప్రధానమంత్రి అయిన తరువాత రైతుల మీద మోపబడుతున్న అనవసర పన్నులను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమం కోసం 1978లోనే కిసాన్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వారి సమస్యలను గుర్తించి పరిష్కారాలు కోసం కృషి చేయడమే లక్ష్యంగా ఈ ట్రస్ట్ ఇప్పటికి పనిచేస్తుంది. ఈ ట్రస్ట్ అందించిన సహాయం ద్వారా ఏంతో మంది సన్న, చిన్న కారు రైతులు బాగుపడ్డారు.
కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యాన్ని, మద్దతును ఇవ్వటం ద్వారా కోట్లాది మంది స్వయం వృత్తిదారులకు ఉపాధి అవకాశములను మెరుగుపరుస్తూ, దేశ ప్రజానీకానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిని భారీ ఎత్తున మూలధన పెట్టుబడుల అవసరము లేకుండానే సాధించవచ్చునని మహాత్మాగాంధీ ప్రబోధించిన సిద్ధాంతంపట్ల చరణ్ సింగ్‌కు పూర్తి విశ్వాసం ఉంది. భారత రాజకీయవేత్తలలో ఈ అంశాలపై అత్యంత లోతైన పరిశోధనలు జరిపిన వ్యక్తి చరణ్‌సింగ్.
ప్రజల మధ్య ఉంటూ, సులువుగా పని చేస్తూ ఇంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకులు మన దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. లక్షలాది మంది రైతుల మధ్య ఉంటూ సంపాదించిన ఆత్మవిశ్వాసం చరణ్ సింగ్ సొంతం. జీవితాంతం చరణ్ సింగ్ చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. రాజకీయాల్లో తీరికాలేకున్న ఖాళీ సమయాల్లో చదవడం, రాయడం అలవాటు చేసుకున్నారు. 'జమీందారీ నిర్మూలన', 'భారతదేశంలో పేదరికం మరియు దాని పరిష్కారం', 'రైతులకు భూమి', 'కనీసం కంటే తక్కువ హోల్డింగ్‌ల విచలనం', 'సహకార వ్యవసాయం 'ఎక్స్-రాడ్' లాంటి అనేక పుస్తకాలు రాశారు.
రైతుల హక్కులు కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడమే కాకుండా, ఉన్నత రాజకీయ కుటుంబాలకు చెందిన వారు మాత్రమే దేశ ప్రధాన మంత్రులు అనే భావనలు పటాపంచలు చేస్తూ సామాన్య రైతు కుటుంబానికి చెందిన చరణ్ సింగ్ దేశ ఉపప్రధానిగా, ప్రధాని గా భాద్యతలు నిర్వహించి రైతు కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. భారత రైతాంగ సంక్షేమం కోసం పాటుపడ్డ చరణ్ సింగ్ 1987 మే 29న 84 ఏళ్ల వయస్సు లో మరణించారు. రైతుల అభ్యన్నతికి చరణ్ సింగ్ జీవితాంతం చేసిన కృషికి గానూ భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం "భారతరత్న"తో సత్కరించడమే కాకుండా ఆయన జన్మదినాన్ని "జాతీయ రైతు దినోత్సవం"(కిసాన్ దివస్)గా 2001లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలోని ఆయన సమాధిని "కిసాన్ ఘాట్ "గా పిలవబడుతుంది. ఆయన మరణించి నాలుగు దశాబ్దాలు అవుతున్నా, దేశ రైతుల్లో ఆయన నింపిన స్పూర్తితో తమ హక్కుల సాధన కోసం ఈనాటికి రైతులు ఉద్యమిస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







