జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

- December 24, 2024 , by Maagulf
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

డబ్బులు చెల్లించాక.. ఏదైనా వస్తువు, సేవను పొందే హక్కు వినియోగదారునికి పూర్తిగా ఉంటుంది. వారిని మోసగించినా.. తప్పుదోవ పట్టించినా.. ఈ సమయంలో వినియోగదారులకు అండగా నిలుస్తుంది.. వివాదాల పరిష్కార కమిషన్‌. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా.. కమిషన్‌ ద్వారా ఫిర్యాదులు పరిష్కృతమయ్యే తీరుపై ప్రత్యేక కథనం. 

వినియోగదారుల రక్షణ చట్టం భారతదేశంలో 1986 డిసెంబర్ 24న అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసేవారు వినియోగదారులు. కొనుగోలుదారు అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకునే వారు సైతం వినియోగదారులే. జిల్లాలో వినియోగదారులకు జరిగే అన్యాయంపై జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం పోరాటం చేస్తుంది. రోజురోజుకూ కొత్త టెక్నాలజీ అందుబాటులో వస్తున్న ఈ తరుణంలో నకిలీ వస్తువులు జాడ్యం మార్కెట్‌ను పట్టి పీడిస్తున్నది. దీనిని అధిగమించడానికి వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించవచ్చు.  

వినియోగదారుల హక్కులు: 

1. భద్రత హక్కు: వినియోగదారులు కొనుగోలుచేసే వస్తువులు, పొందే సేవలు తక్షణ అవసరాలు తీర్చేవిగానే కాకుండా దీర్ఘకాలంగా ఉండాలి. అని వినియోగదారుల ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ఈ భద్రత పొందడానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలని, వీలైనంత వరకు ఐఎస్‌ఐ, హోల్‌మార్క్‌ చిహ్నాలు ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలి. 

2. సమాచారం పొందే హక్కు: వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యత ప్రమాణం, ధరల గురించి సంపూర్ణ సమాచారం పొందవచ్చు. 

3. వస్తువుల ఎంపిక హక్కు: అనేక రకాల వస్తువులను, సేవలను తగిన సరసమైన ధరలలో పొందడం వినియోగదారుల హక్కు. 

4. అభిప్రాయం వినిపించే హక్కు: వినియోగదారులు వినియోగదారుల వేదికలపై తమ అభిప్రాయాలను వినిపించవచ్చు. ప్రభుత్వం ఇతర సంస్థలు ఏర్పాటుచేసే పలు సంఘాలలో ప్రాతినిధ్యం పొందగల రాజకీయేతర, వాణిజ్యేతర వినియోగదారుల సంఘాలను ఏర్పర్చుకోవడం కూడా ప్రాథమిక హక్కు. 
 
 5. న్యాయపోరాటం: అన్యాయమైన వాణిజ్య విధానాలను, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు. 

బాధ్యతలు: 

గుడ్డిగా ఏ వస్తువూ కొనవద్దు. కొనదలచిన వస్తువు పూర్తి సమాచారాన్ని సేకరించాలి. కాస్మోటిక్స్‌ ఉత్పత్తులపై తప్పనిసరిగా వస్తువు ధర తయారీ, ఎక్స్‌పైరీ తేదీ, తయారుదారి చిరునామా, వస్తువు బరువును ముద్రించాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎమ్మార్పీపై మరో స్టిక్కర్‌ అంటించి దాని ధరను మార్చి అమ్మడం నేరం. కొనుగోలు చేసే సమయంలో రసీదు తీసుకోవాలి. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారంటీ కార్డును షాపు యాజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో (కోర్టులో) సమర్పించడానికి ఉపయోగపడతాయి. 

సాంకేతికత పెరగడంతో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, టెలి మార్కెటింగ్ తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో 2019లో కొత్త రక్షణ చట్టం రూపొందించింది. 2020 జులై 20 నుంచి ఇది దేశమంతటా అమల్లోకి వచ్చింది.‘వినియోగదారుడా మేలుకో’ అనే నినాదంతో వినియోగదారుల వ్యవహారాలు ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కొత్త చట్టంలో ఈ కామర్స్ నిబంధనలు తీసుకురావడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు కూడా ఇది వర్తించనుంది. 

జిల్లా స్థాయిలో కంజ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్‌‌లో ఫిర్యాదు చేయవచ్చు. న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. రూ.5 లక్షలు విలువైన వస్తుసేవల వరకు సంబంధించిన కేసులలో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనక్కర్లేదు. చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజుల్లోపు తీర్పులు వెలువరిస్తారు. జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పుపై అసంతృప్తి ఉంటే రాష్ట్ర కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. 

దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే లేదా ఉద్యోగం చేసే జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. రూ. 50 లక్షలు విలువైన వస్తుసేవలకు సంబంధించిన కేసుల వరకు జిల్లా స్థాయిలో విచారిస్తారు. రూ. 50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు విలువజేసే కేసులను రాష్ట్ర కమిషన్‌లో విచారిస్తారు.రూ. 2 కోట్ల విలువ కన్నా పైన ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాలి. బాధితులు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ-దాఖిల్ https://edaakhil.nic.in/  అనే వెబ్‌సైట్/యాప్‌ అందుబాటులో ఉంది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ( ఎన్‌సీ‌హెచ్) మొబైల్ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. 

1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేస్తారు. వస్తువు కొనేటపుడు బిల్లు, రశీదు, ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఇన్‌వాయిస్‌లను, ఐడీలను భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిర్యాదు సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ‘వినియోగదారుల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వ శాఖలు కూడా వస్తాయి. ఉదాహరణకు రైలు టికెట్లు రద్దు చేసుకుంటే సంబంధిత డబ్బులు అకౌంట్‌లో పడకపోయినా ఫిర్యాదు చేయవచ్చు''. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com